Chhinnamasta Devi: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ కోసమే రాజమౌళి దేశంలోనే ఎవ్వరూ చేయని విధంగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ కనిపించిన దేవత గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆ దేవత ఎవరో తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ టీజర్‌లో అత్యంత ఆసక్తికరంగా నిలిచిన దేవత పేరు చిన్మస్తా దేవి. హిందూ పురాణాలలో ఈ దేవత ప్రాముఖ్యత ఏమిటి? రాజమౌళి కథలో ఆమె పాత్ర ఎంత కీలకమైంది? తెలుసుకుందాం.
Read also-Nayanthara in NBK111: బాలయ్య బాబు సరసన నాలుగోసారి హీరోయిన్‌గా నటించనున్న ఇండియన్ క్వీన్.. ఎవరంటే?
దశమహావిద్యలలో ఆరవ దేవత
చిన్మస్తా దేవి హిందూ తంత్ర సంప్రదాయంలో అత్యంత శక్తివంతమైన భీకరమైన దేవతలలో ఒకరు. ఆమె దశమహావిద్యలలో అంటే 10 జ్ఞాన దేవతలలో ఆరవ దేవతగా పూజలందుకుంటారు. ఈ దశమహావిద్యలు ఆది పరాశక్తి పది రూపాలను సూచిస్తాయి. ఈ పేరు వెనుక అర్థం ఏంటంటే.. సంస్కృతంలో ‘చిన్న’ అంటే ‘ఖండించుకున్న లేదా విడదీయబడిన’ అని, ‘మస్తా’ అంటే ‘శిరస్సు’ అని అర్థం. కాబట్టి, చిన్మస్తా అంటే ‘శిరస్సు లేని దేవత’ అని అర్థం వస్తుంది. ఈ దేవత రూపం చూసేవారికి భయాన్ని కలిగించే విధంగా ఉంటుంది. ఆమె తన తలని తానే ఖండించుకుని ఉంటుంది. ఆమె మెడ నుండి మూడు రక్త ధారలు ప్రవహిస్తూ ఉంటాయి. ఒక ధారను ఆమె స్వయంగా తాగుతుండగా, మిగిలిన రెండు ధారలను ఆమె పరిచారికలు డాకిని, వర్ణిని తాగుతున్నట్లు కనిపిస్తుంది. ఆమె కత్తి, ఖండించిన తలను చేతుల్లో పట్టుకుని, ప్రేమ దేవతలు రతి, మన్మథులపై నిలబడి ఉంటుంది.
ప్రాముఖ్యత
చిన్మస్తా దేవి రూపం అత్యున్నతమైన త్యాగాన్ని ఆత్మ-విమోచనాన్ని సూచిస్తుంది. ఆమె తన శిరస్సును త్యాగం చేయడం అనేది స్వార్థాన్ని అహంకారాన్ని పరిత్యజించడాన్ని సూచిస్తుంది. శిరస్సును ఖండించుకున్నప్పటికీ, ఆమె జీవంతో ఉండటం అనేది జీవితం, మరణ చక్రం నిరంతర శక్తిని, అలాగే పునర్జన్మ శక్తిని సూచిస్తుంది. ఆమె రక్తాన్ని తన పరిచారికలకు పంచి ఇవ్వడం అనేది నిరంతరాయంగా పోషణను అందించే విశ్వ శక్తికి ప్రతీక.
Read also-SS Rajamouli: రాజమౌళి పై కేసు నమోదు.. దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించమన్న వానరసేన?
త్యాగం వెనుక నేపథ్యం
పురాణాల ప్రకారం, ఒకానొక సందర్భంలో పార్వతీ దేవి తన ఇద్దరు పరిచారికలు డాకిని, వర్ణినితో నదిలో స్నానం చేయడానికి వెళ్లారు. స్నానం తరువాత, వారికి విపరీతమైన ఆకలి వేసింది. ఆకలితో వారు బలహీనపడటాన్ని చూసిన పార్వతీ దేవి, వారిని పోషించడానికి ఆలస్యం చేయకుండా తన తలని తానే ఖండించుకుని, తన మెడ నుండి వెలువడిన రక్తాన్ని వారికిచ్చింది. ఈ విధంగా, ఆమె చిన్మస్తా దేవిగా అవతరించింది. రాజమౌళి టీజర్‌లో ఈ దేవత విగ్రహం ‘వనాంచల్’లోని ‘ఉగ్రభట్టి గుహ’లో కనిపించింది. ఈ చిత్రం టైటిల్ ‘వారణాసి’ అని ప్రకటించినప్పటికీ, కథ బహుశా బెంగాల్‌లోని శక్తిపీఠాలు లేదా తూర్పు భారతదేశంలోని చిన్మస్తా ఆలయాల చుట్టూ తిరిగే అవకాశం ఉంది. ఈ భయంకరమైన దేవతను ఎంచుకోవడం వెనుక, రాజమౌళి కథలో ఏదో ఒక పెద్ద త్యాగం లేదా శక్తివంతమైన పరివర్తన ప్రధానాంశంగా ఉండవచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఆ దేవత అక్కడ ఉండటానికి గల రీజన్ ఎంటో తెలియాలంటే సినిమా విడుదల వరకూ వేచి ఉండాల్సిందే.

