Fuel Consumption: భారత్‌లో నవంబర్ నెలలో ఇంధన వినియోగం గణనీయంగా పెరిగి గత ఆరు నెలల్లోనే అత్యధిక స్థాయికి చేరింది. అక్టోబర్‌తో పోలిస్తే 5.5% పెరిగి మొత్తం 21.27 మిలియన్ మెట్రిక్ టన్నుల ఇంధనాన్ని దేశం వినియోగించినట్లు పెట్రోలియం మంత్రిత్వ శాఖ గణాంకాలు తెలుపుతున్నాయి. ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు వినియోగదారు, దిగుమతిదారుగా ఉన్న భారత్ రష్యా సముద్ర మార్గం నుంచి వచ్చే చమురును అత్యధికంగా కొనుగోలు చేస్తోంది. యూరప్, అమెరికా రష్యన్ చమురును దూరం పెడుతున్నప్పటికీ భారత్ మాత్రం భారీ తగ్గింపు ధరలను ఉపయోగించుకుని దిగుమతులు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో దేశీయ డిమాండ్ పెరగడం అంతర్జాతీయ ఎనర్జీ మార్కెట్‌లో కూడ ముఖ్యమైన అంశంగా మారింది.
పెట్రోలియం ప్లానింగ్, విశ్లేషణ సెల్ (PPAC) విడుదల చేసిన వివరాల ప్రకారం నవంబర్‌లో ఇంధన వినియోగం గతేడాదితో పోలిస్తే 3% వృద్ధి సాధించింది. పెట్రోల్ వినియోగం 3.52 మిలియన్ టన్నులుగా నమోదై అక్టోబర్‌తో పోలిస్తే స్వల్పంగా 4.1% తగ్గినా గతేడాదితో పోలిస్తే 2.6% పెరిగింది. మరోవైపు డీజిల్ వినియోగం భారీగా పెరిగింది. నెలవారీగా 12.2% పెరిగి 8.55 మిలియన్ టన్నులకు చేరుకుండా
గతేడాదితో పోలిస్తే కూడా 4.7% వృద్ధి సాధించింది. అలాగే LPG వినియోగం గతేడాదితో పోలిస్తే 7.1% పెరిగి 2.86 మిలియన్ టన్నులకు చేరింది. అయితే నాఫ్తా అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 19.1% తగ్గి 0.89 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. రోడ్ల నిర్మాణంలో ప్రధానంగా ఉపయోగించే బిటుమెన్ వినియోగం అక్టోబర్‌తో పోలిస్తే 37.9% పెరిగి గతేడాదితో పోలిస్తే కూడా 28.2% వృద్ధి చూపించింది. ఫ్యూయల్ ఆయిల్ వినియోగం గతేడాదితో పోలిస్తే 12% పెరిగినా అక్టోబర్‌తో పోలిస్తే 5.1% తగ్గుదల కనపడింది.
ఇక అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు కూడా ఈ ఇంధన వినియోగంపై ప్రభావం చూపుతున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల భారత్ పర్యటనలో భారత్‌కు నిరంతర ఇంధన సరఫరాలను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే, భారత్ మాత్రం అమెరికా ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. అమెరికా తాజాగా రష్యా ప్రముఖ చమురు సంస్థలైన లూకోయిల్, రోజ్‌నెఫ్ట్‌లపై కొత్త ఆంక్షలు విధించడంతో నవంబర్ 21 తర్వాత వీటితో లావాదేవీలు నిలిపేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వ రంగ చమురు కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL) ఆంక్షలు లేని రష్యన్ సరఫరాదారుల నుంచి జనవరి నెలకు సంబంధించిన చమురు లోడింగ్ ఆర్డర్లు పెట్టినట్లు సమాచారం.

