iBomma Ravi Case: ఐబొమ్మ రవి కేసుకు సంబంధించి పోలీసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాన నిందితుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు విచారణ చేస్తున్నారు. కేసుకు సంబంధించి కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐబొమ్మ రవి కేసుకు సంబంధించి సీసీఎస్ అడిషినల్ సీపీ శ్రీనివాస్.. మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఐబొమ్మ పైరసీ సైట్ ఏ విధంగా పని చేస్తుందో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఐబొమ్మ రవి సినిమాల పైరసీతో పాటు బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ కూడా చేసినట్లు అడిషనల్ సీపీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఐబొమ్మ, బెప్పం సైట్లను రవి స్నేహితుడు నిఖిల్ డిజైన్ చేసినట్లు చెప్పారు. విదేశాల నుంచి రవి సర్వర్లను ఉపయోగించినట్లు స్పష్టం చేశారు. నిఖిల్ ద్వారానే రవిని ట్రాప్ చేసినట్లు తెలిపారు. రవి భార్య తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్న అడిషనల్ సీపీ.. ఐబొమ్మ రవి తన ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే పట్టుబడ్డాడని అన్నారు.
Also Read: New Municipality: తెలంగాణలో కొత్త మున్సిపాలిటీ.. హైకోర్టు కీలక ఆదేశాలు.. ఇంతకీ ఎక్కడంటే?
రవికి బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ద్వారా డబ్బులు వచ్చేవని ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. యాడ్స్ ద్వారా వచ్చిన డబ్బుల్ని యాడ్ బుల్ కంపెనీకి రవి మళ్లించినట్లు చెప్పారు. ఇప్పటివరకూ రవి రూ.20 కోట్లు సంపాదించినట్లు దర్యాప్తులో వెల్లడైందని అన్నారు. అయితే రవి నేరుగా థియేటర్ కు వెళ్లి సినిమాను పైరసీ చేయలేదని సీపీ తెలిపారు. టెలిగ్రామ్ యాప్ లో పైరసీ సినిమాను తీసుకొని.. తన వద్ద ఉన్న సాఫ్ట్ వేర్ తో క్వాలిటీని మరింత అప్ గ్రేడ్ చేసేవాడని అన్నారు.
ఐబొమ్మ పాపులర్ అయిన తర్వాత దాని పేరునే చాలా మంది వాడుకుంటున్నారని అడిషనల్ సీపీ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం మూవీ రూల్జ్, తమిళ్ ఎంవీ వంటి పైరసీ సైట్లు ఇంకా పనిచేస్తూనే ఉన్నట్లు పేర్కొన్నారు. వాటి నిర్వాహకులను పట్టుకునే పనిలో తమ సిబ్బంది ఉన్నట్లు చెప్పారు. అయితే పైరసీలో త్వరలో వెబ్ – 3 టెక్నాలజీ రాబోతోందని అడిషనల్ సీపీ తెలిపారు. ఆ సాంకేతికతతో పైరసీ చేస్తే పట్టుకోవడం కష్టంగా మారుతుందని అన్నారు.
