GHMC: జీహెచ్ఎంసీ తీసుకునే నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించే స్టాండింగ్ కమిటీ సమావేశం కానుంది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరగనున్న స్టాండింగ్ కమిటీ ముందుకు అధికారులు పలు కీలక ప్రతిపాదనలను పెట్టనున్నట్లు తెలిసింది. మొత్తం 21 అంశాలతో కూడిన అజెండాలోని ప్రతి అంశాన్ని పరిశీలించి, అధికారులతో తగిన సమాచారాన్ని సేకరించి కమిటీ నిర్ణయం తీసుకోనున్నది. వీటిలో జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్ మొండి బకాయిలు సుమారు రూ.10 వేల కోట్లకు పేరుకుపోవడంతో వర్తమాన ఆర్థిక సంవత్సరం కనీసం రూ. వెయ్యి కోట్ల వరకు వసూలు చేసుకునేందుకు వీలుగా వన్ టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్)ను అమలులోకి తీసుకురావాలన్న పత్రిపాదన కమిటీ ముందుకు రానున్నట్లు తెలిసింది.
ప్రభుత్వ అనుమతి కోసం స్టాండింగ్ కమిటీ తీర్మానం
ఈ వన్‌టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్)ను ఈ సారి నెలముందే అమల్లోకి తీసుకురావాలని జీహెచ్ఎంసీ యోచిస్తుంది.ప్రాపర్టీ ట్యాక్స్ మొండి బకాయిలను రాబట్టేందుకు ప్రతి ఏటా అమలు చేస్తున్న ఓటీఎస్‌ను ఈ సారి కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వ అనుమతి కోసం స్టాండింగ్ కమిటీ తీర్మానం చేయనున్నట్లు తెలిసింది. ఓటీఎస్ కింద వడ్డీలో 90 శాతం రాయితీ కల్పించాలని భావిస్తున్నట్ల తెలిసింది. ఈ స్కీమ్‌తో ఈ ఏడాది అధికారులు రూ. వెయ్యి కోట్ల ట్యాక్స్ కలెక్షన్‌కు టార్గెట్ పెట్టుకుంటే, అందులో దాదాపు రూ.300 కోట్ల వరకు వసూలు అవుతుందని అధికారులు అంచనాలు వేశారు.
Also Read: GHMC: శానిటేషన్ పనులపై రాంకీ నిర్లక్ష్యం.. జరిమానాలు విధిస్తున్నా మారని తీరు!
హైడ్రాకు రూ.20 కోట్లు
అలాగే వర్షాకాలంలో హైడ్రా వద్ద పనిచేసిన 5 కేటగిరీలకు సంబంధించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మూడు నెలల జీతాలు నెలకి రూ.35,11,950 చొప్పున మొత్తం రూ.1,05,35,850 విడుదల చేయాలన్న ప్రతిపాదన కూడా కమిటీ ముందుకు రానున్నట్లు సమాచారం. దీంతో పాటు మాన్సున్ ఎమర్జెన్సీ టీమ్స్, యంత్రాల కొనుగోలు కోసం హైడ్రాకు రూ.20 కోట్లను వెంటనే విడుదల చేసే ప్రతిపాదన స్టాండింగ్ కమిటీ ముందుకు రానుంది. ముఖ్యంగా పాలక మండలి గడువు వచ్చే ఫిబ్రవరి 10వ తేదీతో ముగియనున్నందున పలు కీలకమైన ప్రతిపాదనలు కమిటీ ముందు పెట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.
Also Read: GHMC: ఇక మిగిలింది 85 రోజులే.. బల్దియా పాలక మండలికి స్పెషల్ ఆఫీసర్ పాలన..!

