Warangal Montha Cyclone: మొంథా తుఫాన్ ఎఫెక్ట్ తో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం ఓరుగల్లును ముంచింది. తుఫాన్ ప్రభావంతో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుండడంతో ఎటూ చూసిన జలమయంగా కనిపిస్తుంది. ఉదయం నుండి ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షంతో ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాలో వాగులు వంకలు పొంగి రహదారిపై ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. హనుమకొండ, కాజీపేట, వరంగల్ లో అనేక కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. జిల్లాలో వర్షాల కారణంగా జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. అప్రమత్తం అయిన అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల నేపద్యంలో రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
భారీ వర్షంతో వరద నీరు వరంగల్, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వే స్టేషన్లో పట్టలపైకి వరద నీరు చేరింది. దీంతో డోర్నకల్ స్టేషన్లో గోల్కొండ ఎక్స్ప్రెస్ నిలిపివేశారు. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. విజయవాడ వైపు వెళ్లే రైళ్లు అన్ని రద్దు చేశారు అధికారులు. సికింద్రాబాద్ వెళ్లేందుకు వరంగల్ నుండి ప్రత్యేక లోకల్ ట్రైన్ కూడా ఏర్పాటు చేశారు.
హనుమకొండ బస్టాండ్ లో వరద నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన అంబులెన్స్ ఇరుక్కుపోయి రోగి ఇబ్బందులు పడ్డారు.
నగరం మొత్తం ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హనుమకొండ డబల్ బెడ్ రూమ్ గ్రౌండ్ ఫ్లోర్ లోకి వర్షం నీళ్లు చేరాయి. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడు – ఏన్కూరు మార్గంలో జన్నారం వాగులో లారీ కొట్టుకుపోయింది. వరంగల్ మహానగరంలోని భద్రకాళి రోడ్ నీట మునిగిన సరస్వతీ కాలనీలోకి వరద నీరు చేరింది.
హనుమకొండను ముంచిన మొంథా
మొంథా తుఫాన్ తాకిడికి హనుమకొండ అతలాకుతలంగా అయ్యింది. రోజంతా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి నగరం జలమయంగా మారింది. వర్షం కారణంగా వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. హనుమకొండ చౌరస్తా చెరువును తలపించింది. ఎస్ ఆర్ నగర్ సహా అనేక కాలనీల్లో వరద నీరు చేరింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్నేహా శబరీశ్ కోరారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయక చర్యలు చేపట్టాలని స్థానిక ఆధికారులను కలెక్టర్ ఆదేశించారు
పాఠశాలలకు నేడు సెలవు
మొంథా తుఫాన్ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటిస్తున్నట్లు వరంగల్ కలెక్టర్ సత్య శారద తెలిపారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. వర్షాలు కొనసాగుతుండడంతో పాటు తుఫాను తెలంగాణ కేంద్రీకృతమే ఉన్న కారణంగా ఈ సెలవును పొడిగిస్తున్నట్లు ఆమె చెప్పారు. తుఫాన్ కారణంగా నగరంలోని బట్టల బజార్, వరంగల్ చౌరస్తా శివనగర్ శాఖ రాసి కుంట ఎన్ టి ఆర్ నగర్ తో పాటు అండర్ బ్రిడ్జ్ వద్ద భారీగా వర్షం నీరు చేరడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. మొంథా తుఫాన్ భారీ వర్షాల దృష్ట్యా జిల్లా కలెక్టర్ లోతట్టు ప్రాంతాలవాసులకు పునరావస కేంద్రాలు ఏర్పాటు చేశారు.
పంటలకు తీరని నష్టం
ఆరుగాలం కష్టపడి అన్నదాతలు పండించిన పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్ ప్రభావంతో ఈదురు గాలులతో కురుస్తున్న వర్షానికి వరంగల్ ఉమ్మడి జిల్లాలో వేల ఎకరాల్లో కోతకు వచ్చిన వరి పంట నెలకు ఒరిగింది. ప్రతిన పంట పూర్తిగా పనికి రాకుండా పోయింది. వరి పంటతో అయిన కోలుకుంటాం అనుకున్న రైతుల ఆశలపై తుపాన్ నీళ్లు పోసింది. పత్తి, వరి పంట, మిర్చి పంట నీటిలో మునిగిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
