Pak – Afgha Conflict: పొరుగు దేశాలైన పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య సరిహద్దులో (Pak-Afghan Conflict) ఘర్షణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పరస్పర దాడులు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి అప్ఘాన్ సరిహద్దులోని పాక్టికా ప్రావిన్స్‌లో పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిలో ఎనిమిది మంది పౌరులు చనిపోయారు. వీరిలో ముగ్గురు దేశవాళీ క్రికెటర్లు కూడా ఉన్నారు. కాగా, ఇరుదేశాల నెలకొన్న పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు దేశాల మధ్య ఘర్షణను తాను పరిష్కరించాల్సి వస్తే అది తనకు సులువైన పని అని ట్రంప్ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ దాడి చేసిందని, ఆఫ్ఘనిస్థాన్‌పై దాడి జరుగుతోందనేది తాను అర్థం చేసుకున్నానని అన్నారు. ఒకవేళ తాను పరిష్కరించాల్సి వస్తే చాలా ఈజీ అని ఆయన చెప్పారు. ఇరుదేశాల మధ్య ఘర్షణను పరిష్కరించడంలో తనకు కచ్చితంగా విజయం లభిస్తుందని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం (అక్టోబర్ 17) ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కలిసి అధ్యక్షుడు ట్రంప్ మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం ఇరువురూ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా, పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ మధ్య రెండు రోజుల కాల్పుల విరమణ గడువు ముగిసిన వెంటనే శుక్రవారం రాత్రి పాక్ మళ్లీ వైమానిక దాడులు మొదలుపెట్టింది. దీంతో, ఇరుదేశాల మధ్య దోహాలో జరగాల్సిన చర్చలపై నీలినీడలు కమ్ముకున్నాయి. నిజానికి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించిన కొద్ది గంటలకే ఈ దాడి జరిగిందని డాన్ పత్రిక కథనం పేర్కొంది.
Read Also- Election Arrangements: జూబ్లీహిల్స్ ఎన్నికల ఏర్పాట్ల పై కాంట్రాక్టర్ల తర్జనభర్జన.. ఎందుకంటే?
లక్షలమందిని కాపాడాను
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజల ప్రాణాలను కాపాడానని డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. మృత్యువు నుంచి ప్రజలను కాపాడడం తనక ఇష్టమని, ఇప్పటికే లక్షలాది మంది ప్రాణాలను కాపాడానని ఆయన పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్థాన్-పాక్ యుద్ధాన్ని పరిష్కరించడంలో విజయం సాధిస్తామని తాను భావిస్తున్నానని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఏకంగా, 8 యుద్ధాలను ఆపినప్పటికీ నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవడంపై ట్రంప్ మరోసారి నిరాశ వ్యక్తం చేశారు. ‘‘నేను 8 యుద్ధాలను పరిష్కరించానని మీకు తెలుసు. నేను చేసిన ప్రతిపనిని మార్చిపోతున్నారు. జనాలు ఈ విధంగా మాట్లాడటం నాకు విచిత్రంగా అనిపిస్తోంది. నేను ఎనిమిది యుద్ధాలను పరిష్కరించాను. నేను ఒక సమస్యను పరిష్కరించిన ప్రతిసారీ, మీరు మరోపని చేస్తే నోబెల్ బహుమతి వస్తుందని అంటారు. కానీ, నాకు నోబెల్ బహుమతి రాలేదు. ఒక వ్యక్తికి వచ్చింది, ఆమె చాలా మంచి మహిళ. చాలా మంచి వ్యక్తి. ఆమె ఎవరో నాకు తెలియదు. కానీ, ఆమె చాలా ఉదారంగా ఉన్నారు. కాబట్టి, ఆ విషయాల గురించి నాకు పెద్దగా పట్టింపు లేదు. నేను కేవలం ప్రాణాలను రక్షించడం గురించి మాత్రమే ఆలోచిస్తాను’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే, తాను నోబెల్ బహుమతి కోసం ఈ పనులన్నీ చేయడం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. 2025 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరియా కొరినా మచాడో పేరును ప్రస్తావించకుండానే ట్రంప్ ఈ విధంగా స్పందించారు.
Read Also- Unbelievable Creativity: ఇంత క్రియేటివిటీనా?.. అండర్‌వేర్‌తో ఓ మహిళ ఏం తయారు చేసిందో తెలుసా?
