India vs Australia: ఆస్ట్రేలియా – భారత్ మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా క్వీన్స్‌లాండ్ వేదికగా జరుగుతున్న 4వ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ఇండియా, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగుల మోస్తరు స్కోరు సాధించింది. దీంతో, ఆతిథ్య ఆసీస్ విజయలక్ష్యం 168 పరుగులుగా ఖరారైంది. ఈ మ్యాచ్‌లో భారత్ తరపున శుభ్‌మన్ గిల్ 46 పరుగుల వ్యక్తిగత స్కోరుతో కాస్త ఫర్వాలేదనిపించగా, మిగతా బ్యాటర్లు అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయారు.
Read Also- Jagan Padayatra 2.O: మళ్లీ పాదయాత్ర చేయబోతున్న వైఎస్ జగన్.. 2017-18 మాదిరిగా గేమ్ ఛేంజర్ అవుతుందా?
భారత్ బ్యాటింగ్..
భారత బ్యాటింగ్‌లో ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ చక్కటి ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 40 బంతుల్లో 56 పరుగులు జోడించారు. ఆ తర్వాత అభిషేక్ శర్మ 28 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. శుభ్‌మన్ గిల్ 46 పరుగులతో రాణించాడు. గిల్ 4 ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత శివమ్ దూబే 22, సూర్యకుమార్ యాదవ్ 20, తిలక్ వర్మ 5, జితేష్ శర్మ 3, వాషింగ్టన్ సుందర్ 12, అక్షర్ పటేల్ 21 (నాటౌట్), అర్షదీప్ సింగ్ 0, వరుణ్ చక్రవర్తి 1 (నాటౌట్) చొప్పున పరుగులు సాధించారు.
Read Also- Bigg Boss Telugu: చిచ్చుపెట్టిన బిగ్ బాస్.. ఇమ్మూ, రీతూ మధ్య భారీ ఫైట్.. గొడవతో దద్దరిల్లిన హౌస్!
పొదుపుగా బౌలింగ్ చేసిన ఎల్లీస్
ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లీస్, జావీయర్ బార్టలెట్ ఇద్దరూ పొదుపుగా బౌలింగ్ చేశారు. 4 ఓవర్లు వేసిన ఎల్లీస్ 21 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన 3 వికెట్లు పడగొట్టాడు. ఇక, జావీయర్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 26 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ఇక, ఆడమ్ జంపా నాలుగు ఓవర్లలో 45 పరుగులు సమర్పించుకున్నప్పటికీ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మార్కస్ స్టోయినిస్‌కు మరో వికెట్ పడింది. భారత ఇన్నింగ్స్‌లో 9 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి.
