Kavitha Emotional: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శాసనమండలిలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను సభలో చెప్పుకొని కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్రం ఏర్పాటైన 8 నెలలకే తనపై కక్ష మెుదలైందన్న కవిత.. తనను జైల్లో పెట్టిన సమయంలోనూ పార్టీ అండగా నిలబడలేదని ఆరోపించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నానన్న ఆమె ఇక మీదట ఈ పదవిలో ఉండదలుచుకోలేదని తేల్చి చెప్పారు. మండలి ఛైర్మన్ తన రాజీనామాను అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి..
శాసన మండలి సమావేశం సందర్భంగా సభలో మాట్లాడేందుకు కవితకు అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కీలక వ్యాక్యలు చేశారు. తన రాజీనామాను గత 4 నెలలుగా ఆమోదించలేదన్న కవిత.. అందుకే తాను ప్రత్యేక సమయం తీసుకొని సభలో మాట్లాడుతున్నట్లు చెప్పారు. తన తండ్రి కేసీఆర్, జయశంకర్ స్ఫూర్తితో తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు కవిత పేర్కొన్నారు. 2006లో తాను ఉద్యమంలోకి వచ్చినప్పుడే బీఆర్ఎస్ రాజకీయ శక్తిగా ఎదిగిందన్నారు. 2006లో జాగృతిని స్థాపించి అనేక మంది యువకులను, మహిళలను ఉద్యమం దిశగా నడిపించినట్లు చెప్పారు. జాగృతి తరపున అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు.
పార్టీ ఆహ్వానిస్తేనే ఎంపీగా పోటీ
ఒక ఇండిపెండెంట్ సంస్థగా తాము జాగృతిని నడిపినట్లు కవిత అన్నారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్లు కూడా ఇప్పుడు నీ పాత్ర ఏంటని అడుగుతున్నారని కవిత అన్నారు. గల్లీలో కొట్లాడటమే కాదు.. దిల్లీ లాబీల్లోనూ నా పాత్ర ఉందని తేల్చిచెప్పారు. రాష్ట్ర అవతరణ తర్వాత 2014లో బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేసిందని.. పార్టీ ఆహ్వానం మేరకు తాను నిజామాబాద్ ఎంపీగా పోటీ చేశానని కవిత అన్నారు. ప్రజలు ఆశీర్వదించి తనన ఎంపీగా గెలిపించారన్నారు. రాష్ట్ర విభజన అంశాల పరిష్కారం కోసం ఎంపీగా తన వంతు ప్రయత్నం చేశానని చెప్పారు.
‘ ప్రశ్నిస్తే నాపై కక్ష గట్టారు’
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో తన దగ్గరకు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు రాలేదని కవిత తేల్చిచెప్పారు. కార్మికులు, చిన్న, చిన్న ఉద్యోగులు మాత్రమే వచ్చారన్నారు. బీఆర్ఎస్ పార్టీ పేపర్లు, మౌత్ పీసులు నాకు ఎప్పుడూ అండగా నిలవలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అంతర్గత వేదికల్లో తాను ప్రశ్నిస్తే కక్ష గట్టారన్నారు. ‘పార్టీలోనే ప్రజాస్వామ్య లేదు. నన్ను కక్షగట్టి పార్టీ నుంచి బయటకు పంపారు. రాష్ట్ర స్థాయి నిర్ణయాల్లో నా పాత్ర లేకుండా చేశారు. నాడు బాధపడ్డా.. నేడు సంతోషపడుతున్నా. ధర్నా చౌక్ రద్దు చేయడం అనేది ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమే. పార్టీలో, ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ఎప్పటికప్పుడు కేసీఆర్ కు చెప్పాను’ అని కవిత అన్నారు.
Also Read: Indian Railways: రైళ్ల ఇంజిన్లపై ఏఐ కెమెరాలు.. కేంద్రం సంచలన నిర్ణయం.. ఎందుకంటే?
బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై..
అమరవీరుల స్థూపం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు, సచివాలయం నుంచి కలెక్టరేట్ల వరకు తీరని అవినీతి జరిగిందని కవిత ఆరోపించారు. సిద్దిపేట, సిరిసిల్లలో కట్టిన రెండు కలెక్టర్ కార్యాలయాలు వరద ముంపులో మునిగిపోయాయని పేర్కొన్నారు. నిజం మాట్లాడే వాళ్లను, సూటిగా మాట్లాడే వాళ్లను పార్టీలో పక్కన పెట్టారని చెప్పారు. ‘సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అయినా ఉద్యమకారులకు రూ.10 లక్షలు ఇద్దామని చెప్పాను. కొంతమంది ప్రజాప్రతినిధుల దూరాగతలపై నేరుగా ఫిర్యాదు చేశా. బీఆర్ఎస్ హయాంలో నేరెళ్ల ఇసుక దందా లాంటి దురాగతాలు జరిగాయి. నేరెళ్లలో దళిత బిడ్డలు బలి అయ్యారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో నిర్లక్ష్యం చేశారు’ అంటూ కవిత పేర్కొన్నారు. ప్రస్తుత సభ నుంచి సాధారణ వ్యక్తిలా బయటకు వెళ్లినా.. శక్తిగా మళ్లీ తిరిగొస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
LIVE: Speaking in Legislative Council https://t.co/XWr8NBEper
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 5, 2026

