Chain Snatching: మేడ్చల్ జిల్లాలో వరుస చైన్ స్నాచింగ్‌లు
మేడ్చల్, స్వేచ్ఛ: హైదరాబాద్ నగరంలో చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. ఉదయాన్నే చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. గంటల వ్యవధిలో మూడు చోట్ల చైన్ స్నాచింగ్‌కు తెగబడ్డారు. నాచారం పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో, స్టేషన్ వెనుకనే స్నాచింగ్‌కు పాల్పడి పోలీసులకే సవాలు విసిరారు. గుడికి వెళ్లి తిరిగి ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న గృహిణిని లక్ష్యంగా చేసుకొని దుండగులు చైన్ స్నాచింగ్ పాల్పడిన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
బాధితురాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. నాచారం రాఘవేంద్ర నగర్ చెందిన స్వప్న (45) కిరాణా దుకాణ నిర్వహకురాలు, రోజు మాదిరిగా సోమవారం ఉదయం 9 గంటలకు ఆలయంలో పూజలు ముగించుకొని ఇంటికి బయలుదేరింది. పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో ఉన్న భవాని నగర్‌లో కిరాణా దుకాణం తెరవడానికి ఫోన్ మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తోంది. ఇదే అదనుగా భావించిన ఇద్దరు ఆగంతుకులు వెనుక నుంచి పల్సర్‌పై వచ్చి మహిళ మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడును తెంచుకెళ్ళారు. ఈ క్రమంలో పుస్తెలతాడు లాకెట్ కింద పడిపోగా.. 3 తులాల బంగారు చైన్‌తో పరారయ్యారు. బాధితురాలు కేకలు పెట్టినప్పటికిని మెరుపు వేగంతో నిందితులు పరారయ్యారు. బైక్‌పై వాహన నెంబర్ కూడా లేదు. బాధితురాలు నాచారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
మరో రెండుచోట్ల స్నాచింగ్
నాచారంతోపాటు జవహర్ నగర్, శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా చైన్ స్నాచింగ్ కు పాల్పడినట్లు తెలిసింది. నాచారంలో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన అగంతకులు.. వేర్వేరు ప్రదేశాల్లో చైన్ స్నాచింగ్ లో కూడా పాల్పడింది ఆ నిందితులైనా…? లేక మరి వేరొక నిందితుల అన్న విషయంలో స్పష్టత లేదు. ఈ విషయంపై ఇంకా పోలీసులు నిర్ధారణలోకి రాలేదు.
ఈ జాగ్రత్తలు పాటించండి
చైన్ స్నాచింగ్‌లు పెరిగిపోతున్న నేపథ్యంలో జనాలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మహిళలు ఒంటరిగా నడుస్తున్న సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం ఉత్తమం. ఫోన్‌లో మాట్లాడుతూ అజాగ్రత్తగా ఉన్నవాళ్లనే స్నాచర్స్ టార్గెట్ చేస్తుంటారు. కాబ్టటి, నడుస్తున్నప్పుడు ముఖ్యంగా రద్దీలేని ప్రదేశాల్లో ఫోన్‌లో మాట్లాడటం, లేదా ఇయర్‌ఫోన్స్ పెట్టుకోవడం మానుకోవాలని పోలీసులు సూచన చేస్తున్నారు. ఫోన్ల మాట్లాడుతూ ఉంటే దృష్టి మళ్లి, అప్రమత్తత తగ్గిపోతుందని పేర్కొన్నారు.
Read Also- Satish death Case: సీఐ మృతి కేసు దర్యాప్తు వేగవంతం.. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా అర్థమైంది ఏంటంటే?
నగలను కనబడకుండా దాచడం కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. చైన్ వంటి విలువైన బంగారు ఆభరణాలు బయటకు కనిపించకుండా దుస్తుల లోపల దాచుకోవచ్చు. బహిరంగంగా ప్రదర్శిస్తే స్నాచర్ల కన్నుపడే అవకాశం ఉంటుంది. అలాగే వెనుక వైపు నుంచే అపరిచిత వాహనాలు, ముఖ్యంగా మోటార్‌సైకిళ్లు, వ్యక్తుల కదలికలను గమనిస్తూ ఉండడం కూడా మేలు చేస్తుంది. ఒకవేళ చైన్ స్నాచింగ్ జరిగితే, నేరంపై వెంటనే ఫిర్యాదు చేయాలి. స్నాచింగ్ పాల్పడ్డ వ్యక్తులు వాడిన వాహనం నంబర్, నంబర్ గమనించని పక్షంలో రంగు, మోడల్, నిందితుల ఆనవాళ్లు వంటి వాటిని గుర్తించి పోలీసులకు చెబితే దర్యాప్తులో ఉపయోగపడతాయి.
