Memory Improvement: మనలో కొందరు మనసు ఒక చోట, మనిషి ఒక చోట ఉన్నట్లు ఉంటారు. మనసు పదును, ఆలోచనలు స్పష్టంగా ఉండడం ప్రతి రంగంలో విజయానికి కీలకం. నిర్ణయాలు తీసుకోవడం, ఒత్తిడిని తట్టుకోవడం, సృజనాత్మకతను కాపాడుకోవడం ఇవన్నీ ఒక చురుకైన, ఆరోగ్యకరమైన మెదడుపైనే ఆధారపడి ఉంటాయి. వయసు పెరిగేకొద్దీ జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గిపోతుందనేది నిజమే కానీ, కొన్ని రోజువారీ అలవాట్లతో దానిని తిరిగి పదును పెట్టుకోవచ్చు.
మీ జ్ఞాపకశక్తిని పెంచే అలవాట్లు
1. ప్రతి రాత్రి మంచి నిద్రపోవాలి
నిద్ర మీ మెదడుకి రిసెట్ బటన్ లాంటిది. లోతైన నిద్రలో మెదడు టాక్సిన్లను తొలగించి, జ్ఞాపకాలను క్రమబద్ధీకరిస్తుంది. రోజూ 7–8 గంటల నిద్రపోవడం చాలా ముఖ్యం. నిద్రకు ముందు మొబైల్, టీవీ స్క్రీన్ టైమ్ తగ్గించడం కూడా అవసరం.
2. మెదడుకు మంచిన ఆహారం తినండి
మీ ఆహారపు అలవాట్లు మెదడు ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయి. వాల్‌నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, సాల్మన్ వంటి చేపలు (ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్), బ్లూబెరీస్, నారింజలు వంటి యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన పండ్లు, పాలకూర, కేల్ వంటి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోండి. అధిక చక్కెర, ప్రాసెస్‌డ్ ఫుడ్‌ను దూరంగా ఉంచండి.
3. శారీరకంగా చురుకుగా ఉండండి
శరీరం మాత్రమే కాదు, వ్యాయామం మెదడుకి కూడా శక్తినిస్తుంది. నడక, యోగా, డాన్స్, లేదా తేలికపాటి స్ట్రెచింగ్.. ఏదైనా సరే, రోజూ క్రమంగా చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగై మెదడు కొత్త కణాలను ఉత్పత్తి చేస్తుంది.
4. కొత్త విషయాలు నేర్చుకోండి
కొత్త సవాళ్లు మీ మెదడును చురుకుగా ఉంచుతాయి. కొత్త భాష నేర్చుకోవడం, పుస్తకాలు చదవడం, పజిల్స్ లేదా క్రాస్‌వర్డ్స్ చేయడం, కొత్త హాబీ ప్రారంభించడం.. ఇవన్నీ జ్ఞాపకశక్తిని పెంచి సృజనాత్మకతను పెంపొందిస్తాయి.
5. ధ్యానం, మైండ్‌ఫుల్‌నెస్ అలవాటు చేసుకోండి
రోజుకు 10 నిమిషాల ధ్యానం మీ మెదడుకు అద్భుత ఫలితాలు ఇస్తుంది. ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉండి, నిర్ణయాలు స్పష్టంగా తీసుకోవడంలో ఇది సహాయపడుతుంది.
6. సామాజిక సంబంధాలు కొనసాగించండి
మానవ సంబంధాలు కూడా మెదడుకి బెస్ట్ మెడిసిన్ లాంటివి. స్నేహితులతో మాట్లాడటం, కుటుంబంతో సమయం గడపడం, లేదా గ్రూప్ యాక్టివిటీల్లో పాల్గొనడం.. ఇవన్నీ మానసిక ఉల్లాసాన్ని, ఏకాగ్రతను పెంచుతాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ బాధ్యత వహించదని గమనించగలరు.
