Salary increments 2026: మరో 43 రోజుల్లో ప్రస్తుతం సంవత్సరం 2025 కాలగర్భంలో కలిసిపోయి, నూతన సంవత్సరం 2026 మొదలవుతుంది. కొత్త ఏడాది వస్తోందంటే, చాలామందికి వేల ఆశలు పుట్టుకొస్తాయి. ఉద్యోగులైతే, జీతాలు పెరిగి, తమ జీవితాలు మారాలని అభిలాషిస్తుంటారు. అయితే, 2026లో పరిస్థితులుఅంత ఆశాజనకంగా (Salary increments 2026) ఉండకపోవచ్చని కొత్త సర్వే చెబుతోంది. వచ్చే ఏడాది భారతదేశంలో జీతాల పెరుగుదల తక్కువగా ఉంటుందని, ఉద్యోగులు కంపెనీలు మారిపోవడం అధికంగా ఉండవచ్చని హెచ్‌ఆర్ కన్సల్టింగ్ సంస్థ ‘ఒమమ్’ (OMAM) అంచనా వేసింది. ఈ మేరకు ‘శాలరీ అండ్ అట్రిషన్ ట్రెండ్స్: ఇంక్రిమెంట్ ఔట్‌లుక్ రిపోర్ట్ 2026’ పేరిట ఒక సర్వే రిపోర్టును విడుదల చేసింది. భారత్‌లోని కంపెనీలలో 2026లో శాలరీ ఇంక్రిమెంట్లు తక్కువగా ఉండే అవకాశం ఉందని, అయితే ఉద్యోగుల వలసలు కిందటి ఏడాది మాదిరిగానే అధికంగా కొనసాగవచ్చని విశ్లేషించింది
2026లో జీతాల పెరుగుదల సగటున 9.1 శాతం నుంచి 8.9 శాతానికి తగ్గుతుందని లెక్కగట్టింది. ఇక, ఉద్యోగుల వలసలు (కంపెనీలు మారడం) స్థిరంగా ఉండి 13.6 శాతంగా నమోదవ్వొచ్చని అంచనా వేసింది. ఈ సర్వేను ఈ ఏడాది సెప్టెంబర్ – అక్టోబర్ నెలల మధ్య నిర్వహించినట్టు ఒమమ్ పేర్కొంది. ఆర్థిక అనిశ్చితి, రంగాలవారీగా మందగమనం, వేతనాల్లో వ్యత్యాసాలను దృష్టిలో ఉంచుకొని కంపెనీలు తమ బడ్జెట్లను తగ్గించుకుంటున్నాయని విశ్లేషించింది.
Read Also- Ginning Mills Srike: ఎక్కడికక్కడ జిన్నింగ్ మిల్లుల మూత.. తీవ్ర ఆందోళనలో పత్తిరైతులు
రంగాలవారీగా ఇలా ఉండొచ్చు!
రంగాలవారీగా 2026లో జీతాల పెంపు ఏవిధంగా ఉండొచ్చో ఒమమ్ సర్వే అంచనా వేసింది. ఐటీ, ఈ-కామర్స్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG), ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ (FMCD), ఆటోమొబైల్ వంటి రంగాలలో ఇంక్రిమెంట్లు అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చని పేర్కొంది. రంగాల వారీగా చూస్తే, ఐటీలో 2025లో 8.2 శాతంగా ఉన్న ఇంక్రిమెంట్లు వచ్చే ఏడాది 7 శాతానికి తగ్గవచ్చని పేర్కొంది. ఇక, ఈ-కామర్స్ రంగంలో 10 శాతం నుంచి 9.2 శాతానికి తగ్గుదల, ఎఫ్‌ఎంసీజీ, ఎఫ్ఎంసీడీ రంగాలలో 9.5 శాతం నుంచి 8.7 శాతానికి తగ్గుదల, ఆటోమొబైల్ రంగంలో 10.5 శాతం నుంచి 9.8 శాతానికి తగ్గుదల ఉంటుందని అంచనా వేసింది. ప్రధాన పారిశ్రామిక రంగాలలో కూడా జీతాల పెరుగుదల 9 శాతం నుంచి 8.7 శాతానికి స్వల్పంగా తగ్గిపోవచ్చని పేర్కొంది. కెమికల్, ఇన్సూరెన్స్‌లలో కూడా తగ్గుదల ఉంటుందని పేర్కొంది. అయితే, టెలికాం రంగం మాత్రం నామమాత్రంగా, అతి స్వల్పంగా పెరుగుదల ఉంటుందని ఒమమ్ సర్వే పేర్కొంది.
కారణాలు ఇవేనా
మారుతున్న నిర్వహణ పరిస్థితులకు అనుగుణంగా కంపెనీలు తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. అత్యుత్తమ పనితీరు కనబరిచేవారు, ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులకు మాత్రమే ఎక్కువ మొత్తంలో జీతాల పెంపునకు మొగ్గుచూపుతున్నాయి. మిగతా ఉద్యోగులకు జీతాల పెంపునకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. మరికొన్ని సంస్థలు బెనిఫిట్స్, ప్రోత్సాహకాల వంటి వాటిపై బడ్జెట్‌ను భారీగా తగ్గించివేస్తున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితి పరిస్థితులు, వాణిజ్య ఉద్రిక్తతలు, ఎగుమతుల సమస్యలను ఇందుకు కారణాలు చూపుతున్నాయి. ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గడం కూడా జీతాల పెంపును ఒక అవరోధంగా భావింవచ్చని నిపుణులు చెబుతున్నారు.
