Maoist Encounter: ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మరోమారు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతాబలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పశ్చిమ బస్తర్ డివిజన్ అటవీ ప్రాంతంలో ఉదయం నుంచి భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ ఆపరేషన్‌లో డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, కోబ్రా బలగాలు పాల్గొన్నట్లు సమాచారం. ఉదయం నుంచి ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులు హిడ్మా, టెక్ శంకర్ ఎన్ కౌంటర్ల తర్వాత అడవుల్లో ఎదురుకాల్పులు జరగడం ఇదే తొలిసారి. అయితే హింసను వీడి మూకుమ్మడిగా లొంగిపోతామని మావోయిస్టు పార్టీ అధికారికంగా ప్రకటించినప్పటికీ కేంద్ర బలగాలు కూంబింగ్ కొనసాగుతుండటం గమనార్హం. ఫిబ్రవరి 15, 2026 నాటికి దేశంలో నక్సలిజం అనేది లేకుండా చేస్తామని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా మావోయిస్టు ప్రభావిత అటవీ ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.
Also Read: Uttar Pradesh: పెళ్లైన మర్నాడే భార్యపై వేధింపులు.. బయటకు గెంటేసిన భర్త.. ఎందుకంటే?
మహారాష్ట్ర – మధ్యప్రదేశ్ – ఛత్తీస్ గఢ్ (MMC) జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో మావోయిస్టు పార్టీ నుంచి తాజాగా ఒక ప్రకటన విడుదలైంది. జనవరి 1న అందరం కలిసి లొంగిపోతామని అందులో పేర్కొన్నారు. ఒక్కొక్కరిగా కాకుండా అందరం ఒకేసారి జన జీవన స్రవంతిలో కలిసిపోతామని లేఖలో మావోయిస్టులు తెలిపారు. మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల, ఆశన్న లొంగుబాటుతో పాటు హిడ్మా ఎన్ కౌంటర్ తో పార్టీ బలహీనమైనట్లు స్పష్టం చేశారు. మావోయిస్టులు అంతా లొంగిపోవాలని ఇటీవల కేంద్రం పిలుపునిచ్చిన నేపథ్యంలో తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ స్పష్టం చేసింది.
