Nuclear Weapons Test: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన దుందుడుకు చర్యలతో యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. దౌత్యపరంగా భారత్ తమకు ముఖ్యమని.. ప్రధాని మోదీ మంచి స్నేహితుడని చెబుతూనే 50 శాతం సుంకాలు విధించి షాక్ కు గురిచేశారు. ఇదిలా ఉంటే గురువారం చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ (Xi Jinping)తో ట్రంప్ భేటీ కాబోతున్నారు. చైనా అంటే కస్సుబస్సు అంటోన్న ట్రంప్.. ఇప్పుడు ఆ దేశ అధ్యక్షుడితో భేటి కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ట్రంప్.. అణు పరీక్షల పునః ప్రారంభానికి ఆదేశించడం సంచలనంగా మారింది. సరిగ్గా చైనా అధ్యక్షుడితో భేటి జరుగుతున్న క్రమంలోనే ట్రంప్ ఈ ఆదేశాలు ఇవ్వడం వెనక కారణం ఏంటన్న చర్చ మెుదలైంది.
1992 తర్వాత తొలిసారి..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తక్షణమే అణ్వయుధాల పరీక్షలను పునఃప్రారంభించమని ఆదేశించినట్లు ప్రముఖ అంతర్జాతీయ మీడియా రాయిటర్స్ వెల్లడించింది. ఈ మేరకు ఆ దేశ రక్షణ శాఖకు ట్రంప్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సూచించింది. అయితే అమెరికా తన చివరి అణు పరీక్షను 1992లో నిర్వహించింది. ఇదిలాఉంటే గతవారం అణు ఇంధనంతో నడిచే ‘బురెవెస్ట్నిక్’ (Burevestnik cruise missile) అనే క్షిపణిని రష్యా పరీక్షించింది. ఈ క్షిపణి ఏ రక్షణ వ్యవస్థ నుంచైనా తప్పించుకోలగదని మాస్కో ప్రకటించింది. అంతేకాదు ఉక్రెయిన్ యుద్ధంలో ఈ క్షిపణిని వినియోగించేందుకు కూడా రష్యా సేనలు సిద్ధమవుతున్నట్లు వార్తలు వచ్చాయి.
ట్రంప్ ఆదేశాల వెనుక కారణం?
చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ తో దక్షిణ కొరియా (South Korea) వేదికగా ట్రంప్ భేటి కానున్నారు. అయితే ఈ సమావేశానికి ముందు ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ (Trooth) లో కీలక పోస్ట్ పెట్టారు. ‘ఇతర దేశాల అణు పరీక్షా కార్యక్రమాల కారణంగా నేను రక్షణ శాఖను (Department of War) అణు ఆయుధాల పరీక్షలను ప్రారంభించమని ఆదేశించాను. ఆ ప్రక్రియ తక్షణమే ప్రారంభమవుతుంది’ అని అన్నారు. అంతేకాదు అత్యధిక అణు ఆయుధాలు కలిగిన దేశాల జాబితాలో అమెరికా తర్వాత రష్యా (Russia) రెండోస్థానంలో ఉందని చెప్పారు. చైనా (China) మూడో స్థానంలో కొనసాగుతోందని పేర్కొన్నారు. అమెరికా ఎలాంటి అణు పరీక్షలు నిర్వహించకపోతే.. ఐదేళ్లలో వారు తమ దగ్గరకు వచ్చేస్తారని ట్రంప్ చెప్పుకొచ్చారు. తమ అణ్వాయుధాలకు విధ్వంసక శక్తి ఎక్కువని.. ప్రస్తుత పరిస్థితుల్లో అణు పరీక్షలు నిర్వహించడం తప్ప మరో మార్గం లేదని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
అమెరికాను టార్గెట్ చేసిన రష్యా
పోసైడాన్ అనే అణుశక్తితో నడిచే సూపర్ టార్పెడోని (Poseidon nuclear-powered super torpedo) విజయవంతంగా పరీక్షించినట్లు గత బుధవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ (Vladimir Putin) ప్రకటించారు. అక్టోబర్ 21న బురేవెస్ట్నిక్ క్షిపణి పరీక్ష, అక్టోబర్ 22న అణు ప్రయోగానికి సంబంధించిన డ్రిల్స్ ను రష్యా నిర్వహించింది. మాస్కోపై ట్రంప్ కఠిన వైఖరి అవలంభిస్తున్న క్రమంలో పుతిన్ తమ అణు సామర్థ్యాలను పెంచుకుంటూ పోతుండటం అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ క్రమంలోనే రష్యా అణు పరీక్షలపై ట్రంప్ స్పందించారు. ‘ఇది సరైనది కాదు’ అని పేర్కొన్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా పుతిన్ దృష్టి పెట్టాలని సూచించారు.
Also Read: Warangal Montha Cyclone: ఓరుగల్లును ముంచిన మొంథా తుఫాన్.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం!
ఒకేసారి చైనా, రష్యాకు చెక్
అణు పరీక్షలను ఏ దేశం నిర్వహించినా రెండు విషయాలను పరిగణలోకి తీసుకుంటుంది. ఒకటి కొత్త ఆయుధాల సామర్థ్యాన్ని టెస్ట్ చేయడం.. రెండోది పాత ఆయుధాలు సరిగా పనిచేస్తున్నాయా? అని నిర్ధారించడం. అయితే సరిగ్గా చైనా అధ్యక్షుడితో భేటికి ముందే అణు పరీక్షలను పునః ప్రారంభించాలని ట్రంప్ ఆదేశించడం వెనుక ఓ వ్యూహాం ఉన్నట్లు రక్షణశాఖ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా తన అణ్వాయుధ బలం ఏంటో రెండు దేశాలకు చాటి చెప్పాలని భావిస్తోందని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే అమెరికా అణ్వాయుధ దేశంగా 1945లో అవతరించింది. న్యూమెక్సికోలోని అలమోగోర్డోలో అణుబాంబును పరీక్షించడం ద్వారా ఈ జాబితాలో వచ్చింది చేరింది. జపాన్ లోని హిరోషిమా, నాగసాకి ప్రాంతాలపై అణుబాంబులను జాడవిరిచి యావత్ ప్రపంచాన్ని అమెరికా ఉలిక్కిపడేలా చేసింది.
