Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి కేసులో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పాలని కేంద్రంలో అధికారి పార్టీ బీజేపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ నెల 11లోగా కేసీఆర్, హరీష్ రావులను సీబీఐ అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వ కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించి 3 నెలలు అవుతోందని, కానీ, ఇప్పటివరకు కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదని ఆయన మండిపడ్డారు. ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో కేసీఆర్, కేటీఆర్‌ను జైలుకు పంపిస్తామని అన్నారని, మరి ఇప్పుడు 3 నెలలైనా కనీసం కేసు పెట్టలేదని మండిపడ్డారు. ఇది బీజేపీ-బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం కాకపోతే మరేంటి అని అనుమానం వ్యక్తం చేశారు.
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ అరెస్ట్ విషయంలో చీకటి ఒప్పందం ఏంటి? అని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి కేంద్రమంత్రిగా ఉన్నా కేసీఆర్, కేటీఆర్‌పై చర్యలు లేవనిపేర్కొన్నారు. ఫార్మాలా ఈ-రేసు కేసులో రూ.50 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. విచారణ జరిపి గవర్నర్‌కు ఫైల్ పంపించామని, కానీ, కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ ఇంకా అనుమతి ఇవ్వలేదని చెప్పారు. ఇది బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం కాదా? అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి రెహ్మత్ నగర్‌లో ఆయన మాట్లాడారు.
Read Also- Pushpitha Laya: పని చేతకాని ప్రజాప్రతినిధులను చీరే సారే పంపిస్తాం: ట్రాన్స్ జెండర్ పుష్పిత లయ
పీజేఆర్ మరణాన్ని ప్రస్తావిస్తూ కేసీఆర్‌పై విమర్శలు
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున ప్రచారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పీజేఆర్ మరణించినప్పుడు ఉపఎన్నికలో అభ్యర్థిని నిలపడం విమర్శలు గుప్పించారు. పీజేపీఆర్ ఒక దేవుడని, ఆయన మరణించినప్పుడు కుటుంబ సభ్యులకు చంద్రబాబు నాయుడు మద్దతిచ్చారని, కానీ కేసీఆర్ మాత్రం సెంటిమెంట్‌కు చోటులేదన్నారని పునరుద్ఘాటించారు. ఆనాడు కేసీఆర్ పిల్లలు కేసీఆర్ ఇంటి ముందు, ఎండలో మూడు గంటలు నిలబడితే, వాళ్లను కనీసం పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పీజేఆర్ చనిపోయినప్పుడు అలా వ్యవహరించి, ఇప్పుడు మాగంటి గోపీనాథ్ చనిపోయారు.. ఆయన సతీమణిని గెలిపించాలంటూ బీఆర్ఎస్ కోరుతోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని ఓటర్లను ఆయన అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే నియోజకవర్గంలో 4 వేల ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తానని ఆయన హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదలకు రేషన్ కార్డులు ఇవ్వలేదని తీవ్రంగా మండిపడ్డారు.
Read Also- Warangal District: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మళ్లీ దంచికొట్టిన వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
