Telangana Road Accidents: రాష్ట్రంలో రోజురోజుకూ రోడ్డు ప్రమాదలు పెరిగిపోతున్నాయి. అయితే ఎక్కువ యాక్సిడెంట్లు అతివేగంతోనే జరుగుతున్నట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన రవాణా ఎన్‌ఫోర్స్‌మెంట్ చోద్యం కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం తనిఖీలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర ఘటనలు జరిగితేనే స్పందిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
ఇదే విషయాన్ని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం ప్రస్తావిస్తూ.. రవాణా శాఖ అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్ సీరియస్‌గా, యాక్టివ్‌గా ఉండాలి.. ఘటన జరిగినప్పుడు దాడులే కాదు.. నిరంతరం యాక్షన్ ప్లాన్ ఉండేలా కఠినంగా వ్యవహరించాని ఆదేశించారు. అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం సరిగ్గా పనిచేయడం లేదని స్పష్టమవుతున్నది. నిర్లక్ష్యం చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు సైతం జారీ చేశారు. అంటే ఏ మేరకు అధికారులు పనిచేస్తున్నారనేది మంత్రి చెప్పకనే చెప్పారు.
Also Read: Vikarabad Road Accident: తెలంగాణలో మరో ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన లారీ.. పరారీలో డ్రైవర్
తనిఖీలు చేపట్టకపోవడంతోనే
రవాణాశాఖకు కావల్సిన సిబ్బంది ఉన్నారు. చెక్ పోస్టుల్లో పనిచేసిన సుమారు 70మంది ఎంవీఐ, ఏఎంవీఐ, కానిస్టేబుల్స్, హోంగార్డులు ఉండగా, 112 మంది ఏఎంవీఐలు సైతం ట్రైనింగ్ పూర్తిచేసుకొని విధుల్లో చేరినవారు ఉన్నారు. మొత్తం 182 మంది వరకు ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు. వారితో కావాల్సిన విధంగా ఉపయోగించుకోవచ్చు. ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేపట్టవచ్చు. కానీ, అందుకు భిన్నంగా శాఖ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
కేవలం 8 బృందాలతోనే వాహనాల తనిఖీలు చేపడుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అంటే మిగతా ఉద్యోగులు, సిబ్బందికి ఏం విధులు అప్పగిస్తున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ పర్యవేక్షణ చేసే అధికారుల చోద్యం కారణంగా ప్రమాదాలకు కారణమనే విమర్శలు వస్తున్నాయి. వారిని సరిగ్గా వినియోగించకపోవడం, విస్తృత తనిఖీలు సైతం చేపట్టకపోవడంతోనే వాహనాలు అతివేగంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రమాద సమయంలో వాహనాల స్పీడ్ మీటర్లే స్పష్టం చేస్తున్నాయి.
83వేల మంది మృతి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2025 జూలై వరకు 2లక్షల 57వేల ప్రమాదాలు జరగగా 83వేల మంది మృతి చెందినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అంటే రవాణాశాఖ అధికారులతో పాటు పోలీసులు సైతం ఏం చర్యలు తీసుకుంటున్నారనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ ప్రమాదాల్లో 80శాతానికిపైగా వాహనాల ఓవర్ స్పీడ్ కారణం. దీనికి తోడు ప్రతి ఏటా ప్రమాదాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది.
దీనికి తోడు కఠిన చర్యలు తీసుకోకపోవడం, జరిమానాలు భారీగా విధించక పోవడం, రవాణాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టకపోవడమే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు రవాణాశాఖ మంత్రి సైతం క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టకపోవడం, కేవలం సమీక్షలు, సమావేశాలతోనే సరిపుచ్చడంతోనే అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అలాకాకుండా శాఖ చేపడుతున్న చర్యలపై నిఘా పెట్టడం, ఉద్యోగుల కదలికలపై సైతం దృష్టిపెట్టడం, పనితీరుపై ఆరా తీసి హెచ్చరికలు జారీ చేస్తే శాఖ గడిలో పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Vikarabad Road Accident: తెలంగాణలో మరో ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన లారీ.. పరారీలో డ్రైవర్
ఓవర్ స్పీడ్ నియంత్రణకు స్పీడ్ గన్‌లు
వాహనాల ఓవర్ స్పీడ్‌ను నియంత్రించేందుకు స్పీడ్ గన్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంది. అంతేకాదు ఉద్యోగులకు స్పీడ్ గన్ వాహనాలు, పరికరాలు ఇవ్వాల్సి ఉంది. కానీ, ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. దీనికి తోడు ఓవర్ స్పీడ్‌తో వెళ్లే వాహనాలపై జరిమానా భారీగా వేయకుండా కేవలం రెండుమూడు వేలు మాత్రమే వేస్తుండటంతో వాహనదారులు ఓవర్ స్పీడ్‌తోనే వెళ్తున్నారు. ఒకసారి ఓవర్ స్పీడ్‌తో వెళ్తే 20 వేలకు పైగా జరిమానా విధిస్తే మరోసారి వెళ్లకుండా జాగ్రత్త పడతారని రవాణాశాఖ ఉద్యోగులే అభిప్రాయపడుతున్నారు. జాతీయ రహదారిపై కార్ స్పీడ్ మాగ్జిమమ్ గంటకు 80 కిలో మీటర్ల స్పీడ్ ఉండాలని, 100 స్పీడ్‌కు లోబడి ఉండాలని రవాణా చట్టంలో యాక్ట్ 112 తెలియజేస్తుంది.
నివాస, పాఠశాలల వద్ద 30 స్పీడ్ దాటవద్దని యాక్ట్ చెబుతున్నది. అదే విధంగా ట్రక్కులు, టిప్పర్లు రహదారిపై 60 స్పీడ్‌కు మించవద్దని రవాణా యాక్ట్ చెబుతుంది. కానీ, నిబంధనలకు విరుద్ధంగా స్పీడ్ లిమిట్ లేకుండా వెళ్తుండటంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద ట్రాక్టర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. నలుగురు కూలీలకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇది కూడా ఓవర్ స్పీడ్‌తోనే జరిగినట్లు ప్రయాణికులు పేర్కొంటున్నారు. అంటే రవాణాశాఖ అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన అవసరం
ప్రతీ ఏడాది రోడ్ సేఫ్టీ మంత్‌పై ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. అందుకు యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. కానీ, అది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని, కేవలం నామమాత్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నారని, దీంతో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యం అవుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈసారి యాక్షన్ ప్లాన్‌తో పాటు డీటీసీ, ఆర్టీవోలు ఇతర రవాణా శాఖ అధికారులు ఒక్కో జిల్లాలో మూడు బృందాలుగా ఏర్పాటు చేసుకొని నిరంతరం పర్యవేక్షణ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు వాహనాల స్పీడ్ లాక్ అమలు అయ్యేలా చూడాలని, దానిని బ్రేక్ చేస్తే ట్రిపుల్ పెనాల్టీ వేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే అధికారులు ఏ మేరకు ప్రభుత్వ నిబంధనలు అమలు చేస్తారనేది ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసింది. ఇది ఇలా ఉంటే అధికారుల పనితీరుపై సైతం ప్రభుత్వం ఆరా తీస్తున్నట్లు సమాచారం. దాని ప్రకారం యాక్షన్ తీసుకోబోతున్నట్లు తెలిసింది.
ఉద్యోగుల నుంచి ఫీడ్ బ్యాక్
రోడ్డు ప్రమాదాలు ఏటా పెరుగుతుండటంతో అరికట్టాల్సిన చర్యలపై ఉన్నతాధికారులు రవాణాశాఖలో పనిచేసే ఉద్యోగుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్లు సమాచారం. జాయింట్ ట్రాన్స్ పోర్టు కమిషనర్లు ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. శాఖ చేపట్టాల్సిన కార్యక్రమాలు, తనిఖీలు, విధులు, ఓవర్ స్పీడ్ కంట్రోల్‌కు చర్యలు, తదితర అంశాలపైనా అభిప్రాయాలు తీసుకున్నారు. సీజ్ యార్డులు ఏర్పాటు చేయాలని, నిబంధనలు అతిక్రమించే వాహనాలపై జరిమానాలు భారీగా ఉండాలని, ఉద్యోగులకు వాహనాలు ఇవ్వాలని, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు పటిష్టం చేయాలని అభిప్రాయాలు వచ్చినట్లు సమాచారం. అయితే తీసుకున్న అభిప్రాయాలను అమలు చేస్తారా? లేకుంటే ఘటనలు జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేసి తర్వాత సైలెంట్ అవుతారా? అనేది చూడాలి.
Also Read: Rajasthan Accident: మరో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది స్పాట్ డెడ్.. 50 మందికి పైగా గాయాలు
