Lava Agni 4: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో కొత్త ఎంట్రీకి లావా రెడీ అయింది. కంపెనీ తమ తాజా స్మార్ట్‌ఫోన్ లావా అగ్ని 4 Lava Agni 4 ను రేపు, నవంబర్ 20న భారత్‌లో విడుదల చేయబోతోంది. మిడ్ రేంజ్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా పెట్టుకుని వస్తున్న ఈ ఫోన్ ధర రూ.30,000 కంటే తక్కువగా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది విడుదలైన Agni 3 కు ఇది అప్‌గ్రేడ్ వెర్షన్. ఈసారి లావా తమ ఫోన్లలో AI ఫీచర్లపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
లాంచ్‌కు ముందు లావా ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. డెమో ఎట్ హోమ్ “Demo at Home” పేరుతో ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తూ, కంపెనీ ఇంజనీర్లు నేరుగా కస్టమర్ల ఇళ్లకు వెళ్లి Agni 4 ఫోన్‌ను చేతికందిస్తారు. ఈ డెమోలో ఫోన్ డిజైన్, ఫీచర్లు, పనితీరు.. ఇలా అన్ని చూపిస్తారు. ఈ హోమ్ డెమో క్యాంపెయిన్ నవంబర్ 20 నుంచి 24 వరకు బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాల్లో అందుబాటులో ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు లావా విడుదల చేసిన ఫారమ్ నింపి ఆహ్వానం పొందవచ్చు.
స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే, Lava Agni 4 లో 6.78 అంగుళాల Full HD+ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉండనున్నట్లు అంచనా. ఫోన్‌కు శక్తినిచ్చేది MediaTek Dimensity 8350 ప్రాసెసర్, ఇది OnePlus Nord CE 5, Infinix GT 30 Pro వంటి డివైస్‌ల్లో కూడా ఉపయోగించారు. స్టోరేజ్‌గా UFS 4.0 టెక్నాలజీ, వెనుక వైపు రెండు 50MP కెమెరాలు, అలాగే 7000mAh కంటే అధిక సామర్థ్యం కలిగిన పెద్ద బ్యాటరీ అందించే అవకాశాలు ఉన్నాయి. డ్యూయల్ స్పీకర్లు, ఫ్లాట్ డిస్ప్లే డిజైన్, బ్లోట్‌వేర్ లేని నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ అనుభవం ఈ మోడల్ ముఖ్య ప్రత్యేకతలుగా భావిస్తున్నారు.
ధర విషయానికి వస్తే, గత ఏడాది Agni 3 ను రూ.20,999కు లావా విడుదల చేసింది. దాని ఆధారంగా Agni 4 ధర రూ.25,000 లోపే ఉండొచ్చని అనుకుంటున్నారు. స్పెసిఫికేషన్లు, ప్రైసింగ్‌ను పరిశీలిస్తే, ఈ ఫోన్ వన్ ప్లస్ (OnePlus Nord CE 5) , Infinix GT 30, Poco X7 వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
