Kokapet Land Auction: హైదరాబాద్ కోకాపేటలోని భూములకు మరోమారు భారీ ధర లభించింది. థర్డ్ ఫేజ్ భాగంగా బుధవారం (డిసెంబర్ 3) నిర్వహించిన వేలంలో ఎకరం రూ.131 కోట్లు పలికింది. ఫ్లాట్ నెంబర్ 19లోని 4 ఎకరాల భూమికి హెచ్ఎండీఏ అధికారులు వేలం నిర్వహించారు. వాటి అమ్మకం ద్వారా ప్రభుత్వానికి ఏకంగా రూ.524 కోట్ల ఆదాయం లభించింది. ఇంకా ఫ్లాట్ నెం.20 లోని భూముల వేలం కొనసాగుతోంది. అయితే ఫేజ్ – 3లో భాగంగా ఇప్పటికే రెండు విడతల్లో వేలం నిర్వహించారు. అందులో ఎకరానికి లభించిన ధరతో పోలిస్తే ఇది కాస్త తక్కువేనని చెప్పవచ్చు.
ఎకరం రూ.151 కోట్లు
గత నెల 28న కోకాపేట భూములకు సంబంధించిన హెచ్ఎండీఏ నిర్వహించిన వేలంలో ఎకరం భూమి ఏకంగా రూ.151.25 పలికింది. ఫ్లాట్ నెం.15లో ఉన్న 4.03 ఎకరాల భూమికి వేలం జరగ్గా రూ.743 కోట్ల ఆదాయం వచ్చింది. జీహెచ్ఆర్ అర్బన్ బ్లాక్స్, లక్ష్మీ ఇన్‌ఫ్రా కంపెనీలు వీటిని దక్కించుకున్నాయి. మరోవైపు, ప్లాట్ నంబర్ 16లో ఒక్కో ఎకరం రూ.147.75 కోట్లు పలికింది. ఈ ఫ్లాట్‌ను గోద్రెజ్ ప్రొపర్టీస్ దక్కించుకుంది. ఈ ప్లాట్‌లో మొత్తం 5.03 ఎకరాల భూమి ఉంది. మొత్తంగా ప్లాట్ నంబర్ 15, 16లోని భూముల విక్రయం ద్వారా హెచ్ఎండీఏకి రూ.1352 కోట్ల ఆదాయం సమకూరింది.
ఎకరం రూ.137.25 కోట్లు
అంతకుముందు నవంబర్ 24న నిర్వహించిన ఫేజ్ – 3 తొలివిడత వేలంలో ఎకరం భూమి రూ.137.25 కోట్లు పలికింది. కోకాపేటలోని నియోపోలిస్ లేఔట్లలోని ప్లాట్ నెంబర్ 17లో 4.59 ఎకరాలు, 18లోని 5.31 ఎకరాలకు వేలం నిర్వహించగా ఈ రికార్డు ధరలు పలికాయి. వీటి ద్వారా హెచ్ఎండీఏకి రూ.1,355.33 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. అయితే, రోజుల వ్యవధిలోనే ఈ రికార్డు శుక్రవారం నాడు (నవంబర్ 28) బ్రేక్ అయ్యింది.
Also Read: India vs South Africa: రాయ్‌పూర్ వన్డేలో భారత్ అద్భుత బ్యాటింగ్.. దక్షిణాఫ్రికా ముందు ఛాలెంజింగ్ టార్గెట్
ఫేజ్ -1, 2 ఎలా జరిగిందంటే?
కోకోపేట నియో పోలీస్ పరిధిలోని ప్రభుత్వ భూములకు హెచ్ఎండీఏ గతంలో రెండుసార్లు వేలం నిర్వహించింది. 2021 జూన్‌లో ఫేజ్-1 వేలం వేసి, మెుత్తం 49 ఎకరాలను విక్రయించింది. వీటి ద్వారా రూ.2000 కోట్ల ఆదాయం సమకూరింది. మరోవైపు, ఫేజ్–2 వేలాన్ని 2023 ఆగస్టులో నిర్వహించారు. అప్పుడు 46 ఎకరాలను వేలం వేయగా, హెచ్ఎండీఏకు రూ.3,300 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తంగా ఈ రెండు ఫేజ్‌లలో కలిపి 95 ఎకరాలను వేలం నిర్వహించారు. ఫేజ్ – 3తో కలిపి మొత్తం 120 ఎకరాల భూమిని విక్రయించినట్టు అవుతుంది.
