Shamsabad tragedy: కుటుంబంలో తీవ్ర విషాదం
గర్భంతో ఉన్న భార్య మృతి
కడుపులో ఉన్న కవల పిల్లలు సైతం
విషాదం తట్టుకోలేక భర్త ఆత్మహత్య
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: పెళ్లయిన చాలా కాలానికి ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిన ఆ ఇల్లాలు గర్భంలో కవల పిల్లలు ఉన్నట్టు తెలుసుకుని మురిసిపోయింది. త్వరలోనే నాన్నా అని పిలిపించుకుంటానంటూ ఆమె భర్త కూడా ఆనందపడ్డాడు. అయితే… ఆ సంతోషం వారికి దక్కలేదు. ఎనిమిదో నెల నడుస్తుండగా గర్భంలోని కవలలు గర్భంలోనే కన్నుమూశారు. ఆ షాక్ తట్టుకోలేక పోయిన ఇల్లాలు కన్నుమూసింది. ఇది తట్టుకోలేక పోయిన ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదం శంషాబాద్‌లో (Shamsabad tragedy) జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బెంగళూరుకు చెందిన శ్రావ్య (35), ముత్యాల విజయ్ (40) భార్యాభర్తలు. ఏడాదిన్నర క్రితం వలస వచ్చి శంషాబాద్ ప్రాంతంలో స్థిరపడ్డారు. విజయ్ ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లయి ఏళ్లు గడిచిపోతున్నా సంతానం కలగక పోవటంతో భార్యాభర్తలు ఇద్దరూ ఓ సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లారు. అక్కడి వైద్యులు అందించిన ఐవీఎఫ్ చికిత్సతో శ్రావ్య గర్భం దాల్చింది. ఆ తరువాత జరిపిన వైద్య పరీక్షల్లో శ్రావ్య గర్భంలో కవల పిల్లలు ఉన్నట్టుగా నిర్ధారణ అయ్యింది. విషయం తెలిసిన విజయ్, శ్రావ్యలు ఎంతో ఆనంద పడ్డారు. బంధుమిత్రులకు విషయం చెప్పుకొని త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నాం… అదీ ఒకేసారి ఇద్దరికి అని చెప్పుకొన్నారు. అలా 8 నెలలు గడిచి పోయాయి.
Read Also- Annadata Sukhibhava: ఏపీలో 46.86 లక్షల మంది రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. రేపే డబ్బులు జమ
మూడు రోజుల క్రితం…
ఇటువంటి పరిస్థితుల్లో మూడు రోజుల క్రితం శ్రావ్య విపరీతమైన కడుపునొప్పితో విలవిలలాడింది. వెంటనే భర్త ఆమెను అత్తాపూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ జరిపిన పరీక్షల్లో శ్రావ్య గర్భంలో ఉన్న కవల పిల్లలు ఇద్దరు చనిపోయినట్టుగా నిర్ధారణ అయ్యింది. ఈ షాక్ తట్టుకోలేక పోయిన శ్రావ్య అచేతన స్థితికి చేరుకుంది. దాంతో వైద్యుల సలహా మేరకు విజయ్ ఆమెను మెరుగైన చికిత్స కోసం గుడిమల్కాపూర్ ప్రాంతంలోని మరో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. అయినా ఫలితం దక్కలేదు. పిల్లలు ఇద్దరు చనిపోయారన్న వేదనతో శ్రావ్య చికిత్స పొందుతూ కన్ను మూసింది.
కవలలు పుడతారనుకున్న కలలు కల్లలు కావటం… కట్టుకున్న భార్య కూడా కన్ను మూయటాన్ని విజయ్ తట్టుకోలేక పోయాడు. ఇదే వేదనతో సోమవారం తెల్లవారుఝామున ఇంట్లోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఆలస్యంగా జరిగిన విషాదాన్ని గుర్తించిన స్థానికులు ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ మేరకు సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు విజయ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Read Also- Tech Services Outage: షాకింగ్.. ఒకేసారి ఎక్స్, చాట్‌జీపీటీ, క్లౌడ్‌ఫ్లేర్ సర్వీసులు డౌన్
