Hydraa: గ్రేటర్ పరిధిలోని సర్కారు ఆస్తులైన చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణలో నివాసాలు కోల్పోయిన బాధితులకు హైడ్రా(Hydraa) బాసటగా నిలవనున్నది. సిటీలో ఇప్పటివరకు హైడ్రా భమృక్ ఉద్ధౌలా చెరువు(Bhamruk Uddhaula Lake), బతుకమ్మ కుంట(Bathukamma Lake), కూకట్ పల్లి సున్నం చెరువు(Sunam Cheruvu), మాదాపూర్‌లోని తమ్మిడికుంట చెరువుల ఎఫ్టీఎల్‌లను గుర్తించి, అక్కడి ఆక్రమణలను తొలగించింది. ఓవైపు చెరువుల పరిరక్షణ చర్యలపై హర్షం వ్యక్తం అవుతున్నప్పటికీ, ఇంకోవైపు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో తక్కువ ధరకు భూమిని కొనుగోలు చేసి నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేదలకు అన్యాయం జరుగుతుందన్న విమర్శలు సైతం వచ్చాయి. ఈ క్రమంలో మానవీయ కోణంలో స్పందించిన హైడ్రా వాస్తవానికి బఫర్ జోన్ లలో నివాసాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తున్న బాధితులకు ప్రత్యామ్నాయంగా ఎక్కడా కూడా స్థలం గానీ, ఇళ్లు గానీ లేని వారికి ట్రాన్స్‌ఫర్ డెవలప్‌మెంట్ రైట్స్(టీడీఆర్)లను ఇప్పించాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు హైడ్రా ప్రతిపాదనలను సిద్ధం చేసి సర్కారుకు పంపాలని భావిస్తున్నట్లు తెలిసింది.
అన్యాయం జరుగకుండా..
ఇటీవలే గాజుల రామారంలో సుమారు 300 ఎకరాల సర్కారు భూమిని హైడ్రా కాపాడింది. ఆ సమయంలో చాలా మంది పేదలు చిన్న చిన్న ప్లాట్లను కొనుగోలు చేసి, నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని హైడ్రా గుర్తించింది. ఇలాంటి వారు హైడ్రాను ఆశ్రయిస్తే న్యాయం చేసే దిశగా ఆలోచిస్తామని, భూములు విక్రయించిన వారిపై ఫిర్యాదులు చేస్తే చట్టపరమైన చర్యలకు సిద్ధమని వెల్లడించింది. అంతేగాక, సర్కారు భూములు, చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను చిన్న చిన్న ప్లాట్లుగా చేసి విక్రయించిన వారిలో ఎక్కువ మంది బాడా బాబులే అయినా, వాటిని కొనుగోలు చేసి మోసపోయిన వారిలో నూటికి నూరు శాతం పేద, మధ్య తరగతి ప్రజలే ఉంటున్నందున వారికి ప్రత్యామ్నాయంగా టీడీఆర్‌లు ఇప్పించాలని హైడ్రా భావిస్తున్నట్లు సమాచారం. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లోని నిర్మాణాలు తొలగించిన తర్వాత నిరాశ్రయులైన వారిని ప్రత్యేక ప్రామాణికంగా తీసుకుని లబ్ధిదారులను గుర్తించాలని భావిస్తున్నట్లు సమాచారం.
Also Read: ACB Bribe Scandal: తప్పించుకునేందుకు ఏసీబీ ‘వసూళ్ల సార్’ ప్రయత్నం.. తెరవెనుక ఏం జరుగుతోందంటే?
చెరువుల పరిరక్షణకు శాశ్వత పరిష్కారం
చెరువులు, కుంటల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోని ఆక్రమణల్లో నివసిస్తూ, వాటిని తొలగించిన తర్వాత నిరాశ్రయులయ్యే వారికి టీడీఆర్(TDR)లు ఇవ్వగలిగితే నిర్మాణాల సమస్యకు శాశ్వత పరిష్కారం సమకూరుతుందని సర్కారు కూడా భావిస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్(Hyderabad)లోని అనేక చెరువుల పరిరక్షణలో భాగంగా, వాటి ఎఫ్టీఎల్(FTL), బఫర్ జోన్‌లలోని నిర్మాణాలకు అనుమతులు లేవు. అయితే, గత కొన్ని దశాబ్దాలుగా సరైన అవగాహన లేక, నిబంధనలు కఠినంగా అమలు కాకపోవడంతో వేలాదిగా ఇళ్లు, వాణిజ్య సముదాయాలు బఫర్ జోన్లలో వెలిశాయి. ఇటీవలి కాలంలో పర్యావరణ పరిరక్షణ, వరదల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించడంతో ఈ నిర్మాణాల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. వాటిని క్రమబద్ధీకరించలేక, కూల్చివేయడానికి తగిన పరిహారం చెల్లించలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
దీంతో ఆయా ఆస్తుల యజమానులు తమ ఇళ్లను అమ్ముకోలేక, వాటిపై రుణాలు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెరువులు, కుంటల పరిరక్షణ చర్యల్లో భాగంగా తొలగించినా, మున్ముందు తొలగించాల్సిన కట్టడాలకు సంబంధించిన బాధ్యులకు నగదు పరిహారానికి బదులుగా టీడీఆర్ ఇచ్చే విషయంపై జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలతో కలిసి హైడ్రా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నిర్ణయం కొలిక్కి వస్తే చెరువుల పరిరక్షణతో పాటు, ఏళ్ల తరబడి నలిగిపోతున్న వేలాది కుటుంబాలకు ఊరట లభించడంతో పాటు చాలా చెరువులను ఎఫ్టీఎల్‌తో పాటు బఫర్ జోన్లతో కలిపి అభివృద్ధి చేసేందుకు సర్కారుకు మార్గం సుగమం అవుతుందని హైడ్రా భావిస్తున్నది.
Also Read: Naveen Yadav: నవీన్ యాదవ్ పై చర్యలు తీసుకోండి.. ఈసీకి ఫిర్యాదు

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				