ACB Bribe Scandal: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీతో పైరవీ!
మరోవైపు విచారణను ముమ్మరం చేసిన అధికారులు
తాజాగా కీలక ఆధారాలు స్వాధీనం
డీఎస్పీ బ్యాచ్ మేట్ పాత్రపై ఆరా?
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడి ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్న వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ అధికారి ఈ వ్యవహారం నుంచి తప్పించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిసింది. దీని కోసం గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉండి ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరిన ఓ నాయకుడిని సహాయం చేయాలని అడిగినట్టు సమాచారం. మరోవైపు సదరు డీఎస్పీపై వచ్చిన ఆరోపణలపై ఏసీబీ ఉన్నతాధికారులు విచారణను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో బుధవారం కొన్ని కీలకమైన ఆధారాలను సేకరించినట్టుగా తెలియవచ్చింది. ఇక, మొత్తం ఎపిసోడ్లో ఏసీబీలోనే ఉన్న సదరు డీఎస్పీ బ్యాచ్ మేట్ పాత్రపై కూడా విచారణాధికారులు ఆరా తీస్తున్నట్టుగా (ACB Bribe Scandal) తెలిసింది.
వరంగల్ జిల్లాలో ఎమ్మార్వోగా పని చేస్తున్న అధికారిని ఇటీవల ఏసీబీ అధికారులు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టుగా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంట్లో కీలకపాత్ర వహించిన వరంగల్ రేంజ్ డీఎస్పీ సదరు ఎమ్మార్వో మొబైల్ ఫోన్‌ను సీజ్ చేశారు. ఆ తర్వాత దాంట్లో నుంచి కాల్, వాట్సాప్ డేటాను తీసుకున్నారు. లిస్టులో ఉన్న ఒక్కొక్కరికి ఫోన్లు చేసి పిలిపించుకుంటూ అరెస్టయిన ఎమ్మార్వోకు బినామీలుగా ఉన్నట్టుగా విచారణలో తేలింది…అరెస్ట్ తప్పదని బెదిరిస్తూ డబ్బు వసూళ్లకు శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. డీఎస్పీ వేధింపులు ఎక్కువ అవుతుండటంతో ఇద్దరు బాధితులు వాట్సాప్ ద్వారా ఏసీబీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. వాట్సాప్ ద్వారా అందిన ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న ఏసీబీ ఉన్నతాధికారులు ప్రస్తుతం దీనిపై విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం డీఎస్పీ బాధితుల్లో ఆరుగురిని ఏసీబీ హెడ్ క్వార్టర్స్‌కు పిలిపించి వారి స్టేట్‌మెంట్లు రికార్డ్ చేశారు. దాంతో నేడో…రేపో లక్షల్లో డబ్బు వసూలు చేసిన డీఎస్పీపై వేటు పడే అవకాశాలు ఉన్నట్టుగా ఏసీబీ వర్గాల్లోనే జోరుగా చర్చ జరుగుతోంది.
Read Also- Pawan Kalyan: మొంథా తుపాను నేపథ్యంలో అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు
తప్పించుకునేందుకు…
ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ కేసు నుంచి తప్పించుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్టుగా తెలిసింది. దీని కోసం బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీగా పని చేసి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఓ నాయకున్ని ఎలాగైనా నన్ను బయట పడేయాలని అభ్యర్థించినట్టు సమాచారం. సదరు నాయకునితో డీఎస్పీకి సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా వరంగల్ రేంజ్ ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి.
బాధితులకు బెదిరింపులు…
అదే సమయంలో ఫిర్యాదులు ఇవ్వటానికి ముందుకొచ్చిన కొందరు బాధితులను బెదిరింపులకు కూడా గురి చేస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే డబ్బు ఇచ్చిన వారిని పిలిపించుకుని మీ డబ్బు మీకు ఇచ్చేస్తా…కావాలంటే కొంత అదనంగా కూడా ఇస్తా విచారణాధికారుల ఎదుట స్టేట్ మెంట్ మాత్రం ఇవ్వొద్దు అని బతిమాలుకుంటున్నట్టు సమాచారం. ఎమ్మార్వో కేసులో హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న ఓ వ్యక్తి నుంచి డీఎస్పీ 20 లక్షలు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి రెండు ఆడియో టేపులు కూడా బయట పడ్డాయి. అయితే, మరో 80లక్షలు ఇవ్వాలని డీఎస్పీ నుంచి బెదిరింపులు ఎక్కువ కావటంతో బాధితుడు ఫిర్యాదు ఇవ్వటానికి సిద్ధమయ్యాడు. అప్పటికే మరో ఇద్దరు బాధితులు కంప్లయింట్ ఇచ్చారు. దాంతో విచారణ మొదలయ్యింది. ఇటువంటి పరిస్థితుల్లో డబ్బు ఇచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వాంగ్మూలం ఇస్తే పూర్తిగా ఇరుక్కు పోవటం ఖాయమని భావించిన డీఎస్పీ అతనితో రాజీ కుదుర్చుకున్నట్టుగా తెలిసింది.
Read Also- Chhattisgarh: మావోయిస్టులకు భారీ షాక్.. బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేంద్రకుమార్ ఎదుట 51 మంది సరెండర్
ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే దీంట్లో డీఎస్పీకి బ్యాచ్ మేట్ అయిన మరో ఏసీబీ అధికారి కీలకపాత్ర వహించినట్టుగా తెలుస్తుండటం. ఈ అధికారే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో మాట్లాడి వాంగ్మూలం ఇవ్వకుండా చేసినట్టుగా సమాచారం. తాను చెప్పినట్టు వినకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్టుగా తెలిసింది. చెప్పినట్టు వింటే నీ డబ్బు నీకు తిరిగి ఇచ్చేలా చూస్తానని భరోసా కూడా ఇచ్చినట్టు సమాచారం. దాంతో విచారణాధికారుల వద్ద సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పెదవి విప్పలేదని తెలిసింది. అయితే, చేతులు మారిన 20 లక్షల వ్యవహారంలో విచారణాధికారులు బుధవారం కొన్ని కీలక ఆధారాలు సేకరించినట్టుగా తెలియవచ్చింది. దాంతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వాంగ్మూలం ఇవ్వకుండా చేసిన మరో అధికారి పాత్రపై కూడా ఆరా మొదలు పెట్టినట్టుగా తెలిసింది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా రోజుకో మలుపు తిరుగుతున్న డీఎస్పీ వసూళ్ల పర్వం కేసులో ఏం జరుగుతుందో అన్న దానిపై ప్రస్తుతం ఏసీబీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
