Aadhar Card New Rules: భారత విశిష్ట ప్రాధికార సంస్థ (Unique Identification Authority of India – UIDAI) ఆధార్ లో సరికొత్త మార్పులను తీసుకురాబోతోంది. ఆధార్ కార్డు అప్ డేట్ కు సంబంధించి నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా వినియోగదారులు.. ఇకపై ఇంటి నుంచే తమ పేరు, చిరునామా, డేట్ ఆఫ్ బర్త్, మెుబైల్ నెంబర్ వంటి ముఖ్యమైన సమాచారాన్ని అప్ డేట్ చేసుకోవచ్చు. మీ సేవా, ఆధార్ కేంద్రాలతో సంబంధం లేకుండా అత్యంత వేగంగా, సురక్షితంగా తమ వివరాలను నవీకరించేందుకు యూఐడీఏఐ అవకాశం కల్పించనుంది.
యూఐడీఏఐ కీలక ప్రకటన
నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్న నేపథ్యంలో యూఐడీఏఐ (UIDAI) కీలక ప్రకటన చేసింది. ఆధార్ అనేది ఆ వ్యక్తి పౌరసత్వానికి సంబంధించి ధ్రువీకరణ పత్రం కాదని తేల్చి చెప్పింది. అలాగే ఆధార్ లో పేర్కొన్న జనన వివరాలు.. పుట్టిన తేదీని నిర్ధారించలేవని స్పష్టం చేసింది. ఆధార్ కార్డులోని 12 అంకెల నెంబర్.. కేవలం ఆ వ్యక్తికి సంబంధించిన పరిమిత గుర్తింపు పత్రంగా మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుందని యూఐడీఏఐ పునరుద్ఘటించింది.
రాబోయే కొత్త మార్పులు
కొత్త రూల్స్ లో భాగంగా ఆధార్ వెబ్ సైట్ లో ఆటోమేటెడ్ వెరిఫికేషన్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. అప్ డేట్ చేసిన వివరాలను.. ఆ వ్యక్తి సమర్పించిన పాన్ కార్డ్, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్స్ తో సరిపోల్చి ధ్రువీకరించనున్నారు. దీని ద్వారా మానవ తప్పిదాలు తగ్గి.. డేటా విషయంలో కచ్చితత్వం పెరుగుతుంది. మరోవైపు ఆధార్ – పాన్ లింకప్ తుది గడువును డిసెంబర్ 31గా నిర్ణయించారు. జనవరి 1, 2026 నుండి ఆధార్ కు లింకప్ కానీ పాన్ కార్డులు చెల్లవని యూఐడీఏఐ స్పష్టం చేసింది.
Also Read: IND vs AUS 1st T20I: వరుణుడి సడెన్ ఎంట్రీ.. భారత్ – ఆసీస్ తొలి టీ20 రద్దు.. తర్వాతి మ్యాచ్ ఎప్పుడంటే?
ఆధార్ అప్‌డేట్ రుసుములు..
నవంబర్ 1 నుంచి ఆధార్ అప్ డేట్ రుసుముల్లోనూ మార్పులు చోటు చేసుకోనున్నాయి. యూఐడీఏఐ ప్రకారం.. జనన సంబంధ వివరాల (పేరు, పుట్టిన తేదీ, మెుబైల్ నెంబర్, ఈమెయిల్) అప్ డేట్ కోసం రూ.75 చెల్లించాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ అప్ డేట్ (వేలిముద్ర, నేత్రం, ఫొటో) రూ. 125 ఫీజు చెల్లించాలి. డాక్యుమెంట్ అప్ డేట్, ఆధార్ రీప్రింట్ కోసం ఆధార్ కేంద్రాల్లో అయితే రూ.75 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్ లైన్ రీప్రింట్ కోసం రూ.40 ఫీజుగా నిర్ణయించారు. ఇక 5-7 ఏళ్లు, 15-17 ఏళ్ల మధ్యవారికి బయోమెట్రిక్ అప్ డేట్ ఉచితం. ఇంటికి వచ్చి ఆధార్ నమోదు లేదా అప్ డేట్ చేయాలంటే మెుదటి వ్యక్తికి రూ.700 చెల్లించాలి. ప్రతి అదనపు కుటుంబ సభ్యుడికి రూ.350 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
