Election Arrangements: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గరపడుతుంది. ప్రస్తుతం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జోరుగా సాగుతుండటంతో జిల్లా ఎన్నికల యంత్రాంగం ఎన్నిక ఏర్పాట్లపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ నియోజకవర్గంలోని ఆరు డివిజన్ల పరిధిలో ఉన్న సుమారు 407 పోలింగ్ బూత్ లలో కనీస వసతుల ఏర్పాట్లు, యూసుఫ్ గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో డిస్ట్రిబ్యూషన్ కమ్ రిసెప్షన్ సెంటర్ ను ఏర్పాటు వంటి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెల్సిందే. జిల్లాలో ఏ ఎన్నికలు జరిగినా జీహెచ్ఎంసీకి చెందిన కాంట్రాక్టర్లు స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు మొదలుకుని పోలింగ్ బూత్ లలో అన్ని రకాల ఏర్పాట్లను కాంట్రాక్టు ప్రాతిపదికన ఏర్పాటు చేస్తుంటారు.
15 అసెంబ్లీ నియోజకవర్గాల ఏర్పాట్లకు..
దీంతో పాటు డిస్ట్రిబ్యూషన్ కమ్ రిసెప్షన్ సెంటర్ కు ఎలక్షన్ మెటీరియల్ అయిన ఈవీఎం(EVM)లు, వీవీ ప్యాట్(VVPAT) లతో పాటు ఇతర సామాగ్రిని తీసుకునేందుకు వచ్చే ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు టీ, టిఫిన్, భోజనాలు వంటి ఏర్పాట్లను కూడా కాంట్రాక్టు ప్రతిపాదికనే చేస్తుంటారు. కానీ 2023 నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు కాంట్రాక్టర్లు చేసిన ఏర్పాట్లకు ఒక్క హైదరాబాద్(Hyderabad) జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఏర్పాట్లకు రూ. 52 కోట్ల బిల్లులు చెల్లించటంలో జీహెచ్ఎంసీ(GHMC) అధికారులు వహించిన నిర్లక్ష్యం ఎఫెక్టు ఇపుడు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికపై పడే అవకాశముంది. ఈ ఉప ఎన్నికకు ఏర్పాట్లు చేద్దామా? లేదా బహిష్కరిద్దామా? అంటూ కాంట్రాక్టర్లు తర్జనభర్జన చేస్తున్నట్లు సమాచారం.
Also Read: GHMC: గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
బిల్లుల చెల్లింపు ఆలస్యం
ముఖ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి చాలా మంది కాంట్రాక్టర్లు సకాలంలో బిల్లులు వస్తాయని భావించి, వడ్డీకి డబ్బులు తీసుకువచ్చి మరీ ఏర్పాట్లు చేసినా, వారికి ఇంకా రూ. 27 కోట్ల బిల్లుల చెల్లింపులు పెండింగ్ లోనే ఉన్నట్లు సమాచారం. బిల్లుల చెల్లింపులకు ఆలస్యమవుతుండటంతో వడ్డీలు చెల్లించలేని కాంట్రాక్టర్లు చివరకు రాష్ట్రపతి, భారత ఎన్నికల సంఘాన్ని కూడా ఆశ్రయించటంతో దిగొచ్చిన అధికారులు రూ. 25 కోట్లను చెల్లించి, మిగిలిన చెల్లింపులను నిలిపేయటంతో ఉప ఎన్నికల ఏర్పాట్లపై కాంట్రాక్టర్లు డైలమాలో ఉన్నట్లు సమాచారం. ఎట్టకేలకు బిల్లులు చెల్లించేందుకు ఎన్నికల అధికారులు అనుమతించినా, అందుకు సంబంధించిన టోకెన్లు జనరెట్ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహారించటం పట్ల ఎన్నికల ఏర్పాట్ల పనులను బహిష్కరించాలని కాంట్రాక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. ఈ బిల్లులకు సంబంధించిన ఫైల్ ఓ అదనపు కమిషనర్ లాగిన్ లో రెండు నెలలుగా పెండింగ్ లో ఉన్నట్లు కాంట్రాక్టర్లు చెబుతున్నారు.
కాంట్రాక్టర్ల అవతారమెత్తిన ఇంజనీర్లు
సిటీలో ఏ ఎన్నికలొచ్చినా, అసలైన కాంట్రాక్టర్లకు పనులు దక్కటం అంతంతమాత్రమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీహెచ్ఎంసీలోని కొందరు ఇంజనీర్లు ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన కాంట్రాక్టర్ల అవతారమెత్తుతున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. కొందరు ఇంజనీర్లు తమ బంధువుల పేరిట కాంట్రాక్టులు కొట్టేస్తుంటే, మరి కొందరు కాంట్రాక్టర్లను తమ బినామీలుగా పెట్టుకుని పనులు దక్కించుకుంటున్నట్లు తెలిసింది. ఖైరతాబాద్ జోన్ లోని ఓ ఇంజీనీర్ తన పరపతిని వినియోగించి, ప్రస్తుతం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు కాంట్రాక్టును దక్కించుకున్నట్లు తెలిసింది.
ఇదే ఇంజనీర్ 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మాసాబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ పనులను బినామీల ద్వారా దక్కించుకుని పూర్తి చేసినట్లు ఆరోపణలున్నాయి. స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు పనుల్లో భాగంగా ఉదయం నుంచి నిర్మించిన స్ట్రాంగ్ రూమ్ గది గోడ రాత్రి కూలిపోయినట్లు సమాచారం. విషయం బయటకు రాకుండా సదరు ఇంజనీర్ ఇతర అధికారులను, సిబ్బందిని మేనేజ్ చేసినట్లు అప్పట్లో చర్చ జరిగింది. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ బూత్ లలో ఏర్పాట్ల కాంట్రాక్టును దక్కించుకునే సదరు ఇంజనీర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
Also Read: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మరో సంకల్పం.. కార్పొరేట్ తరహాలో సర్కారు బడులు
