Rohit Arya: ముంబైలో ఆడిషన్స్ కోసం వచ్చిన చిన్నారులను బంధించిన వ్యవహారం పెను సంచలనం సృష్టించింది. 17 మంది చిన్నారుల సహా 19 మందిని పోలీసులు రక్షించగా, ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో(Encounter) నిందితుడు రోహిత్ ఆర్య(Rohith Arya) మృతిచెందాడు. రెస్క్యూ ఆపరేషన్ సమయంలో నిందితుడు కాల్పులు జరిపాడని, దీంతో ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు స్పష్టం చేశారు. తీవ్ర గాయాలైన అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.
ఆర్‌ఏ స్టూడియోలో..
పూర్తి వివరాల్లోకెళితే.. పోవాయిలోని మహావీర్ క్లాసిక్ భవనం(Mahavir Classic Building)లో ఉన్న ఆర్‌ఏ స్టూడియో(RA Studio)లో ఆడిషన్స్‌కు వచ్చిన 17 మంది పిల్లలు, ఒక వృద్ధుడు, మరో వ్యక్తి సహా మొత్తం 19 మందిని రోహిత్ బందీగా పట్టుకున్నాడు. తన డిమాండ్లు డబ్బుకు సంబంధించినవి కావని, కొన్ని నైతిక, ధార్మిక ప్రశ్నలకు జవాబులు కావాలంటూ వీడియో(Video) రిలీజ్ చేశాడు. కొంతమంది నిర్దిష్ట వ్యక్తులతో మాట్లాడాలని, లేదంటే స్టూడియోకు నిప్పు పెడతానని సినిమాలో లాగా బెదిరించాడు. గతంలో ప్రభుత్వ పనులకు సంబంధించి చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయని నిరసన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
Also Read: Raju Weds Rambai: ‘ఆర్ఎక్స్ 100’, ‘బేబి’.. ఆ జాబితాలోకి చేరే సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి’
35 నిమిషాల్లోనే..
సమాచారం అందిన వెంటనే ముంబై పోలీసులు, క్విక్ రియాక్షన్ టీమ్, బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్, ఫైర్ బ్రిగేడ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. నిందితుడితో సుమారు రెండు గంటల పాటు అధికారులు చర్చలు జరిపారు. చర్చలు విఫలం కావడంతో, కమాండోలు బాత్‌రూమ్ కిటికీ ద్వారా స్టూడియోలోకి ప్రవేశించి కేవలం 35 నిమిషాల్లో రెస్క్యూ ఆపరేషన్‌ను పూర్తి చేశారు. నిందితుడు ఆర్య(Arya) ఎయిర్ గన్(Air Jun)తో కాల్పులు జరపడానికి ప్రయత్నించడంతో, పోలీసులు కూడా కాల్పులు జరిపి అతన్ని గాయపరిచారు. ఈ కాల్పుల్లో గాయపడిన రోహిత్‌ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. బందీలుగా ఉన్న 17 మంది పిల్లలు సహా అందరూ సురక్షితంగా రక్షించబడ్డారు. వారిని వైద్య పరీక్షల అనంతరం వారి తల్లిదండ్రులకు అప్పగించారు. స్టూడియో నుంచి ఎయిర్ గన్, రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు.

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				