Toy Gun: బెదిరించి నగల దుకాణంలో చోరీయత్నం
యజమాని ప్రతిఘటించడంతో ప్లాన్ విఫలం
మేడ్చల్, స్వేచ్ఛ: తెలుగు హస్యనటుడు బ్రహ్మానందం ఓ సినిమాలో జైలు నుంచి తప్పించుకునేందుకు, సబ్బుతో ఫేక్ తుపాకీని (Toy Gun) తయారు చేస్తాడు. దానిని చూపించి జైలు అధికారులను బెదిరిస్తాడు. ఓ కానిస్టేబుల్‌కు పాయింట్ బ్లాక్‌లో గురిపెట్టి జైలు గేటు ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తాడు. జైలు సిబ్బంది బెదిరిపోయి బ్రహ్మానందాన్ని గేటు వైపు తీసుకెళ్లే క్రమంలో జోరుగా వర్షం కురుస్తుంది. ఆ వర్షంలో తుపాకీ కాస్తా నురుగాగా మారిపోతుంటుంది. విషయాన్ని పసిగట్టి తిరిగి బ్రాహ్మానందాన్ని జైలులో వేస్తారు. ఇది ఓ సినిమాలోని కామెడీ సన్నివేశమే అయినా, నిజజీవితంలోనూ తుపాకీలు చూపించి బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు చాలానే వెలుగుచూస్తున్నాయి. తాజాగా, అలాంటి ఓ షాకింగ్ ఘటన మేడ్చల్‌లో జరిగింది.
Read Also- GHMC Payments: అక్రమాలకు చెక్.. బల్దియాలో నగదు చెల్లింపులు బంద్.. కమిషనర్ సంచలన ఆదేశాలు
ఓ దుండగుడు బొమ్మ తుపాకీతో బెదిరించి నగల దుకాణంలో చోరీకి యత్నించాడు. ఈ ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. నాగారం డివిజన్ పరిధిలోని సత్యనారాయణ కాలనీలో ఉన్న బాలాజీ నగల దుకాణంలోకి గుర్తుతెలియని వ్యక్తి చొరబడ్డాడు. దుకాణ యజమాని సందీప్‌ను బొమ్మ తుపాకీతో బెదిరించి గాయపరిచాడు. అయితే, యజమాని అప్రమత్తతతో వ్యవహరించి, ప్రతిఘటించాడు. దీంతో, దుండగుడు తుపాకీని అక్కడే వదిలేసి పరారయ్యాడు. సందీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న కీసర పోలీసులు అక్కడ పడివున్న బొమ్మ తుపాకీని గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. దుకాణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. దర్యాప్తు చేపడుతున్నట్టు పోలీసులు తెలిపారు.
బొమ్మ తుపాకీలు గుర్తించండిలా
బొమ్మ తుపాకీలను గుర్తుపట్టడం భద్రతా పరంగా చాలా ముఖ్యమైన విషయమని నిపుణులు చెబుతున్నారు. కొంత అవగాహన ఉంటే, ఎప్పుడైనా అనూహ్య ఘటనలు ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉండొచ్చని అంటున్నారు. సాధారణంగా నిజమైన తుపాకీలతో పోలిస్తే బొమ్మ తుపాకీలకు కొన్ని స్పష్టమైన లక్షణాలు ఉంటాయి. బొమ్మ తుపాకీలు ఎక్కువగా ప్లాస్టిక్‌తో తయారయ్యి ఉంటాయి. చాలా తేలికగా ఉంటాయి. నిజమైన తుపాకీలు బరువుగా, మెటల్‌తో తయారయ్యి ఉంటాయి. ఇక, చాలా దేశాల్లో బొమ్మ తుపాకీల ముందుభాగంలో నారింజ రంగు టిప్ ఉంటుంది. దీనినిబట్టి ఫేక్ గన్ అని గుర్తించవచ్చు. బొమ్మ తుపాకీలకు మ్యాగజైన్, ట్రిగ్గర్ పని చేసే విధానం చాలా సింపుల్‌గా, అర్థమయ్యేలా ఉంటుంది. కాల్చినప్పుడు శబ్దం తక్కువగా ఉంటాయి. ఇక నిజమైన తుపాకీలలో కనిపించే సీరియల్ నంబర్లు, భద్రతా సింబల్స్ బొమ్మ తుపాకీలపై కనిపించవు. ఈ విధంగా బొమ్మ తుపాకీలను గుర్తించవచ్చునని సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు.
Read Also- Medaram Jatara 2026: సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని… కీలక ఆదేశాలు జారీ చేసిన మల్టీ జోన్ ఐజీ

