Forest Department: రాష్ట్రంలో పులుల సంచారం పెరుగుతుండడంతో వాటి రక్షణ అటవీ అధికారులకు సవాలుగా మారుతున్నది. ఒకవైపు ప్రజలపై దాడి చేయకుండా అప్రమత్తం చేయడంతోపాటు వేటగాళ్ల ఉచ్చుల బారిన పడి మృత్యువాత పడకుండా నిరంతరం పర్యవేక్షణ చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఒకవైపు మహారాష్ట్రలోని తడోబా నుంచి, ఇంకోవైపు నల్లమల నుంచి పులులు రాష్ట్రానికి వస్తున్నట్లు సమాచారం. దీంతో అటవీ అధికారులు అప్రమత్తం అయ్యారు.
ప్రాణహిత నది దాటి
మహారాష్ట్రలోని తడోబా అంధారి టైగర్ రిజర్వ్ నుంచి పులులు ఇటీవల తెలంగాణ వైపు క్యూ కడుతున్నాయి. అక్కడి రిజర్వ్‌లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిపోవడంతో కొత్త ఆవాసాలను వెతుక్కుంటూ ప్రాణహిత నది దాటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి వస్తున్నట్లు అటవీ అధికారులు పేర్కొంటున్నారు. ఈ సీజన్‌లో తాడోబా నుంచి సుమారు 3, 4 పులులు రాష్ట్రంలోకి ప్రవేశించాయని, దీంతో కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ అటవీ ప్రాంతాలు ఇప్పుడు ‘టైగర్ జోన్’గా మారిపోయాయని చెబుతున్నారు. ఈ పులులలో కొన్ని వెనక్కి వెళ్లిపోతుండగా, మరికొన్ని తిర్యాణి, పెంచికల్‌పేట రేంజ్‌లలో ఆవాసం కోసం ప్రయత్నిస్తుండగా, మరికొన్ని తిరిగి వెళ్లిపోతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ప్రజలకు సూచనలు
రాష్ట్రంలో సుమారు 45 నుంచి 50 వరకు పులులు ఉన్నాయని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. త్వరలో రాష్ట్రంలో చేపట్టబోయే గణనతో మొత్తం ఎన్ని ఉన్నాయో క్లారిటీ రానున్నది. సంఖ్య పెరుగుతుండడంతో వాటి సంరక్షణపై అధికారులు చర్యలు చేపట్టారు. పులి సంచరిస్తున్న జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో ఎలాంటి ఉచ్చులు బిగించకూడదని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పులి కదలికలు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
14 జిల్లాల్లో తోడు కోసం తిరుగుతున్న పులి
ఆసిఫాబాద్ జిల్లాలోకి ఎంట్రీ ఇస్తున్న పులులు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఇటీవల ఆసిఫాబాద్ నుంచి మొదలైన ఓ టైగర్ జర్నీ మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల మీదుగా సాగి, తాజాగా సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించింది. తొగుట, మిరుదొడ్డి, కొండాపూర్ మండలాల్లో పులి పాదముద్రలు కనిపించాయని, సిద్దిపేట పట్టణానికి దగ్గరగా కూడా వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. తోడు కోసమే ఆ పులి సంచారం చేస్తున్నట్లు అటవీ అధికారులు పేర్కొంటున్నారు. ఇది రాష్ట్రంలోని 14 జిల్లాల్లో సంచరిస్తున్నదని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ పులి సంచారం కలవరపెడుతున్నది. చత్తీస్‌గఢ్ నుంచి ఓ పులి గోదావరి దాటి ఇటీవల భూపాలపల్లి అడవి నుంచి జకారం వద్ద రోడ్డు దాటినట్లు స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. ములుగు,అబ్బాపూర్, జాకారం, పందికుంట బీట్లలో పులి పాదముద్రలను గుర్తించారు. పందికుంట నర్సరీలోకి వెళ్లి కంచె దాటినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అలాగే, మదనపల్లి, జగ్గన్నపేట, పత్తిపల్లి, పొట్లపూర్, పాంచొత్కూలపల్లి, రాయనిగూడెం, సర్వపూర్ చుట్టుపక్క గ్రామాల్లో పులి సంచరించే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కదలికలపై నిఘా పెంచినట్లు తెలిపారు.
24 గంటల పాటు పెట్రోలింగ్
సోమశిల పరిధిలోనూ ఓ పులి సంచారంతో యంగంపల్లి తండా, దాని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. వేసవి కాలంలో పులులు ఎన్‌ఎస్‌టీఆర్ వైపు నుంచి అమ్రాబాద్ వైపు సంగమేశ్వర ప్రాంతం గుండా నదిని దాటుతుంటాయి. రెండు రాష్ట్రాల సరిహద్దులు దగ్గరగా ఉండడం, అక్కడ నీటి లోతు తక్కువగా ఉండడంతో పులులు కొల్లాపూర్ ఫారెస్ట్ పరిధిలో ఆ మార్గాన్ని ఎంచుకుంటాయి. టైగర్ కారిడార్‌లోని అడవుల్లో ఇటీవలి కాలంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పులులను ట్రాక్ చేస్తున్నారు. అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా వేటగాళ్ల రూపంలో పెద్ద పులులు ప్రాణాలు కోల్పోతున్నాయి. 2016లో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పిన్నారం అడవుల్లో వేటగాళ్ల ఉచ్చుకు మగ పులి బలైంది. 2018లో తిప్పేశ్వర్ నుంచి ఆదిలాబాద్, కవ్వాల్ మీదుగా జైపూర్ మండలం శివ్వారం ఫారెస్ట్‌లోకి ప్రవేశించిన బెంగాల్ రాయల్ టైగర్ కరెంట్ షాక్‌తో మృతి చెందింది. ఈ ఘటనలతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధికారులు తీసుకుంటున్న ఈ చర్యలు ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తాయో చూద్దాం.
Also Read: Amrabad Tiger Reserve Forest: ఫలించిన అటవీ శాఖ చర్యలు

