Saree Distribution: రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ఉద్దేశ్యంతో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉపయోగపడే ఎంతో ప్రతిష్టాత్మకమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలంగాణ రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలోని జీవీవీ ఫంక్షన్ హాల్‌లో సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, చీరల పంపిణీ కార్యక్రమానికి పర్యాటక సంస్థ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మహిళా సాధికారతకు కృషి
ఈ సందర్భంగా పటేల్ రమేశ్ రెడ్డి మాట్లాడుతూ, వడ్డీ లేని రుణాలు నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతాయని తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా, మహిళలకు ₹30 లక్షల రుణాలు ఇచ్చి ఆర్టీసీ బస్సు కొనుగోలు చేయించి, దానిని లీజుకు తీసుకుని నెలకు ₹70,000 ఆదాయం వచ్చేలా చూస్తున్నామని తెలిపారు. అలాగే, సోలార్ ప్లాంట్స్, పెట్రోల్ బంకుల ఏర్పాటుకు కూడా రుణాలు ఇచ్చి మహిళలు ఆర్థికంగా ఎదిగేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అన్నారు. మహిళలకు ఇందిరా మహిళా శక్తి పేరుతో నాణ్యమైన చీరలను సారెగా మార్చి ఇస్తున్నామని తెలిపారు.
Also Read: Saree Distribution: మహిళలకు గుడ్ న్యూస్.. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీకి డేట్ ఫిక్స్..!
ఇందిరమ్మ స్ఫూర్తితో
మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ, మహిళల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే కుటుంబాలతో పాటు రాష్ట్రం, దేశం కూడా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. గత ప్రభుత్వం వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని వదిలేయగా, తమ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టిందని గుర్తుచేశారు. మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ, వారి పేరు మీదనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని, ఇందిరమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని చెప్పారు. అంతేకాకుండా, ఆర్టీసీలో వెయ్యి బస్సులను మహిళలను యజమానులను చేశామని, వడ్డీలేని రుణాలు, పెట్రోల్ పంపుల నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకం, ఇందిరమ్మ క్యాంటీన్ల నిర్వహణ లాంటి కార్యక్రమాలను కూడా మహిళా సంఘాలకే అప్పగించామని తెలిపారు.
కోటి చీరల పంపిణీ
తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం తరపున సారె పెట్టి గౌరవించాలనే ఉద్దేశంతో కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చేస్తున్నామని వేణారెడ్డి తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో పాటు, తెల్ల రేషన్ కార్డు ఉన్న 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీర ఇస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన 1998 స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు కింద ₹1.51 కోట్ల చెక్కును, అలాగే ఇందిరా మహిళా శక్తి చీరలను లబ్ధిదారులకు అందజేశారు. సూర్యాపేట నియోజకవర్గంలో మొత్తం 40,533 మంది లబ్ధిదారులకు చీరలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణు మాధవ్, తహసీల్దార్ కృష్ణయ్య, ఏపీడీ సురేశ్, ఎంపీడీఓ బాల కృష్ణ, మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Also Read:Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు విడుదల
ఇందిరా శక్తి’తో వడ్డీ లేని రుణాలు, చీరల పంపిణీ: ఆర్డీవో ఎస్. రమేశ్ బాబు
మహిళా సాధికారతే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మహిళా ఇందిరా శక్తి’ కార్యక్రమాన్ని హుజూరాబాద్ పట్టణంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఈ ముఖ్య కార్యక్రమంలో, ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్డీవో ఎస్. రమేశ్ బాబు మహిళా సంఘాల సభ్యులకు స్వయంగా ఇందిరా శక్తి చీరలు, వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో ఎస్. రమేశ్ బాబు మాట్లాడుతూ, మహిళలు ఆర్థికంగా బలోపేతం అయితేనే సమాజం నిజమైన అభివృద్ధిని సాధిస్తుందని ఉద్ఘాటించారు. మహిళలు తమ సొంత కాళ్లపై నిలబడేందుకు ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహకారం అందిస్తామని తెలిపారు.
పథకాల ముఖ్య ఉద్దేశం మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే
ఈ వడ్డీ లేని రుణాలు మహిళలకు చిన్న తరహా వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాలను విస్తరించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా పురోగమించాలని పిలుపునిచ్చారు. ఈ పథకాల ముఖ్య ఉద్దేశం మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంచడమేనని ఆయన అన్నారు. ఈ సహాయం తమ జీవితాల్లో పెద్ద మార్పును తీసుకువస్తుందని, తమ కుటుంబాలకు అండగా నిలబడే శక్తి లభిస్తుందని మహిళా సంఘాల సభ్యులు ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని తాహసీల్దార్ నరేందర్, ఎంపీడీవోలు సునీత, పద్మావతి దగ్గరుండి పర్యవేక్షించగా, మండల స్థాయి అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Also Read: Seethakka: సమ్మక్క సారలమ్మ మహా జాతరకు రండి.. రాష్ట్రపతిని ఆహ్వానించిన మంత్ర సీతక్క!
