Women Safety : మహిళల భద్రత కోసం తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ‘ట్రైనింగ్ టు ట్రైనర్స్’ కార్యక్రమాన్ని డీజీపీ శివధర్ రెడ్డి, (DGP Shivdhar Reddy) ఉమెన్ సేఫ్టీ వింగ్ అదనపు డీజీపీ చారు సిన్హా ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు ఎదురయ్యే ప్రమాదాలపై రూపొందించిన కామిక్ బుక్‌ను వారు విడుదల చేశారు. ఎంపిక చేసిన ఏడు జిల్లాల్లోని ఊరూరికి వెళ్లి ఈ పుస్తకాలను పంపిణీ చేయడంతో పాటు, స్థానిక గ్రామస్తులకు అవగాహన కల్పించనున్నారు.
Also Read: Women Safety: మహిళల భద్రత కోసం పటిష్ట వ్యూహం.. బస్సులో పొరపాటున ఈ తప్పులు చేయకండి!
మహిళల పట్ల సైబర్ ఎక్స్‌ప్లాయిటేషన్
ఈ కార్యక్రమానికి మై ఛాయిస్ ఫౌండేషన్ సహకారం అందిస్తుంది. డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళల పట్ల సైబర్ ఎక్స్‌ప్లాయిటేషన్, వొయేరిజం (రహస్యంగా చూడటం), చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్, హింస, ఈవ్ టీజింగ్ వంటి నేరాలు తరచూ వెలుగు చూస్తున్నాయని తెలిపారు. అంతేకాకుండా, హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాలు మహిళలను ఉచ్చులోకి లాగి వ్యభిచార కూపంలోకి దింపుతున్నారని, చిన్న పిల్లలను బెగ్గింగ్ మాఫియాకు అప్పగిస్తున్నారని వివరించారు.
బృందాలు షీ టీమ్స్ భరోసా
వీటిని నివారించడానికి ఎంపిక చేసిన సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని, ఈ బృందాలు షీ టీమ్స్, భరోసా, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, మై ఛాయిస్ ఫౌండేషన్ బృందాలతో కలిసి గ్రామాలకు వెళ్తారని తెలిపారు. జరుగుతున్న నేరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను అందరికీ సులభంగా అర్థమయ్యేలా కామిక్ రూపంలో రూపొందించిన ప్రత్యేక బుక్‌ను ఆవిష్కరించినట్లు చెప్పారు. పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ కార్యక్రమాన్ని మొదట వరంగల్, ఖమ్మం, మెదక్, రాచకొండ, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో ప్రారంభిస్తున్నట్లు డీజీపీ ప్రకటించారు. ఫలితాలను బట్టి ఈ కార్యక్రమాన్ని మిగతా జిల్లాలకు కూడా విస్తరిస్తామని డీజీపీ స్పష్టం చేశారు.
Also Read: Women Safety: వాహనాల్లో లొకేషన్ ట్రేసింగ్ డివైజ్… నేరాలకు చెక్ పెట్టేందుకే!

