Abhishek Sharma: తొలి బంతి నుంచి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే టీమిండియా టీ20 జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) సంచలన రికార్డు సాధించాడు. ఎదుర్కొన్న బంతుల పరంగా, అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 1000 పరుగుల మైలురాయిని చేరుకున్న ఆటగాడిగా చరిత్ర నెలకొల్పాడు. కేవలం 528 బంతుల్లో వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అభిషేక్ శర్మ కంటే ముందు ఆస్ట్రేలియా బ్యాటర్ టిమ్ డేవిడ్ పేరిట ఈ రికార్డు ఉండేది. టిమ్ డేవిడ్ 569 బంతుల్లో 1,000 పరుగులు సాధించాడు. నవంబర్ 2న హోబర్ట్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 38 బంతుల్లో 74 పరుగులు సాధించినప్పుడు ఈ రికార్డు సాధించాడు. కొన్ని రోజుల వ్యవధిలోనే, శనివారం బ్రిస్బేన్‌లోని గాబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన 5వ టీ20 మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ రికార్డును అభిషేక్ శర్మ బద్దలు కొట్టాడు.
తక్కువ బాల్స్‌లో 1000 రన్స్ సాధించిన ప్లేయర్స్ వీళ్లే
1. అభిషేక్ శర్మ – 528 బంతుల్లో.
2. టిమ్ డేవిడ్ – 569 బాల్స్‌లో.
3. సూర్యకుమార్ యాదవ్ – 573 బంతులు
4. ఫిన్ అలెన్ (కివీస్) – 611 బాల్స్‌లో.
కోహ్లీ రికార్డు జస్ట్ మిస్..
టీ20ల్లో మ్యాచ్‌ల పరంగా భారత్ తరఫున వేగంగా 1,000 పరుగుల మైలురాయిని చేరుకున్న ఆటగాళ్ల జాబితాలో అభిషేక్ శర్మ రెండవ స్థానానికి దూసుకెళ్లాడు. ఈ జాబితాలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. విరాట్ కోహ్లీ 29 మ్యాచ్‌లు ఆడినప్పటికీ, 27 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసి 1,000 పరుగులు పూర్తి చేశాడు. అభిషేక్ శర్మ 28 ఇన్నింగ్స్‌లలో 1,000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అయితే, ఆడిన మ్యాచ్‌ల సంఖ్య పరంగా 1,000 పరుగులు వేగంగా పూర్తి చేసిన ఇండియన్ బ్యాటర్‌గా అభిషేక్ నిలిచాడు.
Read Also- BJP Paid Crowd: వాహ్ మోదీ వాహ్.. పూలు చల్లితే రూ.500, ఏడిస్తే రూ.1000!.. ప్యాకేజీ అదుర్స్ కదూ?
వేగంగా 1,000 రన్స్ పూర్తి చేసుకున్న ఇండియన్ బ్యాటర్లు
1. విరాట్ కోహ్లీ- 27 ఇన్నింగ్స్
2. అభిషేక్ శర్మ – 28 ఇన్నింగ్స్
3. కేఎల్ రాహుల్ – 29 ఇన్నింగ్స్
4. సూర్యకుమార్ యాదవ్ – 31 ఇన్నింగ్స్
5. రోహిత్ శర్మ – 40 ఇన్నింగ్స్
ఇక, ప్రపంచవ్యాప్తంగా చూస్తే, అతి తక్కువ మ్యాచ్‌లలో 1,000 పరుగుల మైలురాయి సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఇంగ్లాండ్ ప్లేయర్ డేవిడ్ మలన్, చెక్ రిపబ్లిక్‌కు చెందిన సబవూన్ దవిజి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. వీరిద్దరూ 24వ మ్యాచ్‌లోనే వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం భారతీయ క్రికెటర్లలో సంజు శాంసన్ – 995 పరుగులు, తిలక్ వర్మ 991 రన్స్‌తో 1,000 పరుగుల మైలురాయికి చేరువలో ఉన్నారు. శనివారం ఆస్ట్రేలియాతో 5వ టీ20లో ఆడే అవకాశం ఇద్దరికీ దక్కలేదు. లేదంటే, వెయ్యి పరుగులు పూర్తి చేసుకునే అవకాశం దక్కేదు.
