Minister Vakiti Srihari: దేశంలోని చిట్టచివరి వ్యక్తికి సామాజిక న్యాయం అందించడం కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుందని రాష్ట్ర క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి(Minister Vakiti Srihari) అన్నారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆలోచనల మేరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) రాష్ట్రంలో బీసీ(BC)లకు 42 శాతం రిజర్వేషన్ల ప్రక్రియను ప్రారంభించారని ఆయన స్పష్టం చేశారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల నాయకులు, బీఆర్‌ఎస్ నాయకులు మంత్రి వాకిటి శ్రీహరి, మహబూబ్ నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
1930 తర్వాత దేశంలో..
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ‘జితిని ఆబాది – ఉతిని ఇస్థిదార్’ (ఎంత జనాభా ఉంటే అంత వాటా) అనే నినాదంతో, దేశంలోని సామాజిక వర్గాల జనాభాకు అనుగుణంగా అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలని దేశవ్యాప్తంగా ‘భారత్ జోడో యాత్ర’ చేశారని మంత్రి గుర్తుచేశారు. 1930 తర్వాత దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కులగణన చేపట్టి బీసీల పట్ల తమ నిబద్ధతను చాటుకుందని తెలిపారు. కేంద్రంలో రాహుల్, రాష్ట్రంలో రేవంత్ ఇద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందినవారు కానప్పటికీ, బీసీ రిజర్వేషన్ల కోసం కృషి చేస్తున్నారన్నారు. గతంలో తమిళనాడులో 50 శాతం రిజర్వేషన్లు దాటినా, అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ఆ ప్రక్రియకు అనుమతినిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు తమ మంత్రిమండలి న్యాయపరమైన అన్ని చిక్కులను అధిగమించడానికి న్యాయస్థానంలో ఉద్దండులైన న్యాయవాదులచే సమర్థవంతంగా వాదనలు వినిపిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాల దిగజారుడు విమర్శలను తాము పట్టించుకోమన్నారు.
Also Read: Moles: పుట్టుమచ్చల వలన క్యాన్సర్ వస్తుందా ? దీనిలో నిజమెంత?
ప్రభుత్వం న్యాయ పోరాటం..
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చట్టపరంగా అన్నింటినీ అధిగమించి, ఎన్నికలకు వెళ్తే అది జీర్ణించుకోలేక కొందరు కోర్టుకు వెళ్లారని, ఇది చాలా బాధాకరమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో, బీసీ మంత్రులు సుప్రీంకోర్టులో పోరాటం చేసైనా రిజర్వేషన్ అమలు అయ్యేలా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని పునరుద్ఘాటించారు. సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ప్రజలకు అండగా నిలబడ్డారని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ద్వారా విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థ ఎన్నికల్లో అవకాశం కల్పించేందుకు అసెంబ్లీలో చర్చించి, ఆర్డినెన్సును తెచ్చి జీవో జారీ చేశామని గుర్తు చేశారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు సంజీవ్ ముదిరాజ్, మిథున్ రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read: Jangaon: జనగామలో 108 ఆలస్యం.. ఆటోలోనే అరుదైన డెలివరీ చేసిన ఆశ వర్కర్లు!
