Loan Scam: తాను పనిచేసిన బ్యాంకుకే లక్షల్లో టోకరా వేసిన కేసులో, నిందితుడైన ఉద్యోగికి సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టు తాజాగా శిక్ష విధించింది. కేసులు నమోదైన సుమారు 20 ఏళ్ల తర్వాత నిందితునికి శిక్ష పడటం గమనార్హం. పాతబస్తీ చందూలాల్ బారాదరిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసిన వీ. చలపతిరావుకు కోర్టు రెండేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.36 వేల జరిమానా విధించింది. తేలికగా డబ్బు సంపాదించేందుకు చలపతిరావు, అప్పటి బ్రాంచ్ మేనేజర్ పీ.పీ. కృష్ణారావు, తన భార్య విరజ, కలీం పాషాతో కలిసి మోసాలకు తెరలేపాడు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, 1996 నుంచి 2000వ సంవత్సరం వరకు వేర్వేరు వ్యక్తులకు పెద్ద మొత్తంలో రుణాలు మంజూరయ్యేలా చూశాడు.
Also Read: Baahubali craze: ఖండాంతరాలు దాటిన బాహుబలి మేనియా.. ఇది చూస్తే ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే..
ఈ వ్యవహారం వెలుగు చూడటంతో, 2002, మే 1న హైదరాబాద్ సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేశారు. 2004, డిసెంబర్ 31న కోర్టుకు ఛార్జిషీట్ కూడా సమర్పించారు. ఈలోపు బెయిల్‌పై విడుదలైన చలపతిరావు 2005 మొదట్లోనే కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి అతని కోసం గాలిస్తున్న సీబీఐ అధికారులు ఎట్టకేలకు 2024, ఆగస్టు 4న అతడిని అదుపులోకి తీసుకున్నారు. సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టు ప్రత్యేక ట్రయల్‌ను నిర్వహించి, చలపతికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.
