Panchayat Elections: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో రెండు వేల మందితో భారీగా పోలీసు భద్రత ఏర్పాట్లను చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్(Commissioner Sunil Dutt) తెలిపారు. ఎన్నికలలో పోలీసుల విధివిధానాలపై దిశానిర్దేశం చేశామని, పౌరుల స్వేచ్ఛకు భంగం కలగకుండా ప్రలోభాలకు తావు లేకుండా ఓటరు పోలింగ్ కు కదిలేలా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి తగిన ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఇప్పటికే మండలాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో సాయుధ పోలీసు బలగాలను మొహరించినట్లు తెలిపారు.
స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్
ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్(Special Striking Force), రూట్ మొబైల్ పార్టీలు, 5 ఎఫ్ఎస్టీ బృందాలు, 15 ఎస్ఎస్టీ బృందాల ద్వారా నిఘా కొనసాగుతోందని, డబ్బు, మద్యం ప్రభావాన్ని నియంత్రించేలా తనిఖీలు చేపడుతున్నామని అన్నారు. ఇప్పటికే 953 బైండోవర్ కేసుల్లో 6403 మందిని తాహసిల్దార్ ఎదుట హాజరు పరిచామని పేర్కొన్నారు. జిల్లాలో జరిగే మూడు విడతల పోలింగ్ లో 184 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, వాటిల్లో నామినేషన్ల దాఖలు ప్రక్రియ నుంచే పోలీసుల నిఘా పెంచామని, గ్రామంలో ప్రతి కదలికపై ఏసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు. పోలింగ్ రోజున ప్రత్యేక బలగాలతో బందోబస్తు నిర్వహిస్తామని, జిల్లా కేంద్రంలో” స్పెషల్ బ్రాంచి, ఇతర సిబ్బందితో 24 గంటలూ పనిచేసేలా ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని అన్నారు. అదేవిదంగా జిల్లా వ్యాప్తంగా 16 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, సరిహద్దు ప్రాంతాలలో ప్రత్యేక పోలీసు తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి తనిఖీ కేంద్రం వద్ద ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం ఉంటుందన్నారు. గ్రామాల్లో అనధికారిక మద్యం నిల్వలు ఏర్పాటు చేసుకున్న మద్యం గొలుసు దుకాణాలపై దాడులు చేసి 12 లక్షల విలువ చేసే 1200 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు తెలిపారు.
Also Read: Telangana Holidays 2026: ఆదివారం వచ్చిన మూడు పెద్ద పండుగలు.. 2026 సెలవుల లిస్ట్ ఇదిగో
పాతనేరస్తులు కదలికలపై నిఘా
జిల్లాలో తుపాకులు కలిగిన 86 మంది ఆయుధాలను జిల్లా పోలీసు హెడ్ క్వాటర్స్ లో అప్పగించారని తెలిపారు. 207 మంది రౌడీ షీటర్లు 1100 మంది ట్రబుల్ మంగర్స్ పాతనేరస్తులు కదలికలపై నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. ఎన్నికలు జరిగే డివిజన్లలో ఇద్దరు ఏసీపీ స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించాని అన్నారు. శాంతిభద్రతల దృష్ట్యా ఆయా ఎన్నికలు జరిగే మండలలో సెక్షన్ 163 BNSS యాక్ట్ అమల్లో ఉంటుందని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కోసం గ్రామాల వారీగా భద్రతా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
గ్రామ పంచాయతీ పోలింగ్ కు పోలీస్ బందోబస్త్
అడిషనల్ డీసీపీలు ప్రసాద్ రావు, రామానుజం, కుమారస్వామి, విజయబాబు, ఏసీపీలు రమణమూర్తి, తిరుపతి రెడ్డి, వసుంధర యాదవ్, శ్రీనివాసులు, మహేష్, సాంబరాజు,సత్యనారాయణ, సర్వర్, సుశీల్ సింగ్, నర్సయ్య తో పాటు సిఐలు, ఆర్ ఐలు, ఎస్సై లు పోలీస్, హోంగార్డ్ సిబ్బంది మొత్తం 2000 మంది బందోబస్త్ లో పాల్గొన్నారు.
Also Read: Telangana BJP: స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఎదురవుతున్న సవాళ్లు.. పోటీకి కరువైన అభ్యర్థులు!

