Transport Department: రోడ్డు ప్రమాదాల నివారణపై రవాణా శాఖ కఠిన చర్యలకు సిద్ధమైంది. రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై ఉక్కుపాదం మోపనున్నారు. నిరంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలు చేసేలా ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రూపొందించింది. ఈ నెల 5న ‘ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏమైంది?’ అంటూ ‘స్వేచ్ఛ’లో కథనం ప్రచురితమైంది. సిబ్బంది ఉన్నా బృందాలు ఏర్పాటు చేయడంలో రవాణా శాఖ విఫలమైందని తెలిపింది. ఈ క్రమంలోనే రాష్ట్ర స్థాయిలో 3 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఏర్పాటు చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ కోసం జిల్లా స్థాయిలో 33 బృందాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
Also Read: Transport Department: రవాణా శాఖలో సమాచారం మిస్? కనిపించని సమాచార హక్కు బోర్డు!
ఒక్కో బృందంలో డీటీసీ, ఎంవీఐ , ఏఎంవీఐ, కానిస్టేబుల్, హోంగార్డు ఉండనున్నారు. ఈ బృందాలు ప్రతి రోజు ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నారు. ఏ రోజు ఎక్కడ తనిఖీలు చేయాలి.. ఆ ప్రాంతం వివరాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలకు అదే రోజూ ఉదయం 6 గంటలకు రవాణా శాఖ ఉన్నతాధికారుల నుంచి సమాచారం ఇస్తారు. సమాచారం సైతం ఇతరులకు లీక్ కాకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఓవర్ లోడింగ్ లారీలు, బస్సులు మినరల్ ట్రాన్స్‌పోర్ట్‌లో సాండ్, ఫ్లైయాష్, స్టోన్, బిల్డింగ్ మెటీరియల్స్, వాహనాల ఫిట్‌నెస్, పొల్యూషన్, చలాన్లపై ఈ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు తనిఖీ చేపట్టనున్నాయి. వాహనాలకు సర్టిఫికెట్ లేకపోయినా, గడువు తీరిన వాటికి అదనపు పెనాల్టీతో పాటు వాహనాల సీజ్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
జేటీసీ ఆధ్వర్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్స్
రవాణాశాఖ ఏర్పాటు చేస్తున్న 3 ఫ్లయింగ్ స్వ్కాడ్ టీమ్స్ జేటీసీఎ(ఎన్‌ఫోర్స్‌మెంట్) పరిధిలో పనిచేయనున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల పనితీరును సైతం పరిశీలించనున్నాయి. అయితే, స్వ్కాడ్స్ టీంలో ఎంవీఐ, ఏఎంవీఐలను నెలలవారీ రొటేషన్ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేయడానికి ఈ స్వ్కాడ్‌ను ఉపయోగించనున్నారు. ప్రభుత్వ సెలవులు మినహా మిగిలిన అన్ని రోజుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు రోడ్డుపై తనిఖీలు చేయనున్నారు. హైదరాబాద్ జేటీసీ, డీటీసీలు విధిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్ జేటీసీ, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, సంగారెడ్డి డీటీసీలు ప్రతివారం కనీసం రెండుసార్లు అంతర్ రాష్ట్ర కాంట్రాక్ట్ క్యారేజ్ (సీసీ) బస్సులపై తనిఖీలు నిర్వహించేలా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
ఓవర్ స్పీడ్ వాహనాలను గుర్తించి ఉక్కుపాదం
ఫిట్‌నెస్ గడువు ముగిసిన వాహనాలు, భారీ వస్తువుల వాహనాలు, బస్సులు సీజ్ చేయనున్నారు. ఓవర్ స్పీడ్ వాహనాలను గుర్తించి ఉక్కుపాదం మోపనున్నారు. ఓవర్‌లోడ్ గూడ్స్ వాహనాలను సైతం సీజ్ చేయనున్నారు. సీసీ బస్సులు, ఎక్కువ ఈ-చలాన్లు, వీసీఆర్‌లు ఉన్న భారీ వస్తువుల వాహనాలను సైతం సీజ్ చేస్తారు. అదేవిధంగా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా తిరిగే వాహనాలు, భారీ, మధ్య తరహా వస్తువుల వాహనాలు, ప్రయాణికుల వాహనాలు, విద్యా సంస్థ బస్సులు సీజ్ చేసేందుకు రవాణాశాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. వస్తువుల వాహనాలలో ఓవర్ లోడింగ్ వాహనాలపై కఠినంగా వ్యవహరించనున్నారు. అదనపు లోడ్‌ను ఆఫ్ లోడ్ చేయకుండా చర్యలు చేపట్టనున్నారు.
రీచ్‌లు, మైనింగ్ క్వారీ యజమానులతో త్వరలో భేటీ
ఇసుక రీచ్‌లు, మైనింగ్ క్వారీల నుంచి ట్రక్కులు, లారీల్లో ఓవర్ లోడ్ వేస్తున్నారు. జీవో వే బిల్లులు ఇస్తున్నట్లు సమాచారం. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో దానిని అరికట్టేందుకు రవాణాశాఖ సిద్దమైంది. అధికారులు ప్రారంభ పాయింట్ల వద్దనే రీచ్, మైనింగ్ క్వారీ యజమానులకు నోటీసులు ఇవ్వడంతో పాటు సమావేశాలు నిర్వహించి ఓవర్ లోడింగ్ వాహనాలను నియంత్రించేందుకు సిద్ధమవుతున్నారు. టిప్పర్‌లు, ఓపెన్ ట్రాలీ వాహనాలు వస్తువులు వాహనాలు దుమ్ము దుళి పడకుండా టార్పాలిన్‌తో సరిగ్గా కప్పబడని వాహనాలపై చర్యలకు సిద్ధమవుతున్నారు. సీసీ బస్సుల్లో సీట్ల మార్పు, అత్యవసర ద్వారాలు నిరోధించడం వంటి అనధికార మార్పులు చేస్తే చర్యలు తీసుకోనున్నారు. ఫిట్‌నెస్ గడువు ముగిసిన ఈఐబీల జాబితాను సేకరించి, రోడ్లపై తిరుగుతున్నట్లు కనిపిస్తే వాటిని సీజ్ చేయనున్నారు.
త్వరలోనే రవాణా శాఖ సిబ్బందికి శిక్షణ
రవాణాశాఖ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని 15 చెక్ పోస్టులు తొలగించడంతో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందితో పాటు ఈ మధ్య కాలంలో ఏఎంవీఐలుగా శిక్షణ పొందిన 112 మందికి సైతం శిక్షణ ఇవ్వనున్నారు. వారిని ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు ఏర్పాటు చేస్తుండటంతో వాహన తనిఖీల సమయాల్లో ఎలా వ్యవహరించాలి? వాహనాల్లో రవాణాశాఖ చట్టం ప్రకారం ఏయే పరికరాలు ఉండాలి? ఎలా తనిఖీలు చేయాలి? జరిమానాలు ఎలా రాయాలి అనే తదితర అంశాలపై శిక్షణ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ప్రతి 30 మందిని ఒక బ్యాచ్ చొప్పున శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏది ఏమైనా రవాణాశాఖ తీసుకుంటున్న చర్యలతో రోడ్డు ప్రమాదాలకు కొంత మేర చెక్ పడనుంది.
Also Read: ACB on Transport department: రవాణా శాఖ పై ఏసీబీ నజర్.. అధికారుల ఆస్తులపై ఆరా!
