Pak Afghan Clashes: పొరుగు దేశాలైన పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థాన్ మధ్య సరిహద్దు ప్రాంతం దాడులు, ప్రతిదాడులతో (Pak Afghan Clashes) పరిస్థితులు భీకరంగా మారిపోయాయి. తమ భూభాగంగా పాకిస్థాన్ దాడులకు పాల్పడిందని, ఆఫ్ఘనిస్థాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించిందని తాలిబాన్ల ప్రభుత్వం మండిపడుతోంది. తాలిబాన్ బలగాలు ప్రతీకార దాడులు చేపడుతున్నాయి. శనివారం పాకిస్థాన్ ఆర్మీపై పలుచోట్ల సాయుధ దాడులకు దిగాయి. భీకర కాల్పులు జరిపాయి.
పాకిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితిపై తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఆదివారం కీలక ప్రకటన చేశారు. డురండ్ లైన్ (పాక్-అఫ్ఘాన్ సరిహద్దు పేరు) వద్ద బెహ్రాంపూర్ జిల్లాలో ప్రతిదాడులు జరిపి పాకిస్థాన్ ఆర్మీకి చెందిన 58 మంది సైనికులను హతమార్చినట్లు వెల్లడించారు. మరో 30 మందికిపైగా సైనికులు గాయపడ్డారని వివరించారు. ప్రతిదాడుల్లో తాలిబాన్ బలగాలకు చాలా ఆయుధాలు లభించాయని అన్నారు. అయితే తమవైపున కూడా 20 మందికి పైగా మృతి చెందారని, కొందరు గాయపడ్డారని ముజాహిత్ వివరించారు. ‘‘మా భూభాగంలో దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోం గుర్తుంచుకోండి. ప్రతి దాడికీ ప్రతిచర్య ఉంటుంది’’ అని జబీహుల్లా ముజాహిత్ హెచ్చరించారు. పాకిస్థాన్ తన భూభాగంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోందని ఆరోపించారు. పైకి ఏమీ తెలియనట్టుగా నాటకాలు ఆడుతోందని అన్నారు.
దేశ గగన, భూ సరిహద్దులను కాపాడుకునే హక్కు తమకు ఉందని, దాడులకు ప్రతిస్పందన ఇవ్వకుండా ఉండబోమని స్పష్టంగా హెచ్చరించారు. తమ దేశంలో దాక్కున్న ముఖ్యమైన ఐఎస్ఐఎస్ సభ్యులను బహిష్కించాలని, లేదంటే ఇస్లామిక్ ఎమిరేట్‌కు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఐఎస్ఐఎస్ సంస్థ ఇటు ఆఫ్ఘనిస్థాన్‌తో పాటు ప్రపంచంలోని అనేక దేశాలకు ముప్పుగా పరిణమించిందని జబీహుల్లా ముజాహిత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ మధ్య హింసాత్మక దాడులను ఖతార్, సౌదీ అరేబియా అభ్యర్థన మేరకు నిలిపివేసినట్టు ముజాహిద్ తెలిపారు.
పశ్తూఖ్వాలో ఐఎస్ఐఎస్ శిబిరాలు
పాకిస్థాన్‌లోని పశ్తూన్‌ఖ్వా కేంద్రంగా ఐఎస్ఐఎస్ శిబిరాలను పాకిస్థాన్ ఏర్పాటు చేసిందని ఆఫ్ఘనిస్థాన్ తెలిపింది. అశాంతి, అల్లర్లకు కారణమైనవారిని తాము తొలగించివేయగా, వారు ఇప్పుడు పశ్తూన్‌ఖ్వా ప్రాంతంలో కొత్త శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారని జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. కరాచీ, ఇస్లామాబాద్ ఎయిర్‌పోర్టుల ద్వారా ఈ ఉగ్రవాద శిబిరాలకు సభ్యులను తరలించారని, అక్కడి నుంచే ఆఫ్గనిస్థాన్ భూభాగంపై దాడులకు సైతం ప్రణాళికలు రచిస్తున్నారని, ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని చెప్పారు.
Read Also- Minister Vakiti Srihari: తెలంగాణ సాదనలో సోనియా గాంధీ మద్దతు కీలకం: మంత్రి వాకిటి శ్రీహరి
గురువారం ఆఫ్గనిస్థాన్‌లో పేలుళ్లు
గత గురువారం అఫ్ఘానిస్తాన్‌లో మూడు పేలుళ్లు సంభవించాయి. కాబూల్ నగరంలో రెండు, పక్తికాలో ఒక పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లకు కారణం పాకిస్థానేనని తాలిబాన్ ప్రకటించింది. అయితే, ఈ దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్థాన్ ఖండించింది. టీటీపీకి (తెహ్రీక్ ఈ తాలిబన్) చెందినవారికి ఆశ్రయం ఇవ్వడం మానుకోవాలని ఆఫ్ఘనిస్థాన్ కోరింది.
