Bus Accidents In Telangana: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా (Rangareddy District)లో ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. చేవెళ్ల మండలం మీర్జాగూడ (Mirjaguda) వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాంగ్ రూట్ లో వస్తోన్న కంకర రాళ్ల టిప్పర్.. బస్సును బలంగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అయితే తెలంగాణలో ఈ తరహా బస్సు ప్రమాదాలు చాలానే చోటుచేసుకున్నాయి. వాటిలో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన ఐదు భయంకరమైన బస్సు ప్రమాదాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
కొండకట్టు (2018)
2018లో జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆంజనేయ స్వామి ఆలయం నుంచి తిరిగి వస్తున్న టీఎస్ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్డు వద్ద గల లోయలాంటి ప్రదేశంలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఏకంగా 57 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద బస్సు ప్రమాదంగా ఇది నిలిచింది. బ్రేక్ ఫెయిల్ కావడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అప్పట్లో కథనాలు వచ్చాయి.
మహబూబ్ నగర్ (2013)
బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు వోల్వో బస్సు కారును ఓవర్ టేక్ చేసే క్రమంలో కల్వర్ట్ ను ఢీకొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చాలా మంది బస్సులోనే సజీవ దహనం కావడం దేశవ్యాప్తంగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.
చేవెళ్ల (2025)
తాజాగా చెవేళ్ల మండలంలో చోటుచేసుకున్న బస్సు ప్రమాదం.. మృతుల సంఖ్య పరంగా చూస్తే మూడో స్థానంలో నిలిచింది. ఈ ఘటనలో చనిపోయిన 19 మందిలో 10 మంది మహిళలు ఉన్నారు. 8 మంది పురుషులు, ఒక చిన్నారి సైతం ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని మరింత పెంచింది.
మెదక్ (2014)
మెదక్ జిల్లా మూసాయిపేటలో రైల్వే టాక్ ను క్రాస్ చేస్తూ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. పట్టాలను బస్సు దాటుతున్న క్రమంలో నాందేడ్ – హైదరాబాద్ ప్యాసింజర్ రైలు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 17 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.
Also Read: Chevella Bus Accident: బస్సు ప్రమాదంలో తీవ్ర విషాదం.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి
ఖమ్మం (2025)
ఖమ్మం జిల్లా నాయకన్ గూడెం వద్ద బస్సు కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.. మరో 18 మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరారు.
