Azharuddin: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూతతో అనివార్యమైన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, టీమిండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్ సీనియర్ నేత మొహమ్మద్ అజహరుద్దీన్‌కు (Azharuddin) వరంగా మారబోతోందా?, ఆయనకు మంత్రియోగం పట్టనుందా?, ఈ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కేబినెట్‌ను విస్తరించబోతున్నారా?, ముస్లిం సామాజిక వర్గం ఓటర్లను ఆకర్షించి, తద్వారా జూబ్లీహిల్స్ ఉపపోరులో మైలేజీ సాధించడమే దీని వెనుకున్న అసలైన వ్యూహమా?.. అంటే, ఔనంటూ జోరుగా కథనాలు వెలువడుతున్నాయి.
శుక్రవారం ముహూర్తం ఫిక్స్?
అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఖాయమని, ఈ మేరకు నిర్ణయం కూడా జరిగిపోయిందంటూ బుధవారం ఒక్కసారిగా కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. మీడియా సర్కిల్స్‌తో పాటు సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణకు నిర్ణయించుకున్నారని, ఇందుకు ముహుర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారని, శుక్రవారం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ముస్లింల ఓటు బ్యాంకును ఆకర్షించడమే ఈ నిర్ణయం వెనుకున్న ముఖ్య ఉద్దేశమని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ వ్యవహారంపై ఇటు ప్రభుత్వవర్గాలు, అటు పార్టీ వర్గాలు ఇప్పటివరకు అధికారికంగా నోరువిప్పిన దాఖలాలు లేవు. కానీ, ఒక్కసారిగా ఉప్పెనలా తెరపైకి వచ్చిన ఈ ప్రచారం హాట్ టాపిక్‌గా మారిపోయింది.
ప్రచారాస్త్రంగా మలుచుకుంటున్న బీఆర్ఎస్!
కేబినెట్ విస్తరణ ఉండబోతోందంటూ అకస్మాత్తుగా కొత్త అంశం తెరపైకి రావడం, అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వబోతున్నారన్న విస్తృత ప్రచారాన్ని విపక్ష బీఆర్ఎస్ రాజకీయ పావుగా మలుచుకుంటోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే డ్యామేజ్ అయ్యిందని, అందుకే, అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నారంటూ గులాబీ శ్రేణులు ప్రచారం మొదలుపెట్టాయి. నియోజకవర్గంలో ముస్లిం సామాజిక వర్గంవారు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపడం లేదంటూ సర్వే రిపోర్టులు అందడంతో, నష్ట నివారణ చర్యల్లో భాగంగా అజహరుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెడుతున్నారంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టింది.
ఇప్పటికే తెలంగాణ కేబినెట్‌లో ఒక్కరు కూడా ముస్లిం సామాజిక వర్గానికి చెందినవారు లేరంటూ బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. తద్వారా జూబ్లీహిల్స్ ఉపపోరులో ముస్లిం ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకోవాలన్నది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది.
Read Also- Hyderabad Rains: హైదరాబాద్‌లో ఎడతెరిపిలేని వాన.. రంగంలోకి నగర కమిషనర్లు.. క్షేత్రస్థాయిలో పర్యటన
టికెట్ ఆశిస్తే.. మంత్రి పదవి వస్తోంది?
నిజానికి మొహమ్మద్ అజహరుద్దీన్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ తరపున టికెట్ ఆశించారు. ఈ మేరకు విశ్వప్రయత్నాలు కూడా చేశారు. పార్టీ అధిష్టానానికి తన మనసులోని మాటను తెలియజేశారు. తనకే టికెట్ దక్కుతుందని ఆశించారు. కానీ, భంగపాటుకు గురయ్యారు. తానే పోటీ చేస్తానంటూ మీడియా ముఖంగా కూడా ఉద్దేశాన్ని తెలియజేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ స్థానంలో తనకు 64 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయంటూ ఆయన గుర్తుచేశారు. అంతేకాదు, పార్లమెంట్ ఎన్నికల్లో నగరంలో ఈ స్థానంలోనే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు పడ్డాయంటూ తన మెరిట్‌ను చాటిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీకి మొహమ్మద్ అజహరుద్దీన్‌ను దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్న కాంగ్రెస్ పార్టీ ఆయనకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సైడ్ చేసింది. ఇప్పుడేమో ఏకంగా మంత్రి పదవిని కట్టబెట్టబోతోందని, అజహారుద్దీన్‌కు లక్కీగా మంత్రి పదవి దక్కబోతోందంటూ పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
