Hyderabad Rains: మెుంథా తుపాను ప్రభావంతో హైదరాబాద్ లో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. మరోవైపు రోడ్లపైకి నీరు వచ్చి చేరడంతో నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించేందుకు నగర కమీషనర్లు రంగంలోకి దిగారు. హైడ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్లు ఎ.వి. రంగనాథ్, ఆర్. వి. కర్ణన్ లక్డీకపూల్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు.
మాసబ్ ట్యాంకు నుంచి లక్డీకపూల్ వైపు వస్తున్నప్పుడు మెహదీ ఫంక్షన్ హాల్ వద్ద వర్షపు నీరు రోడ్డు మీద నిలవడానికి కారణాలను అధికారులను అడిగి కమిషనర్లు తెలుసుకున్నారు. ఇక్కడ వర్షపు నీరు నిలవడంతో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని.. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని ఇరువురు కమిషనర్లు ఆదేశించారు. ఇప్పటికే ఇక్కడ ఇరువైపులా రోడ్డును తవ్వి రెండు ఫీట్ల విస్తీర్ణంతో ఉన్న పైపులైన్లను వేశామని అధికారులు తెలియజేశారు. వాటికి మహవీర్ ఆసుపత్రి పరిసరాలతో పాటు చింతలబస్తీ ప్రాంతాల నుంచి వచ్చిన మురుగు, వరద నీటిని అనుసంధానం చేయాల్సినవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో త్వరితగతిన ఈ పనులు కూడా పూర్తి చేయాలని కమిషనర్లు సూచించారు.
Also Read: TG CM – Cyclone Montha: తెలంగాణపై మెుంథా ఎఫెక్ట్.. అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ
ఈలోగా మహావీర్ ఆసుపత్రి ముందు నుంచి మెహిదీ ఫంక్షన్ హాల్ వరకు రోడ్డుకు పక్కగా ఉన్న పైపులైన్లలో పేరుకుపోయిన మట్టిని తొలగిస్తే.. సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుందని కమిషనర్లు సూచించారు. ఒకటి రెండు రోజుల్లో ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ పోలీసులు కూడా సహకరించి పైపులైన్ల అనుసంధాన పనులు త్వరగా జరిగేలా సహకరించాలని కోరారు. లక్డీకపూల్ పరిసరాలను సందర్శించిన వారిలో హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్య, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ కూడా కమిషనర్లతో పాటు ఉన్నారు.
