Smriti Mandhana: భారత మహిళా క్రికెటర్ సంచలన ప్రకటన
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మందాన (Smriti Mandhana) తన వ్యక్తిగత జీవితంపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ సంచలన ప్రకటన చేసింది. సంగీత దర్శకుడు, డైరెక్టర్ పలాష్ ముచ్చల్‌తో జరగాల్సిన తన వివాహాన్ని రద్దు ( Mandhana Calls Off Wedding) చేసుకుంటున్నట్లు ఆదివారం( డిసెంబర్ 7) అధికారికంగా వెల్లడించింది. వారాల తరబడి సాగిన ఊహాగానాలు, వదంతులకు ముగింపు పలుకుతూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ ప్రకటన చేసింది.
ప్రకటనలో ఏముందంటే?
పెళ్లి రద్దు చేసుకుంటున్నట్టుగా స్మృతి మందాన సుదీర్ఘంగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని రాసుకొచ్చింది. గత కొన్ని వారాలుగా తన జీవితంపై అనేక వదంతులు ప్రచారంలో ఉన్నాయని, తన వ్యక్తిగత విషయాలపై జరుగుతున్న ఈ ప్రచారంపై బహిరంగంగా స్పందించాల్సిన అవసరం ఉందని తాను భావిస్తున్నానని, తన వివాహం రద్దు అయ్యిందని ఆమె తెలిపింది.
Read Also- Local Body Elections: సర్పంచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నేతలు.. గెలవాల్సిందే అంటూ..!
వ్యక్తిగతంగా తాను చాలా గోప్యతను పాటించే వ్యక్తినని, అలానే ఉండాలని కోరుకుంటాను, కానీ పెళ్లి రద్దయిందనే విషయాన్ని తాను ఖచ్చితంగా తెలియజేయాలని ఆమె వివరించింది. ‘‘పెళ్లి విషయాన్ని ఇక్కడితో ముగించాలనుకుంటున్నాను. ఈ విషయంపై చర్చించడాన్ని అందరూ ఆపివేయాలని నేను కోరుకుంటున్నాను. కీలకమైన ఈ సమయంలో దయచేసి ఇరు కుటుంబాల గోప్యతను గౌరవించాలని కోరుతున్నాను. ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడి ముందుకు సాగడానికి మాకు తగినంత సమయాన్ని ఇవ్వాలని నేను అభ్యర్థిస్తున్నాను’’ అని మందాన కోరింది.
క్రికెటే తొలి ప్రాధాన్యత
ప్రతి ఒక్కరినీ ఉన్నత లక్ష్యాలు ముందుకు నడిపిస్తాయని తాను బలంగా నమ్ముతానని, తన విషయానికి వస్తే అత్యున్నత స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తానని మందాన ప్రస్తావించింది. దేశం తరపున క్రికెట్ ఆడడమే ఎప్పుడూ తన ప్రధాన లక్ష్యమని, తాను వీలైనంత ఎక్కువ కాలం భారతదేశానికి తరపున ఆడుతూ, ట్రోఫీలు గెలవాలని ఆశిస్తున్నానని ఆమె పేర్కొంది. తన దృష్టి ఎల్లప్పుడూ ఆటపైనే ఉంటుందని వివరించింది. ఇక, ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని, అందరి మద్దతుకు ధన్యవాదాలు అని ఆమె పేర్కొంది.
పెళ్లి వేడుకల వరకు…
స్మృతి మందాన, పలాష్ ముచ్చల్‌లకు కొన్నాళ్ల క్రితమే నిశ్చితార్థం జరిగింది. నవంబర్ 23న వివాహ జరగాల్సి ఉంది. పెళ్లి వేడుకలు గ్రాండ్‌గా నిర్వహించారు. మరికొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పెళ్లి రోజునే స్మృతి మందాన తండ్రి శ్రీనివాస్ మందాన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. గుండెపోటు వచ్చిందంటూ ప్రచారం జరిగింది. అందుకే, పెళ్లి ఆగిపోయిందని మందాన మేనేజర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇక, ఆ మరుసటి రోజు పలాష్ ముచ్చల్ కూడా అనారోగ్యానికి గురికావడం, అతడు కూడా హాస్పిటల్‌లో చేరడంతో ఎన్నో అనుమానాలు, ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.
వివాహం వాయిదా పడిన తర్వాత, స్మృతి మందాన తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి నిశ్చితార్థం, పెళ్లికి సంబంధించిన పోస్టులు, వీడియోలను తొలగించడంతో పెళ్లి రద్దు అయ్యినట్టేనంటూ వదంతులు ఊపందుకున్నాయి. ముచ్చల్‌కు సంబంధించిన కొన్ని వివాదాస్పద చాట్‌లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత స్మృతి సహచర క్రికెటర్లు సైతం పెళ్లి వేడుకలకు సంబంధించిన కంటెంట్‌ను తొలగించడంతో పెళ్లి రద్దయిందనే ప్రచారం బలపడింది. ఈ పరిణామాల నేపథ్యంలో, చాలా రోజులపాటు మౌనం వహించిన స్మృతి మందాన.. ఆఖరికి ఆదివారం నాడు అధికారికంగా పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించి, అన్ని ఊహాగానాలకు ముగింపు పలికినట్టు అయ్యింది.
Smriti Mandhana’s Instagram story. pic.twitter.com/dBB0LZCTlp
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 7, 2025

