Minister Azharuddin: తెలంగాణ మంత్రి అజారుద్దీన్ కు ఏ శాఖ కేటాయిస్తారన్న ఉత్కంఠకు బ్రేక్ పడింది. అజారుద్దీన్ కు రెండు మంత్రిత్వ శాఖలను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మైనారిటీ సంక్షేమం (Minority Welfare), ప్రభుత్వ రంగ సంస్థల (Public Enterprises) శాఖలకు ఇక మీద ఆయన బాధ్యత వహిస్తారని కాంగ్రెస్ సర్కార్ స్పష్టం చేసింది. అయితే మైనారిటీ సంక్షేమ శాఖ ఒక్కటే ఇస్తారని తొలుత ప్రచారం జరిగింది. కానీ రెండు శాఖలను రేవంత్ సర్కార్ కట్టబెట్టడంతో అజారుద్దీన్ వర్గం సంతోషం వ్యక్తం చేస్తోంది. కాగా గత నెల 31న మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్రమంత్రులు హాజరయ్యారు.
అజారుద్దీన్ రాజకీయ ప్రస్థానం
టీమిండియా కెప్టెన్ గా గతంలో సేవలందించిన అజారుద్దీన్ 2009లో పొలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 2009 ఫిబ్రవరి 19న జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని మెురాదాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 2014లో రాజస్థాన్ లోని టోంక్ – సవాయి మాధోపూర్ (Tonk-Sawai Madhopur) స్థానం పోటీ చేసి బీజేపీ అభ్యర్థి సుఖ్ బీర్ సింగ్ జౌనాపురియా చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ప్రెసిడెంట్ గాను సేవలు అందించారు. 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్ఎస్ నేత మాగంటి గోపినాథ్ చేతిలో ఓటమి పాలయ్యారు. మాగంటి మరణంతో కాంగ్రెస్ తరపున తిరిగి ఉపఎన్నికల్లో పోటీ చేయాలని అజారుద్దీన్ భావించినప్పటికీ.. అది జరగలేదు.
వ్యక్తిగత జీవితం..
అజారుద్దీన్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆయన 1987లో నౌరీన్ ను వివాహం చేసుకున్నారు. వారికి మహమ్మద్ అసదుద్దీన్, మహమ్మద్ అయాజుద్దీన్ అనే ఇద్దరు కుమారులు జన్మించారు. అయితే 1996లో నౌరీన్ కు విడాకులు ఇచ్చిన అజారుద్దీన్.. ఆ తర్వాత నటి సంగీత బిజ్లానీని రెండో వివాహం చేసుకున్నారు. అయితే 2010లో సంగీత కూడా విడాకుల కోసం కోర్టుకు వెళ్లడం గమనార్హం. మరోవైపు 2011లో బైక్ ప్రమాదంలో అజారుద్దీన్ చిన్న కుమారుడు అయాజుద్దీన్ ప్రాణాలు కోల్పోయాడు. పెద్ద కుమారుడు అసదుద్దీన్.. ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి సానియా మిర్జా సోదరిని ఆనం మిర్జాను 2019లో వివాహం చేసుకున్నాడు.
Also Read: YS Jagan: జగన్ పర్యటనలో అపశ్రుతి.. ఒకదానికొకటి ఢీకొన్న కాన్వాయ్ వాహనాలు
కాంగ్రెస్ వ్యూహాం?
జూబ్లీహిల్స్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అజారుద్దీన్ కు కేబినేట్ లో చోటు కల్పించడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ముస్లింల ఓటు బ్యాంకును ఆకర్షించడమే ఈ నిర్ణయం వెనుకున్న ముఖ్య ఉద్దేశమని విశ్లేషణలు వెలువడుతున్నాయి. పైగా అజారుద్దీన్ కు జూబ్లీహిల్స్ తో ప్రత్యక్ష సంబంధాలు ఉండటం.. గతంలో అక్కడి నుంచి పోటీ చేసి 64 వేల ఓట్ల వరకూ సాధించడం తమకు కలిసివస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఉపఎన్నికల సమయంలో అజారుద్దీన్ ను కేబినేట్ లోకి తీసుకోవడంపై విపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి.
