GHMC: దేశంలోనే అతి పెద్ద నగరంగా మార్చేందుకు ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) బయట, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 27 పట్టణ స్థానిక సంస్థలను (యూఎల్‌బీల) జీహెచ్ఎంసీ (GHMC)లో విలీనం చేసేందుకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, విలీన ప్రతిపాదిత పట్టణ స్థానిక సంస్థలకు జీహెచ్ఎంసీ(GHMC) కీలక ఆదేశాలు జారీ చేసింది. విలీన ప్రక్రియ పూర్తయ్యే వరకు, కొత్త పనులకు నిధులను మంజూరు చేయరాదని, ఎలాంటి చెల్లింపులు జరపరాదని స్పష్టం చేసింది.
ఈ మేరకు జీహెచ్ఎంసీ ప్లానింగ్ విభాగం అధికారులు ఆయా యూఎల్ బీల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేవలం జీతభత్యాల చెల్లింపు, చిన్నపాటి రొటీన్ మెయింటెనెన్స్ ఖర్చులు మినహా, పెండింగ్ బిల్లుల చెల్లింపులు, చెక్కుల జారీ వంటివి చేయరాదని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పట్టణ స్థానిక సంస్థలు కొత్త మంజూరీలిచ్చినా, బిల్లుల చెల్లింపులు జరిపినా విజిలెన్స్ ఎంక్వైరీ తప్పదని ఉన్నతాధికారులు హెచ్చరించారు. బిల్లులు చెల్లించిన అధికారి ఎందుకు చెల్లించారన్న కోణంలో ఈ విచారణ ఉంటుందని కూడా సూచించినట్లు సమాచారం.
Also Read: GHMC merger: జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీన ప్రక్రియలో కీలక పరిణామం
27 యూఎల్ బీలు.. 27 సర్కిళ్లుగా
జీహెచ్ఎంసీలో విలీనం చేస్తున్న 27 పట్టణ స్థానిక సంస్థలను విలీన ప్రక్రియ ముగిసే వరకు 27 జీహెచ్ఎంసీ సర్కిళ్లుగా పరిగణించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఆయా స్థానిక సంస్థల్లో ఉన్న స్పెషల్ ఆఫీసర్లను వెనక్కి పిలిపించినట్లు తెలిసింది. ప్రస్తుత సిబ్బంది ద్వారానే పరిపాలన వ్యవహారాలతో పాటు అత్యవసర సేవల నిర్వహణను జీహెచ్ఎంసీ కొనసాగించనుంది. యూఎల్ బీలలో ఉన్న స్టాఫ్ వివరాలను త్వరలోనే సేకరించి, ఆయా సర్కిళ్లలో విధులను పర్యవేక్షించేందుకు అవసరమైన క్యాడర్ అధికారులుంటే వారినే డిప్యూటీ కమిషనర్లుగా నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం. తగిన క్యాడర్ లేని స్థానిక సంస్థల్లో స్పెషల్ గ్రేడ్ కమిషనర్లను డిప్యూటీ కమిషనర్లుగా నియమించాలని సిఫార్సు చేస్తూ జీహెచ్ఎంసీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధమైంది. ఈ స్థానిక సంస్థల్లో మున్సిపాల్టీలను ఒక సర్కిల్ గా, కార్పొరేషన్లను రెండు సర్కిళ్లుగా విభజించే దిశగా కసరత్తు కొనసాగుతున్నట్లు తెలిసింది.
ఆగమేఘాలపై క్లియరెన్స్
జీహెచ్ఎంసీలో విలీనం చేస్తున్న కొన్ని పట్టణ స్థానిక సంస్థల్లో పెండింగ్‌లో ఉన్న భవన నిర్మాణ అనుమతులు, అక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ విషయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు ఆగమేఘాలపై ఫైళ్లు క్లియర్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా నిర్మాణ కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్న మణి కొండ, శంషాబాద్, మేడ్చల్, దుండిగల్, బోలారం వంటి 21 పట్టణ స్థానిక సంస్థల్లో ఈ హడావుడి జోరుగా సాగుతున్నట్లు సమాచారం. టౌన్ ప్లానింగ్ అధికారులు బేరాలు కుదుర్చుకుని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న దరఖాస్తులను అడ్డదారిలో క్లియర్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
Also Read: GHMC: గ్రేటర్ హైదరాబాద్ సరిహద్దుల విస్తరణ.. సీజీజీ ప్లానింగ్ తర్జనభర్జన
