Kamalapuram Panchayat: సింగరేణి మండలం కమలాపురం పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవమైంది. నామినేషన్ల గడువు ఆఖరిరోజైన శుక్రవారం సాయంత్రానికి అన్ని స్థానాలకు ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలైంది. ఏకగ్రీవాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గ్రామంలో 8 వార్డులుండగా రెండు వార్డులు జనరల్, రెండు వార్డులు జనరల్ మహిళ, నాలుగు వార్డులు ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. సర్పంచిగా వడ్డె సులోచన(Vadde Sulochana) అలియాస్ రాఠోడ్ సులోచన (కాంగ్రెస్), 1వ వార్డు సభ్యునిగా గుత్తా గంగయ్య (కాంగ్రెస్), 2వ వార్డు సభ్యునిగా దూదిపాళ్ళ భాస్కర్ రావు (టీడీపీ), 5వ వార్డు సభ్యురాలిగా అన్నాప్రగడ శాంత కుమారి (టీడీపీ), 6వ వార్డు సభ్యురాలిగా శాగంటి వాణిశ్రీ (కాంగ్రెస్), 7వ వార్డు సభ్యురాలిగా బండి జ్యోతి (కాంగ్రెస్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండో వార్డు సభ్యుడు దూదిపాళ్ళ భాస్కర్ రావు(Dudipalla Bhaskar Rao)ను (తెలుగు దేశం పార్టీ) ఉప సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని గ్రామస్థులు నిర్ణయించుకున్నారు.
నాడు రాజకీయ ఘర్షణలు.. నేడు ఐక్యతా రాగం
సింగరేణి మండలంలో కమలాపురం(Kamalapuram) అంటేనే రాజకీయ ఘర్షణలకు కేంద్రం.. సీపీఐ(CPI).. కాంగ్రెస్(Congress) వర్గాల మధ్య 40 ఏళ్లకుపైగా.. టీడీపీ(TDP) కాంగ్రెస్(Congress) వర్గాల మధ్య పాతికేళ్లకుపైగా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఘర్షణలను నివారించలేని పోలీసు శాఖ ఓ దశలో చిన్నకేసులో గ్రామానికి చెందిన 70 మందికిపైగా వరంగల్ సెంట్రల్ జైలుకు పంపింది. తర్వాత కాలంలో క్రమంగా ఘర్షణలు తగ్గుముఖం పట్టినా రాజకీయ వైరం కొనసాగింది. గత శాసనసభ ఎన్నికల సమయంలోనూ కొంత ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి చెందిన ముఖ్యమంత్రి పీఆర్వో దూదిపాళ్ళ విజయ్, ఎన్ఆర్ఐలు రేపాల సతీష్, వడ్డె సంపత్, శాగంటి లక్ష్మీనారాయణ తదితరులు గ్రామస్థులను ఐక్యం చేసి ఏకగ్రీవంగా చేసేందుకు ప్రయత్నించారు. ఇందుకు గ్రామానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ నాయకులు సహకరించారు.
సీనియర్ కాంగ్రెస్ నేత
వడ్డె సులోచన గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మద్దతుతో సర్పంచిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ దఫా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీనియర్ కాంగ్రెస్ నేత వడ్డె సీతారామయ్య(Vadde Seetharamaiah) చిన్న కుమారుడైన రంగారావు సతీమణి ఆమె. సీతారామయ్య కుటుంబం తొలి నుంచి కాంగ్రెస్‌లోనే కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతూ మండలంలో ముఖ్య నాయకునిగా ఉన్న దూదిపాళ్ళ భాస్కర్ రావు ఉప సర్పంచిగా ఎన్నికయ్యారు. భాస్కర్ రావు ఆధ్వర్యంలో కమలాపురంలో ప్రతి ఏటా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తుంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్(CM Revanth Reddy)డి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 2016లో కమలాపురంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. భారీ ఎత్తున జరిగిన కార్యక్రమంలో నాడు టీడీపీ నేతలుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి, సీతక్క, సండ్ర వెంకటవీరయ్య, పోట్ల నాగేశ్వరరావు, హరిప్రియ, ప్రస్తుత ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఒక్క ఎస్టీ కుటుంబం లేని గ్రామం
షెడ్యూల్ ఏరియాలోని కమలాపురం గ్రామంలో ఒక్క ఎస్టీ(ST) కుటుంబం లేదు. ప్రస్తుతం సర్పంచిగా ఎన్నికైన సులోచన, అయిదో వార్డు సభ్యురాలు శాంత కుమారికి గ్రామానికి చెందిన జనరల్ కులాలకు చెందిన వ్యక్తులను వివాహం చేసుకున్నారు. రిజర్వేషన్లు వీరికి అనుకూలించాయి. రిజర్వేషన్లకు తగినట్లు అభ్యర్థులు లేకపోవడంతో 3, 4, 8వ వార్డులు వచ్చే అయిదేళ్లు ఖాళీగానే ఉండనున్నాయి.
Also Read: CM Revanth Reddy: నర్సంపేటలో సీఎం రేవంత్ పర్యటన.. రూ.532 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

