Jubliee Hills Bypoll: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యావద్ పై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘జూబ్లీహిల్స్ మీ అయ్య జాగీరా?’ అంటూ ప్రశ్నించారు. బుధవారం జూబ్లిహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ ఏరియాలో బీఆర్ఎస్ తరపున ఆర్.ఎస్ ప్రవీణ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూబ్లీహిల్స్ దాటి పోలేరని నవీన్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఇలా బహిరంగంగా కాంగ్రెస్ అభ్యర్థి బెదిరిస్తుంటే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. సుమోటోగా ఎందుకు కేసులు పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళల పరిస్థితి ఏంటి?
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎన్నికలకు ముందే ఇలా ఉంటే.. రేపు గెలిస్తే ఇక్కడి మహిళల పరిస్థితి ఏంటో ఓటర్లు ఆలోచించుకోవాలని ఆర్.ఎస్ ప్రవీణ్ సూచించారు.
నవంబర్ 11 న మహిళలు, పురుషులు పెద్ద ఎత్తున వచ్చి ప్రజాస్వామ్య పద్దతిలో రౌడీలకు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. మరోవైపు సినీ కార్మికులు, కళను నమ్ముకొని బతికే కళాకారులు.. రేవంత్ రెడ్డి వంటి ఫేక్ ఆర్టిస్టులను గుర్తించాలని వారితో జాగ్రత్తగా ఉండాలని ప్రవీణ్ అన్నారు. అలాంటి ఫేక్ ఆర్టిస్టుల హామీలను నమ్మి మోసపోవద్దని సూచించారు.
‘సీఎం.. ఒక ఫేక్ ఆర్టిస్ట్’
మంగళవారం జరిగిన సినీ కార్మికుల సన్మాన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అనే ఫేక్ ఆర్టిస్టు వచ్చి రసవత్తర ప్రదర్శన చేశారన్నారని ఆర్.ఎస్ ప్రవీణ్ సెటైర్లు వేశారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అయినా ఇప్పటికీ ఒక్క ఇటుక కూడా పెట్టలేదని విమర్శించారు. ఆఖరికి సీఎం సొంత నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్ కట్టడానికి గుంత తీసి వదిలేశారని గుర్తుచేశారు. అలాంటి పాలకులు సినీ కార్మికుల కోసం ఉచిత పాఠశాల నిర్మిస్తామంటే ఎలా నమ్ముతారన్నారని మండిపడ్డారు.
Also Read: Cyclone Politics: తుపాను తుపానే.. రాజకీయం రాజకీయమే.. పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్న కూటమి పార్టీ-వైసీపీ!
‘మామూళ్లు వసూలు చేసే రౌడీలు’
టికెట్ల ధరలు పెంచగా వచ్చిన లాభాల్లో 20 శాతం కార్మికులకు ఇవ్వాలన్న ఆలోచన జూబ్లిహిల్స్ ఎన్నికల ముందే ఎందుకు వచ్చిందని ఆర్.ఎస్. ప్రవీణ్ ప్రశ్నించారు.
కార్మికులకు వాటా ఇవ్వడం ఏమోగాని.. జూబ్లీహిల్స్ లో గెలిచి వారి వద్దనే మామూళ్లు వసూలు చేయకుండా ఉంటే చాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు.. వాటా పంచే పాలకులు కాదని.. మామూళ్లు వసూలు చేసే రౌడీలు అని ఘాటుగా విమర్శించారు. అందుకే వారి మాటలు నమ్మి మోసపోవద్దని.. తర్వాత బాధపడొద్దని సినీ కార్మికులకు హితవు పలికారు.
