GHMC Commissioner: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా పోలింగ్ కేంద్రంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర అత్యంత కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ (GHMC Commissioner) ఆర్.వి. కర్ణన్ స్పష్టం చేశారు. పోలింగ్ ప్రక్రియ ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకూ ప్రతి అంశాన్ని వారు పరిశీలించి సాధారణ పరిశీలకులకు నివేదిక పంపాల్సి ఉంటుందన్నారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల విధులు, బాధ్యతలపై జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక విధుల్లో పాల్గొనే 120 మందికి పైగా సూక్ష్మ పరిశీలకులకు ఎన్నికల సాధారణ పరిశీలకులు రంజిత్ కుమార్ తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Also Read: GHMC Commissioner: జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు గుడ్ న్యూస్.. భీమా రూ. 30 లక్షలకు పెంపు
నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలి
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు సూక్ష్మ పరిశీలకులు సాధారణ పరిశీలకుల నియంత్రణలో పని చేయాలని వివరించారు. పోలింగ్ కేంద్రాలలో వీరు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని తెలిపారు. మాక్ పోలింగ్ నిర్వహణ, పోలింగ్ సజావుగా జరిగేలా చూడాలన్నారు. ఎన్నికల విధుల్లో ఎలాంటి వత్తిళ్లకు గురి కాకుండాగ నిబంధనలు మేరకు ఓటింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే వెంటనే సాధారణ పరిశీలకుల దృష్టికి తీసుకురావాలన్నారు. పోలింగ్ రోజున పరిశీలించిన అంశాలను వారికి ఇచ్చిన ఫార్మాట్‌లో పూరించి అబ్జర్వర్‌కు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్, శిక్షణ నోడల్ అధికారి హేమంత్ కేశవ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎంల రెండో విడత రాండమైజేషన్ పూర్తి
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఏర్పాట్లలో భాగంగా బుధవారం యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో రెండో విడత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం)ల రెండో విడత రాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం నియమించిన జనరల్ ఆబ్జర్వర్ రంజిత్ కుమార్, పోలీస్ ఆబ్జర్వర్ ఓం ప్రకాశ్ త్రిపాఠీ, వ్యయ పరిశీలకుడు సంజీవ్ కుమార్ లాల్, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల ఏజెంట్లు సమక్షంలో భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా నిర్వహించారు. ఈ రాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను నిష్పక్షపాతంగా కేటాయించినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ (ఎలక్షన్స్ ) హేమంత్ కేశవ్ పాటిల్, రిటర్నింగ్ ఆఫీసర్ పి. సాయి రామ్ తదితర ఎన్నికల అధికారులు హాజరయ్యారు.
Also Read: GHMC Commissioner: పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.. అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశం
