Transport Department: రాష్ట్రంలో రవాణా శాఖ చేపట్టిన తనిఖీలలో ఈ నెల 12, 13 తేదీలలో కేవలం రెండు రోజుల్లోనే 1050 వాహనాలపై కేసులు నమోదు చేసి, 750 వాహనాలను సీజ్ చేసినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 33 ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు, రాష్ట్ర స్థాయిలో మూడు ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఓవర్ లోడ్ వాహనాల నియంత్రణపై రవాణా శాఖ (Transport Department) జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
Also Read: Transport Department: స్వేచ్ఛ కథనంతో సర్కార్ నిర్ణయం.. రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా ప్రణాళికలు
పకడ్బందీగా చర్యలు తీసుకుంటాం
ఓవర్ లోడ్ వాహనాలను క్వారీలు, రీచ్‌ల వద్దనే నియంత్రించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. దీనికి సంబంధించి క్వారీ, రీచ్ యజమానులపై చర్యలు తీసుకునే విధంగా మైనింగ్ శాఖకు సిఫార్స్ చేస్తామని తెలిపారు. అంతేకాకుండా, సంబంధిత వాహనదారుల పర్మిట్‌తో పాటు, వాహనాన్ని నడిపిన డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఓవర్ లోడ్ నియంత్రణకు మైనింగ్ శాఖతో సమన్వయం చేసుకుని పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. వాహనాలకు ఫిట్‌నెస్ లేకపోయినా, త్రైమాసిక పన్ను కట్టకుండా తిరుగుతున్నా అటువంటి వాహనాలను సీజ్ చేస్తామని కూడా చంద్రశేఖర్ గౌడ్ హెచ్చరించారు.
Also Read: Transport Department: రవాణా శాఖలో సమాచారం మిస్? కనిపించని సమాచార హక్కు బోర్డు!
