Hydra: భూమి ధరలు ఆకాశాన్నంటుతున్న మణికొండ మున్సిపాలిటీలో దశాబ్దాలుగా కబ్జాల చెరలో చిక్కుకున్న ప్రభుత్వ భూమితో పాటు పార్కులకు హైడ్రా (Hydra) విముక్తి కల్పించింది. దాదాపు రూ. 300ల కోట్ల విలువైన భూమిని సేవ్ చేసింది. ఇందులో ఒక ఎకరం ప్రభుత్వ భూమి కాగా, 7650 గజాల పార్కు స్థలాలున్నట్లు హైడ్రా వెల్లడించింది. వీటికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మణికొండలోని పంచవటి కాలనీలో వెస్టర్న్ ప్లాజాకు చేరువలో ఉన్న ఒక ఎకరా భూమికి ఎలాంటి పత్రాలు లేకుండా తమ పూర్వీకులదని చెప్పి కబ్జా చేసిన వారిని హైడ్రా శనివారం ఖాళీ చేయించింది. ప్రభుత్వ భూమిలో కబ్జాదారులు తిష్ట వేశారంటూ వెస్టర్న్ ప్లాజాకు చెందిన వారు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో హైడ్రా అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. క్షేత్ర స్థాయిలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో పరిశీలించి ప్రభుత్వ భూమి అని నిర్ధారించుకున్న తర్వాతే శనివారం ఆక్రమణలను తొలగించి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులను ఏర్పాటు చేశారు. దీని విలువ దాదాపు రూ. కోటి 55 లక్షలు ఉంటుందని స్థానిక అధికారులు అంచనా వేశారు.
Also Read: Hydraa: మరో సంచలన నిర్ణయం తీసుకున్న హైడ్రా.. మీరు ఇండ్లు కోల్పోయారా..!
రెండు పార్కులకు విముక్తి
మణికొండ మున్సిపాలిటీలోనే వెంకటేశ్వర కాలనీలో 1600 గజాల పార్కు స్థలాన్ని కూడా హైడ్రా కాపాడింది. 1992లో లే ఔట్ వేసినప్పుడు పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించి కేటాయించిన ఈ స్థలంలో అనుమతి లేని లే ఔట్‌తో కొంత మంది ఆక్రమణలకు పాల్పడ్డారు. పార్కు స్థలంలో బై నెంబర్లు వేసుకుని కబ్జాలు చేశారంటూ హైడ్రా ప్రజావాణికి వెంకటేశ్వర కాలనీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు విచారణ చేయగా, నెక్నాంపూర్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు 1996లోనే పార్కు, ప్రజావసరాల స్థలాన్ని గిఫ్ట్ డీడ్‌గా ఇచ్చినట్టు తేలింది.
1600 గజాల స్థలాన్ని స్వాధీనం
అయితే తర్వాత మున్సిపాలిటీ అయ్యాక 2019లో ఈ స్థలాలకు అనుమతులు ఇచ్చినట్టు స్థానికులు హైడ్రాకు తెలిపారు. ఇలా పలు వివాదాల్లో ఉన్న 1600 గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకుని పార్కు స్థలంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. దీని విలువ రూ. 25 కోట్లు ఉంటుందని అంచనా. ఇదే మున్సిపాలిటీలోని తిరుమల హిల్స్‌లోని 6150 గజాల పార్కు స్థలం కూడా కబ్జాలకు గురైంది. ఇందులో తాత్కాలికంగా వేసిన షెడ్డులు, కాంపౌండ్ వాల్‌ను తొలగించి హైడ్రా ఫెన్సింగ్ వేసింది. కాపాడిన ఆ స్థలం పార్కు స్థలంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులను ఏర్పాటు చేసింది. మార్కెట్లో ఈ భూమి విలువ రూ. 120 కోట్లు వరకూ ఉంటుందని స్థానిక అధికారులు అంఛనా వేశారు.
Also Read: Hydra: పార్కుల రక్షణకు హైడ్రా మాస్టర్ ప్లాన్.. ఆక్రమణలు కబ్జాలపై ఫోకస్!
