Indian Railways: భారతీయ రైల్వేలో అతి కష్టమైన అంశం ఏదైనా ఉందంటే అది టికెట్లు బుక్ చేయడమే. రైలులో ఒక్క టికెట్ బుక్ చేయాలంటేనే నెల రోజుల ముందే ప్రిపేర్ గా ఉండాల్సి ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న రిజర్వేషన్ సీటు కోల్పోవడం ఖాయం. అలాంటిది బంధువులు, ఫ్రెండ్స్, తోటి ఉద్యోగులతో దాదాపు 40-50 మంది హ్యాపీగా ఒకే బోగిలో వెళ్లడం ఇక పూర్తిగా అసాధ్యమని చాలా మంది భావిస్తుంటారు. అయితే కారు, బస్ ను బుక్ చేసినట్లు ఏకంగా ఒక రైలు లేదా కోచ్ మెుత్తాన్ని బుక్ చేసేకునే వెసులుబాటు రైల్వేలో ఉంది. వివాహాలు, ప్రత్యేక ఈవెంట్ల కోసం ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు.
వివరాల్లోకి వెళ్తే..
దేశంలోని ఇతర రవాణా వ్యవస్థలతో పోలిస్తే భారతీయ రైల్వే అత్యంత చౌకైనది. పైగా ఎక్కువ మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో రైళ్లు కీలక పాత్ర పోషిస్తుంటాయి. కాబట్టి రైలులో ప్రయాణించడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే పండుగలు, పెళ్లిళ్లు, ప్రత్యేకమైన ఈవెంట్ల కోసం కుటుంబ సభ్యులు, బంధువులు అంతా కలిసి వెళ్లేందుకు ఒక కోచ్ ను బుక్ చేసుకునే వెసులుబాటును భారతీయ రైల్వే కల్పించింది. ఐఆర్ సీటీసీ యాప్ తో పని లేకుండా ఇందుకోసం ఒక ప్రత్యేక వైబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఎలా బుక్ చేయాలి?
ప్రత్యేకంగా రైలు లేదా కోచ్ లను బుక్ చేసుకునేందుకు ఐఆర్ సీటీసీ ఫుల్ టారిఫ్ రేట్ (IRCTC Full Tariff Rate – FTR) పేరుతో కొత్త వెబ్ సైట్ https://www.ftr.irctc.co.in/ftr/ అందుబాటులో ఉంది. కోచ్ బుక్ చేసుకోదలిచిన వారు ముందుగా ఎఫ్‌టీఆర్ (FTR) వెబ్‌సైట్‌లో అకౌంట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత అందుబాటులో ఉన్న రైళ్లను పరిశీలించి.. మీరు ప్రయాణించదలిచిన నగరాలను ఎంచుకోవాలి. అనంతరం అక్కడ సూచించిన అమోంట్ ను చెల్లిస్తే కోచ్ లేదా రైలు మీరు కోరుకున్న తేదీకి రెడీగా ఉంటుంది. ఆన్ లైన్ లో కాకుండా ఆఫ్ లైన్ లోనూ రైలు లేదా కోచ్ బుక్ చేసుకోవచ్చు. సమీప రైల్వే స్టేషన్ కు వెళ్లి బుకింగ్, చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
మూడు రకాల బుకింగ్స్..
అయితే ఎఫ్‌టీఆర్ వెబ్ సైట్ లో మూడు రకాల బుకింగ్స్ అందుబాటులో ఉంటాయి. ట్రైన్ చార్టర్స్ (రైలు మెుత్తాన్ని బుక్ చేసుకోవడం), కోచ్ చార్టర్స్ (ఒకటి లేదా ఎక్కువ కోచ్‌లను బుక్ చేసుకోవడం), సెలూన్ చార్టర్స్ (ప్రత్యేక కోచ్‌ల బుకింగ్) ఆప్షన్స్ మీకోసం ఇస్తారు. అయితే ప్రతి కోచ్ బుకింగ్‌కి రూ.50,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. దూరం, స్టాప్‌ల సంఖ్య, అందించే సేవల ఆధారంగా ఇతర ఛార్జీలు నిర్ణయిస్తారు.
Also Read: Bigg Boss Telugu Promo: వారంలో తప్పులు చేసి.. వీకెండ్‌లో ఒప్పుకుంటే కుదరదు.. నాగ్ మామ వైల్డ్ ఫైర్!
కొన్ని రైళ్లు మాత్రమే?
కోచ్ లేదా రైలును బుక్ చేసుకునే వెసులుబాటు అన్ని రైళ్లకు ఉండదు. మెయిల్, ఎక్స్ ప్రెస్, ఇంటర్ సిటీ రైళ్లు మాత్రమే బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎఫ్‌టీఆర్ వెబ్ సైట్ లో ఈ విషయాన్ని స్పష్టంగా భారతీయ రైల్వే తెలియజేసింది. రాజధాని, శతాబ్ది, దొరంతో, వందే భారత్ వంటి రైళ్లు.. ఎఫ్ టీఆర్ వెబ్ సైట్ చార్టర్స్ లో అందుబాటులో లేవు. అయితే పండుగ సీజన్లలో ఈ రైలు, కోచ్ బుకింగ్స్ పై కొన్ని పరిమితులు విధించవచ్చు. ఎందుకంటే పండుగ సీజన్లలో భారతీయ రైల్వే.. స్పెషల్ ట్రైన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. కాబట్టి బుకింగ్స్ లో అంతరాయం కలుగవచ్చు.
