Swetcha Effect: నిబంధలనలు విరుద్దంగా వ్యవహరిస్తున్న సన్ డిగ్రీ కళాశాలపై ఎట్టకేలకు ఉస్మానియా యూనివర్శిటీ వైస్ ఛాన్స్ లర్ చర్యలకు ఉపక్రమించారు. స్వేచ్ఛ రాసిన వరుస కథనాల నేపథ్యంలో ఆ కాలేజీ అక్రమాలపై ఆయన విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో ఆడిట్ సెల్ డైరెక్టర్ సమర్పించిన నివేదికలో సన్ డిగ్రీ యాజమాన్యం బాగోతం నిజమేనని తేలడంతో వీసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్ డిగ్రీ కళాశాల యాజమాన్యానికి రూ.8 లక్షల జరిమానాను విధించారు. క్రైస్తవ జనసమితి అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ చేసిన ఫిర్యాదు ఆధారంగా సన్ డిగ్రీ కళాశాలల నిబంధనల ఉల్లంఘన అంశం తెరపైకి రావడం గమనార్హం.
స్వేచ్ఛలో వరుస కథనాలు..
హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో యథేచ్చగా డిగ్రీ కాలేజీలు నడుస్తున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) అనుబంధగా నిర్వహించే కళాశాల్లో నిబంధనలకు విరుద్దంగా మరో యూనివర్సిటీ కోర్సులు నడిపిస్తున్నారు. ఆ పద్దతిలోనే సన్ డిగ్రీ కాలేజీ యాజమాన్యం ఢిల్లీలోని లింగయ్య విద్యాపీఠ్ కోర్సులను నిర్వహిస్తున్నారు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ కోర్సులకే పరిమితమై నడిపిస్తామని తీసుకున్న అనుమతిని సన్ డిగ్రీ యాజమాన్యం విస్మరించింది. ఈ విషయాలపై క్రైస్తవ జన సమితి అధ్యక్షుడు మాసారం ప్రేమ్ కుమార్ ఓయూ వీసికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా ‘డబ్బులిచ్చుకో.. సర్టిఫికేట్ తీసుకో’ అనే కథనం అక్టోబర్ 9న.. ‘సన్ డిగ్రీ పై చర్యల్లో జాప్యమెందుకో?’ అనే మరో కథనం అక్టోబర్ 23న స్వేచ్ఛ దినపత్రికలో ప్రచురితమయ్యాయి.
వీసీకి నివేదిక సమర్పణ
ఈ వరుస కథనాలపై ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ స్పందించారు. సన్ డిగ్రీ కాలేజీపై ఆకస్మికంగా ఆడిట్ సెల్ అధికారులతో తనిఖీలకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో కళాశాలను సందర్శించిన ఓయూ ప్రొఫెసర్ కిషన్ అక్కడి వ్యవహారం చూసి షాక్ కు గురైనట్లు తెలుస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీ అనుమతితో నడిపించే కళాశాలలో దిల్లీలోని లింగయ్య విద్యాపీఠంకు సంబంధించిన కోర్సుల విద్యార్థులు దర్శనమిచ్చారు. అంతేకాకుండా ఓయూ విద్యార్ధుల కంటే ఇతర యూనివర్సిటీ విద్యార్ధుల సంఖ్యే అత్యధికంగా ఉన్నట్లు ప్రొఫెసర్ నిర్ధారించారు. దీనిపై నివేదిక రూపొందించి వీసీకి సమర్పించారు. అందులో సన్ డిగ్రీ యాజమాన్యం తప్పు చేసిందని నిర్ధారించారు. దీంతో ఎట్టకేలకు సన్ డిగ్రీ కాలేజీపై ఓయూ అధికారులు రూ.8లక్షలు జరిమానా విధించారు. మరోమారు ఈ తరహా ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Also Read: GHMC Council Meeting: జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటిలో రసాభాస.. బీజేపీ, మజ్లిస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం
2020 సర్క్యూలర్‌కు వ్యతిరేకం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రాంనగర్, మియాపూర్, లింగంపల్లి ప్రాంతాల్లో సన్ డిగ్రీ కళాశాల యాజమాన్యం కాలేజీలు నిర్వహిస్తోంది. ఓయూ పరిధిలో ఈ కాలేజీలు నడుస్తున్నాయి. అయితే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉండే డిగ్రీ కళాశాలలో ఇతర యూనివర్సిటీ కోర్సులు నడిపించండం 2020 సర్క్యూలర్‌కు వ్యతిరేకం. ఒకే భవనంలో ఇరు యునివర్సిటీలు కొనసాగే అవకాశం లేదు. అందుకు పూర్తి భిన్నంగా సన్ డిగ్రీ కళాశాల యాజమాన్యం వ్యవహారించడం శోచనీయం. ఈ నేపథ్యంలోనే ఆ కళాశాల యాజమాన్యానికి భారీ జరిమానా విధించడం గమనార్హం.
