Tiger Panic: పులితో మళ్లీ పరేషాన్
పాదముద్రలు గుర్తించిన అటవీ శాఖ అధికారులు
మళ్లీ పులి అలజడితో కొత్తగూడ ఏజెన్సీలో కలవరం
అప్రమత్తంగా ఉండాలంటూ అటవీ శాఖ హెచ్చరిక
మహబూబాబాద్, స్వేచ్ఛ: మహబూబాబాద్‌లోని కొత్తగూడ ఏజెన్సీలో మళ్లీ పులి కలకలం సృష్టిస్తోంది. గతం నుంచే ఏజెన్సీలో పులి కదలికలు ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పులి సంచారంతో ఏజెన్సీ ప్రాంతాలు మళ్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నాయి. అప్రమత్తం అయిన అటవీశాఖ అధికారులు అడవుల్లోకి ఎవరూ వెళ్లకుండా ఉండాలని, పశువులను మేతకు అడవులకు తీసుకెళ్లొద్దని అవగాహన కల్పిస్తూ ప్రచారం చేస్తున్నారు. గత మూడు సంవత్సరాల క్రితం రాంపూర్ అడవిలో ఆవును పులి దాడి చేసి చంపడంతో నాటి నుంచి అటవీశాఖ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారు. అడవిలో పర్యవేక్షణ చేస్తూ నిఘా పెంచారు. మండలంలోని ఓటాయి, రాంపూర్, కర్నగండి అడవుల్లోనే పులి సంచరిస్తున్నట్లు సమాచారం ఉన్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. పులి కదలికలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అటవీ సమీప గ్రామాల ప్రజలు పులి ఎటువైపు నుంచి దాడి చేస్తుందోనని భయాందోళన చెందుతున్నారు.
Read Also- Lady Constable: లేడీ కానిస్టేబుల్ దుస్తులు చింపేసిన నిరసనకారులు.. షాకింగ్ వీడియో వైరల్
అప్రమత్తంగా ఉండాలి: ఎఫ్ఆర్‌వో వజహాత్
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్ఆర్‌వో వజహాత్ అన్నారు. ఒంటరిగా అడవుల్లోకి వెళ్లకూడదని, పశువులను అడవుల్లోకి మేతకు తీసుకెళ్లొద్దని అన్నారు. పులి ఆనవాళ్లు తెలిస్తే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజల భద్రతతో పాటుగా వన్యప్రాణుల రక్షణ కూడా ప్రధాన లక్ష్యమని ఎఫ్ఆర్‌వో వజహాత్ తెలిపారు.
Read Also- BSNL WiFi Calling: మెరుగైన కనెక్టివిటీ కోసం దేశమంతటా BSNL Wi-Fi కాలింగ్ లాంచ్

