Cyclone Politics: ‘తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే!’ అనే నానుడి.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ట్రెండ్‌కు అతికినట్టుగా సరిపోతుంది. ‘తుపాను తుపానే.. రాజకీయం రాజకీయమే’ అంటున్నాయి అధికార కూటమి పక్షాలు, విపక్ష వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ. ‘మొంథా తుపాను’ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతాల్లో ఈదురు గాలులు పెనుబీభత్సం సృష్టించాయి. ప్రాణనష్టం లేకపోయినా.. వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అయితే, ఈ ప్రకృతి విపత్తు బాధితుల్లో విచారాన్ని నింపగా… అధికార టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి – విపక్ష వైసీపీ మధ్య రాజకీయ కాకను రేపింది. ‘తుపాన్లు వస్తుంటాయ్.. పోతుంటాయ్.. పాలిటిక్స్ పర్మినెంట్’ అన్నట్టుగా అధికార, విపక్ష పార్టీలకు చెందినవారు పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నారు. రాజకీయ విమర్శల దాడులు (Cyclone Politics) చేసుకుంటున్నారు.
మీది బిల్డప్.. మీకు సిగ్గులేదు!
కూటమి పార్టీలు, వైసీపీ మధ్య గొడవ ఎక్కడ వచ్చిందంటే.. మొంథా తుపాను విషయంలో సీఎం చంద్రబాబు, మొదలుకొని ప్రభుత్వ పెద్దలంతా బిల్డప్ ఇవ్వడం తప్ప, పెద్దగా చేసిందేమీ లేదంటూ రెండు రోజులుగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారు. సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రంలో (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు జరిపిన సమీక్షకు సంబంధించిన ఫొటోలపై ఫ్యాన్ పార్టీ వాళ్లు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. సమీక్షలో కూర్చొని తుపానును కంట్రోల్ చేస్తున్నారంటూ మీమ్స్ పేల్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ తన నియోజకవర్గానికి వెళ్లకుండా షోయింగ్ చేస్తున్నారంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. మొత్తంగా ప్రభుత్వం పెద్దలంతా పైపైబిల్డప్‌లు ఇస్తున్నారని, సహాయక చర్యలు అందక జనాలు ఇబ్బంది పడుతున్నారంటూ విపక్ష పార్టీ విమర్శలు చేస్తోంది. ఈ మేరకు వైసీపీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్‌తో పాటు మరికొన్ని పేజీల్లోనూ విస్తృతంగా పోస్టులు వెలిశాయి, వెలుస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ, పిఠాపురం నియోజవర్గంలో వైసీపీ నేత వంగా గీత సహాయక చర్యలు కొనసాగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని పొలిటికల్ అస్త్రాలు సంధిస్తున్నారు.
DCM in Hyderabad while Vanga Geetha taking care of people in in pitapuram..pic.twitter.com/AB6NkWc0lB https://t.co/JQ0vR1Q6pj
— Salar (@mysalar_) October 28, 2025
Read Also- Aadhar Card New Rules: ఆధార్ అప్‌డేట్‌లో కొత్త రూల్స్.. నవంబర్ 1 నుంచే అమలు.. తెలుసుకోకుంటే ఇబ్బందే!
వైసీపీకి కౌంటర్ల మీద కౌంటర్లు
అధికార పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ఏమైనా తక్కువ తిన్నారా!. మొంథా తుపాను సహాయక చర్యలపై విపక్ష వైసీపీ చేస్తున్న ట్రోలింగ్‌కు అదే స్థాయిలో కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు. మొంథా తుపానుతో ఏపీ జనాలు కష్టాల్లో ఉంటే, ఐదేళ్లపాటు అధికారాన్ని అనుభవించి, జనం సొమ్ము పోగేసుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లో రిలాక్స్ అవుతున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇన్నాళ్లూ అధికారం అనుభవించిన వైసీపీ నేతలు, ఇప్పుడు రాష్ట్ర ప్రజలు తుపాను కష్టాల్లో ఉంటే కనీసం కన్నెత్తైనా చూడడం లేదని మీమ్స్ పేల్చుతున్నారు. విమర్శలు, వెటకారాలు పట్టించుకునే సమయం ఇది కాదని, ఊహించని ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవడం తమకు ముఖ్యమంటూ టీడీపీ, జనసేన నేతలు తమను సమర్థించుకుంటున్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల సహాయక చర్యలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
While a cyclone batters Andhra Pradesh, @ysjagan is chilling in his Bangalore Yelahanka Palace.. built with the people’s looted money.
He is busy enjoying luxury bought from our tears. Such a Disgrace !! #APpreparesForMontha#CycloneMontha pic.twitter.com/GOip8TSsU1
— iTDP Official (@iTDP_Official) October 28, 2025
రాజకీయ తుపాను తీరం దాటేదెప్పుడో..
నిజానికి, మొంథా తుపాను నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు సహాయక చర్యలు తీసుకోవడంతో పాటు, తుపాను తీరం దాటాక కూడా పకడ్బందీ చర్యలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తో పాటు ఇతర మంత్రులు, అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడూ క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అధికార టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన నేతలతో పాటు విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, నేతలు కూడా పలుచోట్ల సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. స్థానికులకు ఆపన్న హస్తం అందించారు. మరి, మొంథా తుపాను తీరం దాటి, వర్షాలు కూడా క్రమక్రమంగా తగ్గుముఖం పట్టాయి. మరి, రాజకీయ తుపాను ఎప్పుడు తీరం దాటుతుందో అంచనా వేయడం కాస్త కష్టమే మరి.
