Ande Sri Funeral: తెలంగాణ కవి, ప్రముఖ రచయిత అందెశ్రీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయ్యాయి. ఘట్ కేసర్ లో నిర్వహించిన అంతిమ సంస్కరాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందెశ్రీ పాడెను సైతం మోశారు. మరోవైపు అందెశ్రీ అంతిమ యాత్రలో రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు శ్రీధర్ బాబు (Minister Sridhar babu), జూపల్లి కృష్ణారావు Jupally Krishnarao), టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) పాల్గొన్నారు.
అందెశ్రీ అంతిమ యాత్ర
అంతకుముందు లాలాపేటలోని నివాసం నుంచి ఘట్ కేసర్ వరకూ అందెశ్రీ అంతిమ యాత్ర సాగింది. తార్నాక, ఉప్పల్ మీదుగా ఈ యాత్రను నిర్వహించారు. ఈ యాత్రలో పెద్ద ఎత్తున అందెశ్రీ అభిమానులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమానికి సాహిత్యంతో ఊపిరిలూదిన ప్రకృతి కవికి ఘన నివాళులు అర్పించారు. మాజీ ఎంపీలు వి. హనుమంతరావు, సర్వే సత్యనారాయణ, అరుణోదయ సాంస్కృతిక సమాక్య ప్రతినిధి విమలక్క సైతం అందెశ్రీ భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
గుండెపోటుతో మృతి
తెలంగాణ కవి అందెశ్రీ (64) సోమవారం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ లోని నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు.. హుటాహుటీనా గాంధీ అస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేర్చిన 5 నిమిషాల వ్యవధిలోనే ఉదయం 7.25 నిమిషాలకు ఆయన కన్నుమూశారు. గుండెపోటుతో అందెశ్రీ మరణించినట్లు గాంధీ ఆస్పత్రి వైద్యులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. 3 రోజులుగా అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆరోగ్యం పట్ల అందెశ్రీ అశ్రద్ధ వహించారని వారు పేర్కొన్నారు.
Also Read: Delhi Car Blast: ఎవ్వరినీ వదిలిపెట్టం.. తగిన శాస్తి చేస్తాం.. ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్
అందెశ్రీ ప్రస్థానం
వరంగల్ జిల్లా ప్రస్తుత సిద్దిపేట జిల్లాలోని రేబర్తి లో అందెశ్రీ 1961 జూలై 18న జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. జయ జయహే తెలంగాణ గీతాన్ని రచించి, ఆలపించిన అందె శ్రీ ప్రతి తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్పూర్తిని నింపి, తెలంగాణ ప్రజల హృదయాల్లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఇటీవలే సర్కారు నుంచి రూ. కోటి పురస్కారంతో పాటు రెండు డాక్టరేట్ లను ఆయన స్వీకరించారు. ఆశువు కవిత్వం చేప్పడంలో అందె శ్రీ తనకు తానే సాటి. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ఆయనకు 2006లో గంగ సినిమాకు నంది పురస్కారం దక్కింది. 2014లో అకాడమిక్ యూనివర్శల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ సైతం ఆయన్ను వరించింది. 2015లో దాశరథి సాహితీ పురస్కారం, రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారంతో పాటు లోక్ నాయక్ పురస్కారాలు అందెశ్రీని వరించాయి.
