Putin On Tariffs: రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ (Vladimir Putin) రెండ్రోజుల పర్యటనలో భాగంగా భారత్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గురువారం రాత్రి ప్రత్యేక విమానంలో దిల్లీకి వచ్చిన పుతిన్ కు.. ప్రధాని మోదీ (PM Modi) స్వయంగా వెళ్లి స్వాగతం పలికారు. తన కారులో పుతిన్ ను ఎక్కించుకోని ప్రధాని నివాసానికి తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే భారత పర్యటన సందర్భంగా పుతిన్.. ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్ ను సుంకాల పేరుతో అమెరికా ఇబ్బంది పెట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
ఆ హక్కు భారత్‌కు ఉండకూడదా?
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ లో అడుగుపెట్టిన గంటల వ్యవధిలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా తమ అణుశక్తి కేంద్రాల కోసం ఇప్పటికీ అణు ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అది కూడా ఇంధనమేనని అన్నారు. ఈ విషయంలో అమెరికాకు ఉన్న హక్కు.. భారత్ కు ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. ఈ విషయాన్ని క్షణ్ణంగా పరిశీలించాల్సి అవసరముందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా దీనిపై ఎవరితోనైనా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ పేర్కొన్నారు. ట్రంప్ సుంకాల పేరుతో ఎంత ఒత్తిడి తెచ్చిన భారత్ – రష్యా చమురు వాణిజ్యం జరిగి తీరుతుందని తేల్చి చెప్పారు.
ట్రంప్ సుంకాలపై..
అమెరికా ఆంక్షల నేపథ్యంలో భారత్ – రష్యా మధ్య చమురు వాణిజ్యం కొంతమేర తగ్గిన మాట వాస్తవమేనని పుతిన్ పేర్కొన్నారు. అయితే అది తాత్కాలికమేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చమురు, పెట్రోల్ ఉత్పత్తుల వ్యాపారం సజావుగానే సాగుతున్నట్లు పుతిన్ తెలిపారు. చిన్న చిన్న సర్దుబాట్ల ద్వారా త్వరలోనే ఇరుదేశాల వాణిజ్యం మరింత పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్ సుంకాలను ఎలా ఎదుర్కొవాలన్న ప్రశ్నకు పుతిన్ స్పందిస్తూ.. సుంకాల విధించడమే తమ ఆర్థిక వ్యవస్థకు మంచిదని చెప్పే సలహాదారులు ట్రంప్ చుట్టూ ఉన్నారని పేర్కొన్నారు.
Putin exposes US hypocrisy on India Today 🔥
"The United States continues to purchase nuclear fuel from Russia for its own nuclear power plants. If America is allowed to buy our fuel, why should India be denied the very same right?" pic.twitter.com/xT8ZCGMOqF
— Hathyogi (हठयोगी) (@hathyogi31) December 5, 2025
పుతిన్‌కి మోదీ ఘన స్వాగతం
గురువారం దిల్లీ విమానశ్రయానికి చేరుకున్న పుతిన్ కు ప్రధాని మోదీ ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక విమానం నుంచి పుతిన్ కిందకు దిగగానే ఇరువురు నేతలు కరచలనం చేసుకోవడంతో పాటు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఒకే కారులో ప్రయాణించారు. ఆపై వ్యక్తి గత విందులో మోదీ పుతిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని భారతీయ వంటలను పుతిన్ కు రుచిచూపించినట్లు సమాచారం.
Я рад приветствовать в Дели своего друга – Президента Путина. С нетерпением жду наших встреч сегодня вечером и завтра. Дружба между Индией и Россией проверена временем; она принесла огромную пользу нашим народам.@KremlinRussia_E pic.twitter.com/yqmhCbZBde
— Narendra Modi (@narendramodi) December 4, 2025
Also Read: CM Revanth Reddy: బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం మూడేళ్లలోనే కూలేశ్వరమైంది.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
వ్యాపారం విస్తరించడమే లక్ష్యం
పుతిన్ పర్యటన సందర్భంగా రష్యాతో పలు కీలక ఒప్పందాలను భారత్ కుదుర్చుకునే అవకాశముంది. 2030 నాటికి భారత్-రష్యా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచడమే లక్ష్యంగా ఇరు దేశాలు ముందుకు సాగనున్నాయి. 2021లో 13 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యం.. 2024 – 25 నాటికి 69 బిలియన్ డాలర్లకు పెరిగింది. అయితే ఇందులో అధిక భాగం భారత్ కొనుగోలు చేసే ఇంధనమే ఉండటం గమనార్హం. 2025 ఏప్రిల్ – ఆగస్టు మధ్య వాణిజ్యం తగ్గి 28.25 బిలియన్ డాలర్లకు చేరింది. రష్యా నుంచి ముడిచమురు దిగుమతులు గణనీయంగా పడిపోవడమే ఇందుకు కారణం. అయితే రక్షణ, చమురు వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాకుండా భారతీయ వస్తువులను రష్యా కూడా దిగుమతి చేసుకోవాలన్న ప్రతిపాదనలు కేంద్రం నుంచి వ్యక్తమవుతోంది.

